* 15 రోజుల్లో అందుబాటులోకి మార్కులు
దిల్లీ-ఈనాడు, హైదరాబాద్ న్యూస్‌టుడే యంత్రాంగం: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీసెస్‌లో అమ్మాయిలు అదరగొట్టారు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్-2022 తుది ఫలితాల్లో తొలి నాలుగు ర్యాంకులను వారే సొంతం చేసుకున్నారు. మే 23న తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఇషితా కిశోర్ తొలి ర్యాంకు సాధించగా.. గరిమా లోహియా, నూకల ఉమాహారతి, స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులతో మెరిశారు. మూడో ర్యాంకు సాధించిన ఉమాహారతి తెలంగాణ బిడ్డ. ఈమెది సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్. ఉమాహారతి తండ్రి ఎన్.వెంకటేశ్వర్లు ప్రస్తుతం నారాయణపేట ఎస్పీగా పనిచేస్తున్నారు. ఈమెతో పాటు తెలుగు అభ్యర్థులు వందలోపు 10 ర్యాంకులు సాధించి మరోసారి సత్తా చాటారు. ఏపీలోని తిరుపతికి చెందిన పవన్‌దత్తా 22వ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. మొత్తం మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 46 మందికి పైగా సివిల్స్‌కు ఎంపికైనట్లు ప్రాథమిక సమాచారం.
933 మంది ఎంపిక
ఈసారి మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీల నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐపీఎస్‌కు 200 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38 ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ కేటగిరీలో 473 మంది, గ్రూప్ బీ సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఫలితాల ప్రకటన తేదీ నుంచి 15 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో మార్కులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అంతకుముందు ఏడాది 685 ఖాళీలకు పరీక్ష నిర్వహించగా 40 మందికిపైగా తెలుగువారు ఎంపికయ్యారు.
తొలి పది ర్యాంకర్లు..
1. ఇషితా కిశోర్ (దిల్లీ యూనివర్సిటీ), 2. గరిమా లోహియా (దిల్లీ యూనివర్సిటీ), 3. ఉమాహారతి (ఐఐటీ హైదరాబాద్), 4. స్మృతి మిశ్రా (దిల్లీ యూనివర్సిటీ), 5. మయూర్ హజారికా, 6. గెహ్నా నవ్య జేమ్స్, 7. వసీం అహ్మద్ భట్, 8. అనిరుధ్ యాదవ్ 9. కనికా గోయల్, 10. రాహుల్ శ్రీవాస్.
* దేశవ్యాప్తంగా దాదాపు 5.73 లక్షల మంది సివిల్ సర్వీసెస్-2022 ప్రాథమిక పరీక్షలకు హాజరుకాగా వారిలో చివరకు 933 మంది సర్వీస్‌కు ఎంపికయ్యారు. మొత్తం మీద ఏపీ, తెలంగాణ నుంచి 46 మంది వరకు ఎంపికయ్యారు. అది 4.28 శాతంతో సమానం. అంటే ఎంపికైన ప్రతి 100 మందిలో నలుగురు తెలుగు అభ్యర్థులున్నారు.
సివిల్స్ ఉత్తీర్ణత శాతంలో మహిళలే టాప్
దేశంలోనే అత్యున్నతంగా భావించే సివిల్ సర్వీసెస్‌కు అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు తక్కువ మంది హాజరవుతున్నా.. విజేతల శాతం(సక్సెస్ రేట్) మాత్రం అతివల్లో ఎక్కువగా ఉంటోంది. అది అబ్బాయిల కంటే మూడు రెట్లు అధికంగా ఉండటం విశేషం. అబ్బాయిల్లో ప్రతి 100 మందికి 6.6 శాతం మంది చివరకు కొలువు సాధించగా.. అమ్మాయిలు ఏకంగా 17.9 శాతం మంది సర్వీస్ దక్కించుకుంటున్నారు. సివిల్ సర్వీసెస్-2020పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) తాజాగా నివేదిక విడుదల చేసింది.
