అమ్మాయిలు 92.61%, అబ్బాయిలు 89.35%
ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో 90.96 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. అబ్బాయిలకంటే అమ్మాయిలు ఎక్కువ మంది అర్హత సాధించారు. అబ్బాయిలు 89.35 శాతం, అమ్మాయిలు 92.61 శాతం మంది అర్హత పొందారు. విజయవాడలో మంగళవారం ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 160 మార్కులకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో ఓసీ, బీసీ విద్యార్థులకు 25శాతం కనీస అర్హత మార్కులుగా నిర్ణయించగా.. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. పరీక్ష రాసిన వారందరికీ ర్యాంకులిచ్చారు. ఇంజినీరింగ్ విభాగంలో మొదటి పది స్థానాల్లోనూ అబ్బాయిలే నిలిచారు. ఇందులో తొలి 3 స్థానాలు సాధించిన పిల్లల తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. 5, 6, 7 ర్యాంకులను తెలంగాణకు చెందిన విద్యార్థులు కైవసం చేసుకున్నారు. బైపీసీ స్ట్రీమ్‌లో మొదటి పది ర్యాంకుల్లో 3, 5 స్థానాల్లో అమ్మాయిలు నిలవగా.. మిగతా 8 ర్యాంకులు అబ్బాయిలకే దక్కాయి. వీరిలో తెలంగాణకు చెందిన విద్యార్థులకు 7, 8, 9 ర్యాంకులు లభించాయి. ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని ఈసారి తొలగించారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయించారు.
ఇంజినీరింగ్ (ఎంపీసీ స్ట్రీమ్)లో పెరిగిన అర్హులు
‣ ఎంపీసీ స్ట్రీమ్‌లో అర్హత సాధించిన వారి సంఖ్య ఈసారి పెరిగింది. 1,94,752 మంది పరీక్షకు హాజరుకాగా, ఇందులో 1,73,572 మంది (89.12%) అర్హత సాధించారు. 2021-22లో 1,34,205 మంది (80.62%) అర్హత సాధించగా ఈసారి సంఖ్య 1,73,572కి పెరిగింది. అర్హత సాధించిన వారిలో అబ్బాయిలు 1,01,703, అమ్మాయిలు 71,869 మంది ఉన్నారు.
‣ బైపీసీ స్ట్రీమ్‌లో 87,744 మంది పరీక్ష రాయగా 83,411 మంది (95.06%) అర్హత సాధించారు. వీరిలో అబ్బాయిలు 25,771, అమ్మాయిలు 57,640 మంది ఉన్నారు. గతేడాదితో పోల్చితే బైపీసీ స్ట్రీమ్‌లో 10,923 మంది అర్హులు పెరిగారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.