* వీలైనంత త్వరగా గ్రూప్-1తో పాటు రద్దయిన పరీక్షలు నిర్వహిస్తాం
* గతంలో పరీక్ష రాసిన వారికి ఫీజు మినహాయింపు
* ఆన్‌లైన్‌లో ఉచితంగా స్టడీ మెటీరియల్
* ఉద్యోగార్థులు అపోహలు నమ్మొద్దు
* మంత్రి కేటీ రామారావు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)లో ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక ఎవరున్నా వదలబోమని, రద్దయిన పరీక్షలను వీలైనంత త్వరగా పకడ్బందీగా నిర్వహిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు స్పష్టంచేశారు. గతంలో దరఖాస్తు చేసుకొని, ఈ పరీక్షలను రాసిన వారంతా మళ్లీ పరీక్షలకు అర్హులేనని, మరోసారి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులో పెడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను బలోపేతం చేస్తామని, వాటితోపాటు జిల్లాల్లో రీడింగు రూమ్‌లు 24 గంటలు తెరిచే ఉంటాయని, వాటిల్లోనూ ఉచిత స్టడీ మెటీరియల్‌తోపాటు భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. మార్చి 18న బీఆర్‌కే భవన్‌లో ఆయన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సబితారెడ్డి, గంగుల కమలాకర్, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతో కలిసి కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో ప్రశ్నపత్రాల లీకేజీ వెనక రాజకీయ కుట్ర ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. లీకేజీకి బాధ్యునిగా తేలిన వ్యక్తుల్లో ఒకరైన రాజశేఖర్‌రెడ్డి భాజపా క్రియాశీల కార్యకర్త అని తెలిపారు. దేశంలోనే అత్యంత సమర్థంగా పనిచేస్తున్న సంస్థగా పేరొందిన టీఎస్‌పీఎస్సీలో పనిచేసే రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌లు చేసిన తప్పు వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చిందని తెలిపారు. వీరిద్దరే కాదు ఇంకా ఎవరున్నా వదలిపెట్టబోమని, చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. సంస్థలో మరోసారి తప్పిదాలు జరగకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత తమపై ఉందన్నారు.
దేశంలోనే అత్యుత్తమ సంస్థ టీఎస్‌పీఎస్సీ
‘టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 155 నోటిఫికేషన్లు విడుదలవగా... 99 పరీక్షలను నిర్వహించాం. 37 వేల ఉద్యోగాలను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీచేశాం. ఒక్క ఆరోపణా రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలో పక్షపాత ధోరణి కారణంగా ఎవ్వరూ నష్టపోవద్దని ఇంటర్వ్యూలను రద్దు చేశాం. రాతపరీక్ష, మెరిట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు జరుపుతున్నాం. ఒకేసారి 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించి భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లలో ఒకటిగా టీఎస్‌పీఎస్సీ గుర్తింపు పొందింది. కాలానుగుణంగా సాంకేతికంగా ముందుకెళ్తోంది. అందులో భాగంగానే ఓటీఆర్ (వన్ టైం రిజిస్ట్రేషన్) విధానం, డిజిటల్ చెల్లింపులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన ఘనతనూ సాధించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు రెండుసార్లు తెలంగాణకు వచ్చి టీఎస్‌పీఎస్సీపై అధ్యయనం చేశారు. దేశంలోని 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల సభ్యులు వచ్చి... ఇక్కడి విధివిధానాలపై అధ్యయనం చేసి ఆయా రాష్ట్రాల్లోనూ అమలు చేశారు. గత తొమ్మిదేళ్లుగా దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన సంస్థగా గుర్తింపు పొందింది. 28 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని విధంగా ఏడు (తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, బెంగాలీ, కన్నడ, మరాఠీ) భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించింది. మేము 1లక్ష ఉద్యోగాలని చెప్పి... 2లక్షల నియామకాలను వేగంగా భర్తీ చేస్తున్నాం. టీఎస్‌పీఎస్సీలో రానున్న రోజుల్లో చాలా మార్పులు వస్తాయి. దీనిపై నిపుణులతో చర్చలు జరుపుతున్నాం.
పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు
ప్రశ్నపత్రాల లీకేజీ ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమే. పరీక్షలను రద్దు చేయడంతో లక్షల మంది పిల్లలకు ఇబ్బంది కలుగుతోంది. మేం కూడా బాధపడుతున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే పునాది మీదనే తెలంగాణ ఉద్యమం నడిచింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని గొప్ప పనిచేశారు. స్థానికులకు 95% రిజర్వేషన్లు కల్పించారు. యువతను రెచ్చగొట్టేలా, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా కొందరు మాట్లాడుతున్నారు. రాజకీయ నిరుద్యోగుల వ్యాఖ్యలను పట్టించుకోవద్దు. అపోహలు, అనుమానాలను యువత నమ్మొద్దు. లీకేజీలో నిందితుడైన రాజశేఖర్‌రెడ్డి భాజపా క్రియాశీల కార్యకర్త. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. ఆ పార్టీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్న ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. అలాంటి వ్యక్తి దీని వెనకాల ఉన్నాడంటే మాకు అనుమానం ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంటే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీన్ని కుట్ర అన్నారు. నోటిఫికేషన్లపై కుట్ర చేశారనే అనుమానం మాకుంది. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలనే కుట్ర ఏమైనా ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. దీనిపై లోతైన విచారణ జరపాలని డీజీపీకి భారాస తరఫున ఫిర్యాదు చేశాం. కొందరు ఇష్టారాజ్యంగా నాపై ఆరోపణలు చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ రాజ్యాంగబద్ధమైన స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థ. అందులో మేం జోక్యం చేసుకోం. నాకు లీకేజీతో సంబంధం ఏమిటి? ఐటీ మంత్రిని అయితే రాష్ట్రంలో ఉన్న ప్రతీ కంప్యూటర్‌కు నేనే బాధ్యుడినా? పేపర్ లీకైతే నేనెందుకు రాజీనామా చేయాలి? అస్సాం, యూపీ, గుజరాత్‌లలోనూ పేపర్ లీకేజీలు జరిగాయి. అక్కడ మంత్రులు రాజీనామాలు చేశారా? కానీ... ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చిన వాళ్లకు బాధ ఉంటుంది. జరిగిన తప్పుల కారణంగా... అర్హత పొందిన వారు ఇబ్బంది పడకూడదు. సిట్ విచారణ పూర్తి కాకుండానే దానిపై నమ్మకం లేదనడం సరైంది కాదు. రాష్ట్రంలో ఎన్నికలు కొద్దిరోజుల్లోనే ఉన్నాయి. ప్రజలకు ఎవరు ఏంటో తెలుసు. కేంద్రంలో 16 లక్షల ఖాళీలు ఎందుకు భర్తీ చేయడంలేదు? కేంద్ర ప్రభుత్వం... ప్రభుత్వరంగ సంస్థలను మూసివేసి నిరుద్యోగాన్ని పెంచుతోంది’ అని కేటీఆర్ వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఎగ్జామ్‌కి ముందు ఏం చేయకూడదు?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.