• facebook
  • whatsapp
  • telegram

గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ ఇలాగేనా

ఏపీపీఎస్సీని నిలదీసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: గ్రూప్‌-1 పరీక్షను ఎపీపీఎస్సీ నిర్వహించిన తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. పరీక్ష నిర్వహించేది ఇలాగేనా అని నిలదీసింది. ప్రశ్నపత్రంలో 50కిపైగా తప్పులు ఏమిటని ప్రశ్నించింది. ఆంగ్ల ప్రశ్నలను తెలుగులోకి సక్రమంగా అనువాదం చేసే సామర్థ్యం లేదా.. నిపుణులేం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. అభ్యర్థుల భవిష్యత్తు పట్టదా అంటూ మండిపడింది.  గ్రూప్‌ 1 పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించేందుకు నిరాకరిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన రెండు అప్పీళ్లపై  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పును రిజర్వు చేస్తూ వాయిదా వేసింది. 2018 డిసెంబర్లో 169 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ ప్రకటన జారీచేసింది. ప్రాథమిక ప్రశ్నపత్రంలో 120 ఆంగ్ల ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేసే సందర్భంగా 51 తప్పులున్నాయని, నాన్‌ ప్రోగ్రామబుల్‌ క్యాలిక్యులేటర్లును పరీక్ష సమయంలో అనుమతించలేదని అందువల్ల ఆ పరీక్షను రద్దు చేసి తాజాగా పరీక్ష నిర్వహించాలని కొంత మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆ పరీక్షను రద్దు చేయడానికి నిరాకరిస్తూ గతేడాది అక్టోబర్‌ 22న తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ షేక్‌ షానవాజ్‌ మరికొందరు అప్పీల్‌ వేశారు. వారి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌, న్యాయవాది జె.సుధీర్‌ వాదనలు వినిపించారు. ప్రశ్నల్లో భారీగా తప్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని కోరారు. ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రశ్నపత్రంలో వచ్చిన తప్పులకు అందరి అభ్యర్థులకూ సమానంగా మార్కులు ఇచ్చామన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ మీరే తప్పులున్నాయని అంగీకరిస్తున్నారని, అందరికి సమానంగా మార్కులు ఇచ్చామని అఫిడవిట్‌లో ఎక్కడ పేర్కొన్నారని నిలదీసింది. ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పును వాయిదా వేసింది. గ్రూప్‌ 1 ప్రాథమిక పరీక్ష గతంలోనే పూర్తయింది. సింగిల్‌ జడ్జి తీర్పు తర్వాత ప్రధాన పరీక్ష సైతం నిర్వహించారు. ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్న విషయం తెలిసిందే.

ప్రాథమిక ఆధారాలు లేకుండా పిల్‌ వేస్తారా!

దేవాదాయశాఖకు చెందిన రూ.24.24కోట్ల నిధులు అమ్మఒడి పథకానికి మళ్లించేందుకు ప్రభుత్వం జీవో జారీచేసిందని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. నిధుల మళ్లింపునకు సంబంధించి ప్రాథమిక సమాచారం లేకుండా పిల్‌ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. న్యాయస్థానం వివరాలు కోరాక.. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశామంటూ ఎలా చెబుతారని అసహనం వ్యక్తంచేసింది. వివరాలు సమర్పించేందుకు పిటిషనర్‌కు మరికొంత సమయం ఇస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. న్యాయవాది చింతా ఉమామహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన ఈ పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.