* తెలంగాణ నుంచి ఆరు పాఠశాలల విద్యార్థులకు అవకాశం
* 9, 10 తరగతులకు ఏడాదికి రూ.75వేలు, ఇంటర్‌కు రూ.1.25 లక్షలు
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఓబీసీ, ఈబీసీ, సంచారజాతుల పిల్లలకు ఉన్నతవిద్య అందించేందుకు కేంద్ర సామాజిక న్యాయశాఖ కొత్తగా పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డు స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా(పీఎం-యశస్వీ) ఉపకారవేతనాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో తొమ్మిది, ఇంటర్మీడియట్ చదువుతున్న వెనుకబడిన తరగతులు, ఈబీసీ, సంచారజాతుల విద్యార్థులకు జాతీయస్థాయి ప్రవేశపరీక్ష నిర్వహించి, టాప్‌లో నిలిచిన 15 వేల మందికి ఉపకారవేతనాలు ఇవ్వనుంది. తొమ్మిది, పది తరగతులు చదివేందుకు ఏడాదికి రూ.75 వేలు, ఇంటర్మీడియట్‌లో ఏడాదికి రూ.1.25లక్ష చొప్పున మంజూరు చేయనుంది. ఈ మేరకు పీఎం-యశస్వీ ఉపకార వేతనాల ప్రవేశపరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటన జారీచేసింది. ప్రవేశపరీక్షను దేశవ్యాప్తంగా 78 కేంద్రాల్లో సెప్టెంబరు 11న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహించనుంది. రాష్ట్రంలో ఈ కేటగిరీలో ఆరుజిల్లాల్లోని ఆరు పాఠశాలల్ని గుర్తించింది. మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేటలోని ఆయా పాఠశాలల విద్యార్థులు ఈ ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పేర్కొంది. యశస్వీ ప్రవేశపరీక్షలో 100 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత ప్రవేశపరీక్ష ఆంగ్ల, హిందీ మాధ్యమాల్లో జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు https://yet.nta.ac.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో ఆగస్టు 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎనిమిదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ (11వ తరగతి) విద్యార్థులకు పదోతరగతి ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ల ఆధారంగా ప్రవేశపరీక్ష ఉంటుంది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం
‣ ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.