• facebook
  • whatsapp
  • telegram

TS Police: పోలీసు ఉద్యోగార్థులకు అదనంగా 7 మార్కులు

* నూతన ఉత్తీర్ణుల వివరాలు 30న వెబ్‌సైట్‌లో

* ఫిబ్రవరి 1 నుంచి పార్ట్‌-2 దరఖాస్తుకు అవకాశం

* ఆయా అభ్యర్థులకు 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు

* నియామక మండలి వెల్లడి.. 

 

 

హైదరాబాద్‌: పోలీసు రాత పరీక్షల్లో.. హైకోర్టు ఆదేశాల మేరకు ఏడు మార్కులు కలపడంతో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి ఫిబ్రవరిలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి నిర్ణయించింది. ఈ మేరకు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాస్‌రావు జనవరి 29న కార్యాచరణ ప్రణాళిక విడుదల చేశారు. ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఇటీవల ముగిసిన ప్రాథమిక రాత పరీక్షల్లో ఏడు ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ జవాబులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఆ ఏడు ప్రశ్నలకు.. ఏడు మార్కులు కలపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జనవరి 24, 25 తేదీల్లో నియామక మండలికి అందాయి. ఈ మార్కులు కలపడంతో కొత్తగా ఉత్తీర్ణులైన వారి వివరాలను జనవరి 30న నియామక మండలి వెబ్‌సైట్లో పొందుపరుస్తున్నారు. వీరు తదుపరి దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యేందుకు పార్ట్‌-2 దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం నియామక మండలి వెబ్‌సైట్లోకి వెళ్లి, పార్ట్‌-2 దరఖాస్తు చేయాలి. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 8 నుంచి 5వ తేదీ రాత్రి 10 గంటల మధ్య ఈ దరఖాస్తులు సమర్పించాలి. ఈ గడువు పెంపు ఉండదని మండలి ఛైర్మన్‌ స్పష్టం చేశారు. వీరికి ఫిబ్రవరి 15 నుంచి హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, ఆదిలాబాద్‌ కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. పది పనిదినాల్లో ఈ పరీక్షలు పూర్తవుతాయి. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 8 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి 12 గంటల మధ్య డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇబ్బందులు ఎదురైతే support@tslprb.in కు ఈమెయిల్‌ చేయాలని, లేదంటే 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించాలని శ్రీనివాస్‌రావు సూచించారు. 

 

 

ప్రకటన వివరాలు
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ సరైన రివిజన్‌ సక్సెస్‌ సూత్రం!

‣ ఇంజినీర్లకు ఆర్మీ ఉద్యోగాలు

‣ ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆర్మీ ఆహ్వానం

‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు! (ఆంధ్రప్రదేశ్‌)

‣ గెయిల్‌లో కొలువులు

‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు! (తెలంగాణ)