• facebook
  • whatsapp
  • telegram

Engineering: తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్‌ సీట్లు..!

  • నేటి నుంచి ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ 
  • రేపటి నుంచి వెబ్‌ ఆప్షన్లు


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. జులై 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. 27, 28 తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఉన్నందున జులై 26న లేదా 27న ఉదయం కొత్త సీట్లకు విద్యాశాఖ అనుమతి ఇవ్వనుంది. డిమాండ్‌ లేని బ్రాంచీల స్థానంలో సీఎస్‌ఈ తదితర బ్రాంచీల ద్వారా సుమారు 7,000 సీట్లు, అదనపు సీట్లతో కొత్తగా 20,500 అందుబాటులోకి రావాలి. అందుకు ఏఐసీటీఈ సైతం ఆమోదం తెలిపింది. రాష్ట్రప్రభుత్వం మాత్రం తొలివిడత కౌన్సెలింగ్‌లో సుమారు 2,600 సీట్లకు అనుమతి ఇచ్చింది. తాజాగా రెండో విడతకు సుమారు 9,000 వరకు మంజూరు చేసేందుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కసరత్తు పూర్తిచేశారు. అంటే దాదాపు సగం సీట్లకు కోత పెట్టినట్లేనని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. 

90 శాతం భర్తీ నుంచి వెసులుబాటు!

కోర్‌ బ్రాంచీలకు పెద్దపీట వేయాలి.. అంతా సీఎస్‌ఈ చదివితే ఎలా?.. అని చెబుతున్న విద్యాశాఖ 90 శాతం సీట్లు భర్తీ అయిన కళాశాలలకే కొత్తగా 120 సీట్లు ఇస్తామని చెప్పి.. ఆ మేరకు ఇటీవల 2600 సీట్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా కళాశాలల యాజమాన్యాల నుంచి ఒత్తిడి రావడంతో 80, 70, 50 శాతం భర్తీ, పట్టణ/గ్రామీణ, ఓఆర్‌ఆర్‌ లోపల, బయట, మైనారిటీ-నాన్‌ మైనారిటీ ఇలా రకరకాలుగా కసరత్తు జరిపింది. చివరకు ప్రతి కళాశాలకు 120 సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. 

తొలివిడతలో 55,000 మంది చేరిక

తొలివిడత కౌన్సెలింగ్‌లో 75,200 మందికి బీటెక్‌ సీట్లు లభించగా.. వారు ట్యూషన్‌ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసే గడువు ఈ నెల 23వ తేదీతో ముగిసింది. ఈ గడువులోపు సుమారు 55,000 మంది రిపోర్టింగ్‌ చేశారు. అంటే 20 వేల మంది సీట్లు వదులుకున్నారు. వారిలో చాలామంది యాజమాన్య కోటాలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
 

Updated Date : 26-07-2024 15:44:46

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం