• facebook
  • whatsapp
  • telegram

Univeristy Entrance: రెండు దఫాల్లో వర్సిటీ ప్రవేశాల ప్రక్రియ

* యూజీసీ చీఫ్‌ జగదీశ్‌ కుమార్‌ వెల్లడి

దిల్లీ: విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలోనే భారత్‌లో ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ప్రతిపాదనకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ చీఫ్‌ జగదీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి రెండు దఫాల్లో.. జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరిలలో ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తామని అన్నారు. సమయం వృథా కాదు ‘‘మన దేశంలోని యూనివర్సిటీలు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్‌ కల్పించినట్లయితే అది ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా బోర్డు ఫలితాల్లో ఆలస్యం, ఆరోగ్య సమస్యలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల జులై-ఆగస్టులో ప్రవేశం పొందలేకపోయిన వారికి ఎంతో దోహదపడుతుంది. రెండుసార్లు అడ్మిషన్‌ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ఏడాది సమయం వృథా కాకుండా ఉంటుంది. అటు కంపెనీలు కూడా రెండుసార్లు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లు నిర్వహించుకోవచ్చు. తద్వారా పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి’’ అని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూజీసీ చీఫ్‌ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. రెండుసార్లు ప్రవేశాలు కల్పించడం వల్ల ఉన్నత విద్యా సంస్థలు తమ ఫ్యాకల్టీ, ల్యాబ్‌, క్లాస్‌రూమ్‌, ఇతర సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని వెల్లడించారు. భారతీయ విద్యా సంస్థలు ఈ విధానం పాటించడం వల్ల అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు దోహదపడుతుందన్నారు. తద్వారా పోటీ ప్రపంచంలో మనం మరింత మెరుగుకావచ్చని, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించినట్టు ఉంటుందన్నారు. తప్పనిసరి కాదు.. దేశంలోని అన్ని యూనివర్సిటీలు ఈ విధానాన్ని పాటించడం తప్పనిసరి కాదన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది కలిగిన ఉన్నత విద్యా సంస్థలు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. రెండుసార్లు ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా విద్యాసంస్థల అంతర్గత నిబంధనలను మార్చుకోవాలని సూచించారు.

Published Date : 11-06-2024 15:02:22

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం