• facebook
  • whatsapp
  • telegram

త‌గ్గించిన ఇంట‌ర్ సిల‌బ‌స్‌తోనే ఎంసెట్‌

వెయిటేజీ యథాతథం 

జూన్‌ 14 తర్వాత ఎంసెట్‌ 

విద్యాశాఖ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల సిలబస్‌ ప్రకారమే ఎంసెట్‌-2021 నిర్వహించనున్నారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 30 శాతం పాఠ్య ప్రణాళిక తగ్గించినందున ఎంసెట్‌కూ అదే వర్తించనుంది. 70 శాతం పాఠ్య ప్రణాళికతో నిర్వహిస్తారు. అయితే ఆ విద్యార్థులు ప్రథమ సంవత్సరాన్ని గత ఏడాదే(2019-20) పూర్తి చేసినందున అందులో 100 శాతం సిలబస్‌ ఉంటుంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ సమక్షంలో ఫిబ్ర‌వ‌రి 5న‌ జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్, ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు, ఎంసెట్‌ కో కన్వీనర్‌ చంద్రమోహన్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎంసెట్‌లో చేయాల్సిన మార్పులపై సమావేశంలో చర్చించారు. అనంతరం చిత్రారామచంద్రన్, పాపిరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

ఇవీ ముఖ్య నిర్ణయాలు...

ఇప్పుడు ఇంటర్‌ తొలి ఏడాది చదివే వారికి 30 శాతం సిలబస్‌ తగ్గిస్తున్నందున వారు హాజరయ్యే ఎంసెట్‌-2022కు ఆ పాఠ్య ప్రణాళిక ఉండదు. రెండో ఏడాది ఇంటర్‌ సిలబస్‌ యథావిధిగా ఉంటుంది.

ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ 25 శాతం ఎప్పటిలానే ఉంటుంది. వెయిటేజీ ఎత్తివేయాలంటే కనీసం ఒక ఏడాది ముందు విద్యార్థులకు తెలపాల్సి ఉంటుందని చర్చించారు. అందువల్ల ఈసారికి ఎటువంటి మార్పులు చేయరాదని నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్‌టీలకు ఎంసెట్‌లో కనీస మార్కుల విషయంలోనూ ఎటువంటి మార్పూ లేదు.

జేఈఈ మెయిన్, నీట్‌కు పూర్తి సిలబస్‌ ఉన్నందున ప్రశ్నల్లో ఈసారి ఛాయిస్‌ పెంచారు. ఇక్కడ సిలబస్‌ తగ్గించినందున ఎంసెట్‌లో ఛాయిస్‌ అవసరం లేదని నిర్ణయించారు. 160కు బదులు 180 ప్రశ్నలు ఇవ్వాలని చర్చకు వచ్చినా దాన్ని సమావేశం తోచిపుచ్చింది.

ఇంటర్‌ ప్రధాన పరీక్షలు మే 13వ తేదీకి పూర్తవుతున్నందున నాలుగు వారాల వ్యవధి ఇచ్చి ఎంసెట్‌ నిర్వహిస్తారు. ఆ ప్రకారం జూన్‌ 14 తర్వాత జరుపుతామని, టీసీఎస్‌ అయాన్‌ ప్రతినిధులతో చర్చించి స్లాట్లు తీసుకొని తేదీలు ఖరారు చేస్తామని పాపిరెడ్డి చెప్పారు.

Updated Date : 25-02-2021 16:55:39

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం