* ట్రేడింగ్, ఫైనాన్స్, ఫిన్‌టెక్ కంపెనీల్లో అధిక నియామకాలు
ప్లేస్‌మెంట్లు, విద్యార్థులకు వచ్చే వేతన ప్యాకేజీల్లో ఐఐటీ (IITs)లు ఏటా తమ రికార్డు తామే తిరగరాస్తుంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. తమ విద్యార్థుల్లో ఒకరికి ఈ ఏడాది రూ.3.7 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీ లభించినట్లు ఐఐటీ బాంబే (IIT Bombay Placements) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఓ విదేశీ కంపెనీ నుంచి ఈ ఆఫర్ వచ్చినట్లు తెలిపింది. మరో విద్యార్థికి ఓ దేశీయ కంపెనీ రూ.1.7 కోట్ల ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు చెప్పింది. ఈ రెండు ఆఫర్లను సదరు విద్యార్థులు అంగీకరించినట్లు తెలిపింది. అయితే, వారి పేర్లను మాత్రం సంస్థ బహిర్గతం చేయలేదు.
గత ఏడాది ఐఐటీ బాంబే (IIT Bombay Placements)కు చెందిన ఓ విద్యార్థికి అంతర్జాతీయ కంపెనీ నుంచి రూ.2.1 కోట్ల ప్యాకేజీ లభించింది. దేశీయ కంపెనీ నుంచి రూ.1.8 కోట్ల వార్షిక వేతన ఆఫర్ వచ్చింది. 2022- 23 ప్రీప్లేస్‌మెంట్లలో మొత్తం 300 ఆఫర్లు రాగా.. 194 మంది వాటిని అంగీకరించినట్లు ఐఐటీ బాంబే వెల్లడించింది. వీరిలో 16 మందికి రూ.కోటికి పైగా వార్షిక ప్యాకేజీ లభించినట్లు తెలిపింది. జులై 2022 నుంచి జూన్ 2023 వరకు జరిగిన ప్లేస్‌మెంట్లకు మొత్తం 2,174 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపింది. వీరిలో 1,845 మంది యాక్టివ్‌గా పాల్గొన్నట్లు పేర్కొంది.
ప్లేస్‌మెంట్లలో పాల్గొన్న వారిలో దాదాపు 65 మందికి విదేశాల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చినట్లు ఐఐటీ బాంబే (IIT Bombay Placements) తెలిపింది. అమెరికా, జపాన్, యూకే, నెదర్లాండ్స్, హాంకాంగ్, తైవాన్‌లోని అంతర్జాతీయ కంపెనీల్లో తమ విద్యార్థులకు ఉద్యోగాలు లభించినట్లు వెల్లడించింది. ఈసారి సగటు వేతన ప్యాకేజీ రూ.21.82 లక్షలుగా నమోదైనట్లు తెలిపింది. క్రితం ఏడాది ఇది రూ.21.50లక్షలు.. అంతకు ముందు సంవత్సరం రూ.17.91 లక్షలుగా ఉంది. ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగంలో అత్యధికంగా 458 మందికి జాబ్ ఆఫర్లు వచ్చినట్లు తెలిపింది. క్రితం ఏడాదితో పోలిస్తే ఐటీ, సాఫ్ట్‌వేర్ విభాగాల్లో తక్కువ మందిని కంపెనీలు నియమించుకున్నట్లు పేర్కొంది. 302 మంది ఈ విభాగానికి చెందిన కంపెనీల్లో ఉద్యోగాలు పొందినట్లు తెలిపింది. ట్రేడింగ్, ఫైనాన్స్, ఫిన్‌టెక్ కంపెనీలు అత్యధికంగా సాఫ్ట్‌వేర్/ఐటీ విద్యార్థులను నియమించుకున్నట్లు పేర్కొంది. ప్లేస్‌మెంట్లలో యాక్టివ్‌గా పాల్గొన్నవారిలో 82 శాతం మందికి ఉద్యోగాలు లభించినట్లు వెల్లడించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.