• facebook
  • whatsapp
  • telegram

ఆత్మనిర్భరతే శ్రీరామరక్ష

ఊపందుకోవాల్సిన పరిశోధనలు

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను నిలువరించడంలో ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి, అమెరికా, ఐరోపాల వైఫల్యం ప్రస్ఫుటమైంది. ఈ పరిణామం బలవంతుడిదే రాజ్యమన్న సూక్తిని మరోసారి గుర్తుచేసింది. అంతర్జాతీయ నియమ నిబంధనలు, చర్చలతో పరిష్కారాల వంటి మూస ప్రక్రియలోని లోపాల్ని బయటపెట్టింది. అమెరికా, నాటోలు ఉక్రెయిన్‌కు ఆయుధాలను, గూఢచర్య సమాచారాన్ని అందించి, రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడం వరకు బాగానే ఉంది. ప్రత్యక్షంగా బరిలోకి దిగి రష్యన్‌ సేనలతో పోరాడటానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనించాలి. భవిష్యత్తులో జపాన్‌, దక్షిణ కొరియా, తైవాన్‌లపై చైనా, ఉత్తర కొరియాలు దాడికి పాల్పడితే    అమెరికా యుద్ధంలో పాల్గొంటుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఆ సంగతి అటుంచితే అణ్వస్త్ర రాజ్యాలైన చైనా, పాకిస్థాన్‌ల నుంచి రెండు వైపులా ముప్పు ఎదుర్కొంటున్న భారత్‌ సంగతేమిటి? రష్యాను అడ్డగించడంలో అంతర్జాతీయ సమాజం విఫలమైందనే ధీమాతో చైనా రేపు వాస్తవాధీన రేఖ వెంబడి దుందుడుకు చర్యలకు తెగబడినా ఆశ్చర్యం లేదు. అమెరికా, ఐరోపాలు విధించిన ఆర్థిక ఆంక్షల నుంచి గట్టెక్కడానికి సతమతమయ్యే రష్యా- భారత్‌ను ఆదుకోగల స్థితిలో ఎటూ ఉండదు. మరి, అలాంటి పరిస్థితిలో భారత్‌ ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందా అని ప్రశ్నించుకుంటే అంత సంతృప్తికరమైన సమాధానం లభించదు. మార్చి 18న ఆర్డ్‌నెన్స్‌ కర్మాగారాల దినోత్సవాన్ని జరుపుకొంటున్న క్రమంలో ఆయుధ వ్యవస్థ, రక్షణ రంగంలో భారత స్వావలంబన స్థితిగతుల్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

దక్కని ఫలితాలు

రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించే దిశగా భారత్‌ ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తోంది. అయితే, ఈ రంగంలో స్వావలంబనకు మోదీ ప్రభుత్వం చేపట్టిన కృషి ఇంకా ఆశించిన ఫలితాలను అందివ్వలేదు. శత్రువు దాడి చేస్తే ఎదుర్కోవడానికి కావలసిన ఆయుధాలన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం- ఆత్మనిర్భరత అనిపించుకోదు. 2017-21 మధ్య కాలంలో ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్నది భారతదేశమేనని స్టాక్‌హోమ్‌లోని రక్షణ అధ్యయన సంస్థ ‘సిప్రి’ తాజా నివేదిక వెల్లడించింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారత్‌ రక్షణ రంగంలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమం చేపట్టినా ఆశించిన ఫలితాలు ఇంకా సిద్ధించవలసి ఉంది. అణ్వస్త్రాలతోపాటు క్షిపణి కార్యక్రమంలో భారత్‌ స్వావలంబన సాధించిన మాట నిజం. సొంతంగా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ట్యాంకులు, ఫిరంగుల తయారీలో వడివడిగా ముందడుగు వేస్తున్నా- అత్యాధునిక ఆయుధాల్లో ఆత్మనిర్భరత ఇంకా ఆమడ దూరమే. ఫైటర్‌, బాంబర్‌ విమానాలకు ఇంజినే ఆయువుపట్టు. సొంత ఇంజిన్‌ లేకుండా గగనతల రక్షణలో స్వావలంబన అసాధ్యం. తేజస్‌ యుద్ధ విమానంలో అమర్చడానికి కావేరి ఇంజిన్‌ తయారయ్యేలోపు తేజస్‌కు మరింత శక్తిమంతమైన ఇంజిన్‌ కావలసి వచ్చింది. దాంతో కావేరిని పక్కనపెట్టి అమెరికా నుంచి జీఈ ఇంజిన్‌ దిగుమతి చేసుకోక తప్పడం లేదు. అత్యాధునిక యుద్ధ విమానం ‘అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌- అమ్కా’ కోసం ఇంజిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి ఫ్రెంచి సంస్థ శాఫ్రాన్‌తో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) చేతులు కలుపుతోంది. ఆధునిక ఆయుధాలను భారత గడ్డపై తయారు చేయడానికి విదేశ సంస్థలను ఆహ్వానించినా, ఆశించిన ఫలితాలు లభించడం లేదు. భారత్‌ నుంచి రక్షణ కాంట్రాక్టులు పొందిన విదేశ కంపెనీలు- ఇక్కడ తమ ఆయుధాల కూర్పు చేపడుతున్నాయే తప్ప పూర్తిస్థాయిలో తయారు చేయడం లేదు. ప్రస్తుతానికైతే రష్యన్‌ విడిభాగాలు లేనిదే మన యుద్ధ విమానాలు    ఎగరలేవు, మన నౌకలు సముద్రంలో తిరగలేవు. రెండింటినీ పూర్తిగా స్వదేశంలోనే అభివృద్ధి చేయాలంటే మరిన్ని దశాబ్దాలు పట్టేలా ఉంది.

అత్యాధునికత వైపు...

తూర్పు సరిహద్దులో భారత్‌ పెద్దయెత్తున సొరంగాలు, రహదారులు, వంతెనలు ఇతర మౌలిక వసతులను నిర్మిస్తూ, చైనా దాడుల్ని సమర్థంగా ఎదుర్కోవడానికి సమాయత్తమవుతోంది. పోరాటంలో కాకలుతీరిన భారతీయ జవాన్లు భూతలం మీద చైనా సైనికులను చిత్తు చేయగలరని గల్వాన్‌ ఘర్షణలు నిరూపించాయి. కానీ, గగనతలం నుంచి భూతల  సేనలను చిత్తు చేయవచ్చని ఇజ్రాయెల్‌, టర్కీ డ్రోన్లు ఇప్పటికే చాటిచెప్పాయి. ఈ క్రమంలో వీటిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. పోనుపోను కృత్రిమ మేధతో నడిచే స్వయంచాలిత డ్రోన్లు, క్షిపణులు రంగప్రవేశం చేస్తాయి. ఇప్పటికీ డ్రోన్ల రంగంలో భారత్‌ స్వయంసమృద్ధం కాకపోవడం ఆందోళనకర అంశం. ఇంతవరకు ఇజ్రాయెలీ నిఘా డ్రోన్లపై ఆధారపడుతున్న భారత్‌, వాటికి బాంబులు అమర్చే పని మొదలుపెట్టింది. స్వయంగా తయారు చేస్తున్న రుస్తుం-2 క్షిపణి ఇంకా బరిలో దిగలేదు. మరోవైపు డ్రోన్ల తయారీలో చైనా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. చివరకు పాకిస్థాన్‌ కూడా బురాక్‌ అనే డ్రోన్‌ను తయారుచేసి అఫ్గాన్‌ సరిహద్దులో ప్రయోగించింది. భారత్‌ త్వరగా డ్రోన్ల రంగంలో ఆత్మనిర్భరత సాధించాలి. కృత్రిమ మేధతో జట్టుగా పోరాడే డ్రోన్ల దండును సిద్ధం చేసుకోవాలి. మన సేనలకు ఎలెక్ట్రానిక్‌ పోరాట సామర్థ్యాన్ని సమకూర్చాలి. సైబర్‌, అంతరిక్ష, సమాచార రంగాల్లో దెబ్బకాచుకుని, దెబ్బతీసే పాటవాన్ని సంతరించుకోవాలి. దీనికోసం రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చించాలి. రక్షణ రంగంలో     పరిశోధన అభివృద్ధికి చైనా దండిగా నిధులు వెచ్చిస్తుండగా, భారత్‌ వ్యయాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. మైక్రోఎలెక్ట్రానిక్స్‌, హైపర్‌ సోనిక్స్‌, కృత్రిమ మేధ, సైబర్‌ భద్రత, 5జీ నెట్‌వర్కింగ్‌, మానవ రహిత డ్రోన్లు దేశ రక్షణకు ఎంతో కీలకం. ఇలాంటి అత్యాధునిక అంశాల్లో పైచేయి సాధించాలంటే భారత్‌ తన రక్షణ పరిశోధనలపై మరింతగా దృష్టి కేంద్రీకరించాలి. తక్షణమే వ్యయాలనూ పెంచాలి.

దూసుకొస్తున్న డ్రోన్లు

ఆధునిక యుద్ధరంగంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 1982లో సిరియాపై ఇజ్రాయెల్‌ ప్రయోగించిన మానవ రహిత డ్రోన్లను చూసి సిరియా రాడార్లు అప్రమత్తం కావడంతో అవి ఎక్కడున్నాయో ఇజ్రాయెల్‌కు తెలిసిపోయింది. ఆ రాడార్లను ధ్వంసం చేయడానికి ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు రంగంలోకి దిగగా, వాటిని అడ్డుకోవడానికి సిరియా యుద్ధవిమానాలు దూసుకొచ్చాయి. అయితే, సిరియా విమానాల ఎలెక్ట్రానిక్‌ యంత్రాంగాన్ని ఇజ్రాయెల్‌ నిస్తేజం చేసింది. ఎలెక్ట్రానిక్‌ జామింగ్‌ ప్రక్రియ ద్వారా ఇజ్రాయెల్‌ 82 సిరియా ఫైటర్లను కూల్చేసింది. ఈ పోరులో ఒకే ఒక్క ఇజ్రాయెలీ విమానం నేలకూలింది. 2020లో అజర్‌ బైజాన్‌ కూడా ఇదే తరహా ఎత్తుగడ వేసింది. టర్కీ సరఫరా చేసిన బైరక్తార్‌ డ్రోన్లతో అర్మీనియా క్షిపణి వ్యవస్థలు, ట్యాంకులు, మోటారు వాహనాలను తుత్తునియలు చేసింది. ఫలితంగా ఆ దేశం దిగిరాక తప్పలేదు. చిన్నచిన్న చౌక డ్రోన్లతో ఒక దేశాన్ని ఓడించడం చరిత్రలో అదే ప్రథమం.

 

- కైజర్‌ అడపా

 

 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 18-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం