ఎన్‌సీటీఈకి దరఖాస్తు చేసిన 4 విద్యాసంస్థలు
2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం
మల్టీ డిసిప్లినరీ దిశగా ఐఐటీల అడుగులు
ఈనాడు, హైదరాబాద్: ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే అన్న అభిప్రాయం నుంచి అన్ని రకాల కోర్సులకు అవి కేంద్రాలన్నట్లుగా మారిపోతున్నాయి. ఇంజినీరింగ్‌తోపాటు సైన్స్, మేనేజ్మెంట్ కోర్సులను గతంలోనే ప్రారంభించిన ఆ సంస్థలు...తాజాగా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ)ను అందించేందుకు సమాయత్తమయ్యాయి. ఐఐటీ మద్రాస్, ఖరగ్‌పూర్, భువనేశ్వర్, గువాహటి అందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ)కి దరఖాస్తు చేసుకున్నాయి. త్వరలోనే అనుమతులు దక్కనున్నాయి. 2023-24 నుంచి కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. అయితే ఆ కోర్సుల్లో ప్రవేశ విధానం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. దేశవ్యాప్తంగా రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఆర్ఐఈ)ల్లో ప్రవేశానికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తాయి. అందులో చేరతాయా? ప్రత్యేక పరీక్ష జరుపుకొంటాయా అన్నది తేలాలి. అయితే బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి కూడా జాతీయ పరీక్ష జరపాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద ఉన్నా దానిపై నిర్ణయం తీసుకోలేదు.
నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు..
దేశవ్యాప్తంగా 52 రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రయోగాత్మకంగా ఇంటర్ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఆ క్రమంలో దేశవ్యాప్తంగా ఎన్సీటీఈ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ గడువు మే 31వ తేదీతో ముగిసింది. దరఖాస్తు చేసిన విద్యాసంస్థల్లో నాలుగు ఐఐటీలున్నాయి. ఆ సంస్థలు బీఏ-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ, బీకాం-బీఈడీ కోర్సులను అందిస్తాయి. అంటే నాలుగేళ్లలో బీఏ, బీకాం, బీఎస్సీతోపాటు బీఈడీ కోర్సును చదువుతారు. సాధారణంగా డిగ్రీ తర్వాత అయితే రెండేళ్ల బీఈడీ కోర్సు ఉంటుంది. ఆ ప్రకారం డిగ్రీ మూడేళ్లు కలుపుకొని అయిదేళ్లు పడుతుంది. ఇంటిగ్రేటెడ్ కోర్సు ద్వారా ఒక ఏడాది సమయం కలిసి వస్తుంది. రాష్ట్రంలో వనపర్తి జిల్లాలో గత విద్యా సంవత్సరం(2021-22) నుంచి ఓ ప్రైవేట్ కళాశాల ఇలాంటి కోర్సును అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరం మరో రెండు మూడు కళాశాలలు ఆ దిశగా అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాయి.
అన్ని రకాల కోర్సులకు కేంద్రాలుగా...
విద్యా సంస్థల్లో అన్ని రకాల కోర్సులు ఉండాలని...మల్టీ డిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెట్టాలని, విభిన్న రంగాల నిపుణులు కలిసి పరిశోధన చేయాలని నూతన జాతీయ విద్యా విధానం-2020 స్పష్టం చేసిన సంగతి తెలిసింది. ఈ దిశగా గతంలోనే కొంత వరకు ఐఐటీలు ముందడుగు వేశాయి. ఇంజినీరింగ్‌తోపాటు ఎంఎస్సీ, ఎంఏ, ఆర్కిటెక్చర్, ఎంబీఏ కోర్సులను కూడా ప్రవేశపెట్టాయి. తాజాగా ఉపాధ్యాయ విద్యపై ఐఐటీలు దృష్టి పెట్టాయి. వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో మరిన్ని ఐఐటీలు బీఈడీ కోర్సుకు మొగ్గు చూపుతాయని భావిస్తున్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ శిక్షణ లేదు సొంత నోట్స్‌తో సాధించా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.