ముఖ్యాంశాలు
* సివిల్స్-2020 ప్రాథమిక పరీక్షకు 10.40 లక్షల మంది దరఖాస్తు చేసినా రాసింది 4.83 లక్షల మంది మాత్రమే. వీరిలో 10,564(2.2 శాతం) మంది ప్రధాన పరీక్షకు ఎంపికవ్వగా.. 10,343 మంది రాశారు. 2,053 మంది ఇంటర్వ్యూకు ఎంపికై.. 2,049 మంది హాజరయ్యారు. వారిలో 833 మంది ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసెస్‌లకు ఎంపికయ్యారు.
* ప్రాథమిక పరీక్షకు తొలిసారిగా హాజరైన వారు 49 శాతం మంది ఉండగా.. వారిలో చివరకు సర్వీస్‌కు ఎంపికైంది మాత్రం 8.40 శాతమే. ఇక రెండు, మూడు, నాలుగోసారి పరీక్షలు రాసిన వారిలో వరుసగా 18.10, 20.5, 18.60 శాతం మంది కొలువులు సాధించారు. అంటే మూడో ప్రయత్నంలో ఎక్కువ మంది ఎంపికవుతున్నారు.
* మొత్తం కొలువులకు ఎంపికైన 833 మందిలో డిగ్రీ విద్యార్హత కలిగిన వారు 650 మంది, పీజీ చదివినవారు 183 మంది ఉన్నారు. మెడికల్ సైన్స్ అభ్యర్థులు 70 మంది ముఖాముఖికి ఎంపికైతే అందులో 31 మంది విజేతలుగా నిలిచారు. అంటే అత్యధిక సక్సెస్ రేట్ 44.30 శాతం వీరిదే..
* కొలువులకు ఎంపికైన వారిలో 641 మంది ఇంజినీరింగ్ అభ్యర్థులే. అది 77 శాతంతో సమానం. ఆ తర్వాత ఆర్ట్స్ అభ్యర్థులు 193 మంది(23 శాతం) ఉన్నారు.
* మెయిన్ పరీక్షలో రాజనీతి శాస్త్రాన్ని అత్యధికంగా 1863 మంది ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకున్నారు. వారిలో 154 మంది(8.3 శాతం) కొలువు సాధించారు. సర్వీస్‌కు ఎక్కువ మంది ఎంపికైందీ ఈ సబ్జెక్టు వారే కావడం విశేషం. రెండు, మూడు స్థానాల్లో సోషియాలజీ(115 మంది), ఆంత్రోపాలజీ 100 మంది ఉన్నారు. అయితే సివిల్స్-2019 ప్రధాన పరీక్షలో మాత్రం అత్యధికంగా 1916 మంది జాగ్రఫీని ఎంచుకోగా.. 1662 మందితో రెండో స్థానంలో రాజనీతిశాస్త్రం నిలిచింది. అది ఈసారి ప్రథమ స్థానంలోకి చేరింది.
* తెలుగును ఐచ్ఛిక సబ్జెక్టుగా 36 మంది ఎంపిక చేసుకొని పరీక్ష రాయగా.. వారిలో అయిదుగురు ఉద్యోగం పొందారు. 2019లో 32 మంది రాసినా ఒక్కరూ ఎంపిక కాలేదు.
* సివిల్స్ ముఖాముఖికి 2,049 మంది హాజరుకాగా.. వారిలో 200 మంది ప్రాంతీయ భాషల్లో సమాధానాలిచ్చారు. వారిలో అత్యధికంగా 177 మందికి హిందీలోనే ఇంటర్వ్యూ జరిగింది. ఆ తర్వాత మరాఠీలో 13 మంది ఇంటర్వ్యూను ఎదుర్కొన్నారు. ఈసారి తెలుగు నుంచి ఒక్కరూ లేరు. గతసారి ముగ్గురు తెలుగులోనే ముఖాముఖిలో సమాధానాలు చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ కొలువులు
‣ డిగ్రీతో సీఏపీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.