• facebook
  • whatsapp
  • telegram

West Bengal: 25,753 మంది టీచర్ల‌ నియామకాలు రద్దు!

2016లో ఎంపిక  

వేత‌నాల రిక‌వ‌రీకి కోర్టు ఆదేశం


కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) వ్యవహారంలో కలకత్తా హైకోర్టు (Calcutta High Court) సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌ (SLST) నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేగాక, దీని కింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది.


ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్‌ సి, గ్రూప్‌ డి స్టాఫ్‌ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్‌ సర్కారు రాష్ట్ర స్థాయి సెలక్షన్‌ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేశారు. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్లపై విచారణ నిమిత్తం కోల్‌కతా హైకోర్టులో ప్రత్యేక డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటైంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఈ ధర్మాసనం.. 2016 నాటి టీచర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినందున అది చెల్లదని తీర్పు వెలువరించింది. తక్షణమే ఆ నియామకాలను రద్దు చేసి కొత్త నియామక ప్రక్రియ ప్రారంభించాలని పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ను సూచించింది. నాటి వ్యవహారంపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.


ఇదే సమయంలో 2016 ఉపాధ్యాయ నియామక ప్రక్రియతో ఉద్యోగాలు పొందిన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నాలుగు వారాల్లోగా తాము అందుకున్న వేతనాలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఆ డబ్బు వసూలు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సూచించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పార్థా ఛటర్జీ ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.