• facebook
  • whatsapp
  • telegram

న‌ల్ల‌ధ‌నంతో దెబ్బ‌తింటున్న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌

 

నల్లధనమనేది ధనస్వాములకు, పన్ను అధికారులకు, పాలకులకు మాత్రమే సంబంధించిన సమస్య అని చాలామంది అనుకుంటారు. సామాన్యుడికి దానితో సంబంధమే లేదని భావిస్తారు. ఇలా అనుకోవడం పొరపాటే! నల్లధనం అనేది లెక్కల్లో చూపనిది కాబట్టి దానిపై ప్రభుత్వానికి పన్నులు రావు. పన్నుల ఆదాయం రాకపోతే సామాన్యుడికి విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతులు అందించడానికి ప్రభుత్వం వద్ద చాలినన్ని నిధులు ఉండవు. అందువల్ల నల్లధనాన్ని కట్టడి చేయకపోతే చివరకు నష్టపోయేది సామాన్యులే. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నల్లధనం నానాటికీ ఊడల మర్రిలా విస్తరిస్తోంది. రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61) కాలంలో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో అయిదు శాతంగా ఉన్న నల్లధనం 2010కల్లా 50శాతానికి, 2016-17లో జీడీపీలో 62శాతానికి, 2020కల్లా జీడీపీకి సరిసమాన స్థాయికి పెరిగింది. ఇటీవల నల్లధనం జీడీపీకన్నా 20శాతం మించిపోయి 120శాతానికి చేరి ఉండవచ్చని పార్లమెంటరీ స్థాయీసంఘం తేల్చింది. అందుకే నల్లధనాన్ని సమాంతర ఆర్థిక వ్యవస్థగా పరిగణిస్తున్నారు.

 

ఎఫ్‌డీఐల పేరుతో...

స్థిరాస్తి రంగం, గనులు, మౌలిక వసతులు, ఫార్మా, పాన్‌మసాలా, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు, సినీ పరిశ్రమ, బంగారం, వ్యాపార సరకులు, ప్రైవేటు విద్యాసంస్థలు, వైద్య, ఆడిటింగ్‌ రంగాల్లో నల్లధనం ఎక్కువనే వాదనలు ఉన్నాయి. 1948-2008 మధ్యకాలంలో భారత నల్లధనస్వాములు దేశం వెలుపలికి దాటించిన అక్రమ ఆస్తుల విలువ దాదాపు రూ.35 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అందులో పన్ను స్వర్గాల్లో దాచిన సొమ్ము కొంత అయితే, చట్టబద్ధమైన పెట్టుబడులుగా రూపుమార్చుకొని భారత్‌లోకి ప్రవేశించిన సొమ్ము మరికొంత. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), హవాలా మార్గాలతోపాటు ఎగుమతి దిగుమతి ధరల్లో అవకతవకల ద్వారా నల్లధనం గోడకు కొట్టిన బంతిలా వెనక్కు వస్తోంది. కేంద్ర పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) లెక్కల ప్రకారం, 2000-2011 మధ్యకాలంలో భారత్‌లోకి ప్రవహించిన ఎఫ్‌డీఐలలో 41.80శాతం మారిషస్‌ నుంచి, 9.17శాతం సింగపూర్‌ నుంచి వచ్చాయి. ఎఫ్‌డీఐల విషయంలో ఆ రెండు దేశాలదే అగ్రస్థానం. అంత చిన్న దేశాలనుంచి భారీమొత్తంలో పెట్టుబడులు రావడం అసాధ్యం. భారతీయులే తమ నల్లధనాన్ని మారిషస్‌, సింగపూర్‌లద్వారా స్వదేశానికి తీసుకొచ్చారని స్పష్టమవుతోంది. ఎఫ్‌డీఐల పేరు చెప్పి నల్లధనాన్ని సక్రమ ధనంగా చలామణీ చేయడం వారి ఉద్దేశం. పార్టిసిపేటరీ నోట్లు, గ్లోబల్‌ డిపాజిటరీ రసీదుల రూపంలోనూ నల్లధనం భారతీయ స్టాక్‌ మార్కెట్లలోకి ప్రవేశిస్తోంది. నల్లధన స్వాములు స్టాక్‌ మార్కెట్లలో సంపాదించిన సొమ్మును మళ్ళీ ఇక్కడ చట్టబద్ధంగా పెట్టుబడిగా పెడుతున్నారు. 2012లో భారత ప్రభుత్వం ప్రచురించిన శ్వేత పత్రం ఈ అంశాలను బయటపెట్టింది. కంపెనీల ఏర్పాటు వంటి చట్టబద్ధమైన కార్యకలాపాలనూ నల్లధనాన్ని తెలుపుగా మార్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు.

