• facebook
  • whatsapp
  • telegram

Vice Chancellor: నెలాఖరులోగా కొత్త వీసీలు

* నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఈసీ అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతుల (వైస్‌ ఛాన్సలర్ల) నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి ఇచ్చింది. పోలింగ్‌ ముగిసినందువల్ల ఈ ప్రక్రియను చేపట్టవచ్చని తెలిపింది. ఈసీ నుంచి అనుమతి రావడంతో వీసీల ఎంపిక కోసం సెర్చ్‌ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల దరఖాస్తులను సెర్చ్‌ కమిటీలు పరిశీలించి ఒక్కో వర్సిటీకి ముగ్గురు ప్రొఫెసర్ల చొప్పున పేర్లను ఎంపిక చేసి.. ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్‌కు పంపిస్తాయి. గవర్నర్‌ ఆమోదించిన తర్వాత.. వీసీల నియామకాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడతాయి. ప్రస్తుత నెలాఖరులోగా కొత్త వీసీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి.. నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల ఉప కులపతు(వీసీ)ల పదవీకాలం మే 21తో ముగుస్తోంది. దాని కంటే ముందే కొత్త వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచే కసరత్తు చేపట్టింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. 312 మంది 1,382 దరఖాస్తులు సమర్పించారు. కొందరు ఒకటికి మించి వీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 208 దరఖాస్తులు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 193, పాలమూరుకు 159, శాతవాహనకు 158, మహాత్మా గాంధీకి 157, కాకతీయకు 149, తెలంగాణ వర్సిటీకి 135, జేఎన్‌టీయూహెచ్‌కు 106, తెలుగు విశ్వవిద్యాలయానికి 66, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయానికి 51 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం అభ్యర్థుల గురించి ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించింది. మార్చిలో కోడ్‌ అమల్లోకి రావడంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. వీసీల పదవీకాలం మే 21తో ముగుస్తున్నందువల్ల.. కొత్తవారి నియామకాలకు అనుమతించాలని కోరుతూ మేలో ఆరంభంలో ఈసీకి ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా.. తాజాగా అనుమతి ఇచ్చింది. దాంతో ఒక్కో వర్సిటీకి ముగ్గురితో కూడిన సెర్చ్‌ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీల్లో ప్రభుత్వ, యూజీసీ ఛైర్మన్‌, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(ఈసీ) నామినీలు ఉంటారు. ప్రభుత్వ నామినీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) శాంతికుమారి, మెంబర్‌ కన్వీనర్‌గా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉంటారు. దరఖాస్తుదారుల బయోడేటాలను సెర్చ్‌ కమిటీలు పరిశీలించి, వీసీగా నియామకానికి మూడేసి పేర్లు సూచిస్తాయి. వీసీలుగా నియమితులు కావాలంటే కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలి. లేదా పరిశోధన, అకడమిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పదేళ్ల అనుభవం ఉండాలి. వీసీలను మూడేళ్ల కాలపరిమితికి నియమిస్తారు. ఈ వారంలోనే సెర్చ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించి, వీసీల ఎంపికకు సిఫారసులు అందించనున్నాయి.

పకడ్బందీగా ఎంపిక ప్రక్రియ

గతంలో తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీ తీరు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కొత్త వీసీల నియామకాలను పకడ్బందీగా చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. బుధవారం ఆయన ఉన్నత విద్యామండలిలో విలేకరులతో మాట్లాడారు. ఈసారి ఎలాంటి విమర్శలకు తావులేకుండా అర్హులనే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. వీసీ పదవికి 70 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితి ఉంటుందని, ఇప్పటికే ఈ పదవిని రెండు దఫాలు నిర్వహించినవారు మూడోసారి ఎంపికకు అనర్హులవుతారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశంపై ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. మే  21న వీసీల పదవీకాలం ముగుస్తుందని.. ఆ తర్వాత ఇన్‌ఛార్జులను నియమిస్తామన్నారు.

వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీలకూ..

రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలోని 10 విశ్వవిద్యాలయాల వీసీల నియామకాలకు ఈసీ అనుమతి మంజూరు చేయడంతో వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల వీసీల ఎంపికకూ మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ మూడు వర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది. కొత్తవారి నియామకానికి దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. త్వరలో సెర్చ్‌ కమిటీలు ఏర్పాటు చేసి.. నియామకాలు చేపట్టే వీలుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.


Some more information 

"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-05-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.