 

విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచిన నల్లధన పరిమాణం గురించి కచ్చితమైన లెక్కలు లేవు. భారీ పన్ను మినహాయింపునిచ్చే విదేశాలను పన్ను స్వర్గాలంటున్నారు. అక్కడ భారతీయులు దాచిన అక్రమ ధనం రూ.38 లక్షల కోట్లకుపైనే ఉంటుందని సీబీఐ సంచాలకులు 2011లో సుప్రీంకోర్టుకు తెలియజేశారు. మరే దేశమూ ఇంత భారీ నల్లధనాన్ని విదేశాలకు తరలించలేదు. 2020లో స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు, భారతీయ కంపెనీలు దాచిన సొమ్ము రూ.20,700 కోట్లని స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంకు వెల్లడించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం 2015లో నల్లధన నిర్మూలన చట్టం తెచ్చింది. నల్లధనాన్ని అడ్డుకోవడానికంటూ 2016 నవంబరులో పెద్ద నోట్లను రద్దు చేసింది. నల్లధనం ప్రధానంగా కరెన్సీ రూపంలో ఉండదు కాబట్టి పెద్దనోట్ల రద్దు సరైన ప్రభావం చూపలేకపోయిందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.

 

పేదరికానికి ప్రత్యక్ష కారణం

నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా పనిచేస్తూ అసలు సిసలు ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ప్రభుత్వం చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతిపరులు చేతివాటం ప్రదర్శిస్తారన్నది అందరికీ తెలిసిన సత్యం. పాఠశాల భవనాలు, రేవులు, రహదారుల నిర్మాణం, ఆస్పత్రులకు మందులు, వైద్య సాధనాల కొనుగోలు, రైతులకు ఎరువులు, విత్తనాల సరఫరా... ఇలా అన్నింటిలో అవినీతి చోటుచేసుకుంటోంది. చాలా కంపెనీలకు పన్నుల ఎగవేత ఆనవాయితీగా మారింది. ఏతావతా ప్రభుత్వానికి ఆదాయం పడిపోయి ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, సెస్సులు పెంచాల్సి వస్తుంది. అవి మళ్ళీ పేదలు, మధ్యతరగతికే భారంగా మారతాయి. ద్రవ్యోల్బణం పెరిగి ధరలు జోరందుకుంటాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి పెట్టుబడులు అందక, యువతకు ఉపాధి అవకాశాలు తరిగిపోతాయి. అందువల్ల నల్లధనం పేదరికానికి ప్రత్యక్ష కారణమవుతోంది. నల్లధన వ్యాప్తిలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల పాత్రను 2012లో ఎం.సి.జోషి కమిటీ బయటపెట్టింది. 2011లో ఆ రెండు పార్టీలు తమ వార్షిక ఆదాయాన్ని రూ.500 కోట్లు, రూ.200 కోట్లుగా చూపాయి. గడచిన పదేళ్లలో ప్రతి ఎన్నికకూ అవి రూ.10,000 కోట్లు, రూ.15,000 కోట్ల చొప్పున ఖర్చుచేశాయి. నల్లధన కట్టడికి 2018లో కేంద్రం ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చినా, అందులో పారదర్శకత లేదని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఎన్నికల బాండ్ల వ్యవహారం సుప్రీం కోర్టు విచారణలో ఉంది. అవినీతిపరులైన రాజకీయ నాయకులు, వ్యాపారులు, అధికారుల మధ్య అపవిత్ర పొత్తును ఛేదించనిదే నల్లధన భూతాన్ని తరిమికొట్టలేం

 

తలసరి ఆదాయానికి గండి

కొవిడ్‌ మహమ్మారికి ముందు భారత ఆర్థిక వ్యవస్థ ఏటా ఏడు శాతం వృద్ధి రేటు నమోదు చేసేది. నల్లధనం లేకుంటే 12శాతం వృద్ధి రేటును అందుకోగలిగేవాళ్లమని విఖ్యాత ఆర్థికవేత్త అరుణ్‌ కుమార్‌ అంచనా వేశారు. ఆ లెక్కన భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్నదానికన్నా ఎనిమిదిరెట్లు ఎక్కువ పరిమాణం సంతరించుకునేది. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం భారత జీడీపీ 2.7 లక్షల కోట్ల డాలర్లు. అరుణ్‌ కుమార్‌ చెప్పినట్లు నల్లధనాన్ని పరిహరించి ఉంటే అది 18 లక్షల కోట్ల డాలర్లకు చేరేది. అప్పుడు భారతీయుల తలసరి ఆదాయం ఇప్పుడున్న రూ.1.14 లక్షలు కాకుండా, రూ.9.89 లక్షలకు చేరేది. కాబట్టి నల్లధనం కేవలం మూడు శాతం జనాభా చేతిలో ఉన్నా, అది మిగిలిన ప్రజలను పేదరికంలో ఉంచుతోంది. తీవ్ర ఆర్థిక అసమానతలకు కారణమవుతోంది.

 

 

 

 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 19-03-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం