* ఐచ్ఛికాలపై కసరత్తు చేస్తేనే.. మంచి కళాశాలలో కోరిన సీటు
* లేకుంటే నష్టపోయే ప్రమాదం
ఈనాడు, హైదరాబాద్: కళాశాలల పేర్లు.. కోడ్లు ఒకేరకంగా ఉన్నప్పుడు నమోదులో అయోమయానికి గురైతే మంచి కళాశాలకు బదులు నాసి కళాశాలలో సీటు వచ్చే ప్రమాదం ఉంది. బీటెక్ సీఎస్ఈ బదులు పొరపాటుగా సీఎస్సీ అని ఆప్షన్ ఇస్తే సైబర్ సెక్యూరిటీలో సీటు రావొచ్చు. ఉత్తమ ర్యాంకు వచ్చినా పొరపాట్ల కారణంగా ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారు. మూడు విడతల ఎంసెట్ కౌన్సెలింగ్ జరుగుతుంది కదా.. అని ఉదాసీనంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలి విడత కౌన్సెలింగే కీలకమని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే కళాశాలలు, వాటి ఎంసెట్ కోడ్లు, ఆసక్తి ఉన్న కోర్సులు, వాటి కోడ్లను వెబ్సైట్లో ఉన్న మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫాంపై రాసుకొని ఆప్షన్లు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
‘ఏళ్ల తరబడి ఎంసెట్ ర్యాంకు కోసం కష్టపడతారు.. ఆప్షన్లు ఇచ్చుకునేందుకు కనీసం ఒకటిరెండు రోజులు కూడా కసరత్తు చేయడం లేదు’ అని ఎంసెట్ క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఎంసెట్ తొలి విడతలో భాగంగా ఆగస్టు 21 నుంచి 29 వరకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అంటే తాము ఏ రోజు, ఏ సమయంలో ధ్రువపత్రాల పరిశీలనకు వస్తామో తెలుపుతూ వెబ్సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు పొరపాటున ఎంసెట్ దరఖాస్తులో నాన్ లోకల్ అని నమోదు చేసుకున్నా ధ్రువపత్రాల సమయంలో స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా లోకల్, నాన్ లోకల్‌గా పరిగణిస్తామన్నారు. 6 నుంచి 12వ తరగతి వరకు ఏడేళ్ల చదువులో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ రాష్ట్రాన్ని లోకల్‌గా తీసుకుంటామని శ్రీనివాస్ చెప్పారు. ఉదాహరణకు 6-9 తరగతులు తెలంగాణలో చదివి, మిగిలిన మూడేళ్లు ఇతర రాష్ట్రాల్లో చదువుకున్నా తెలంగాణకు లోకల్ అవుతారని తెలిపారు. సీట్లు కేటాయించేటప్పుడు తొలుత 15% అన్‌రిజర్వుడ్ సీట్లను భర్తీ చేస్తామన్నారు. ఆగస్టు 23 నుంచి ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. ఈక్రమంలో ఆప్షన్ల ప్రక్రియ సకాలంలో మొదలవుతుందా? అన్న సందిగ్ధత కొనసాగుతోంది.
ధ్రువపత్రాల పరిశీలనకు ఇవి అవసరం..
* ఎంసెట్ హాల్‌టికెట్
* ఆధార్/పాన్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్ తదితర ఒక గుర్తింపు కార్డు
* ఎంసెట్ ర్యాంకు కార్డు
* ఇంటర్ మార్కుల పత్రం
* టీసీ
* పుట్టిన తేదీ కోసం పదో తరగతి మార్కుల ధ్రువపత్రం
* 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్
* రిజర్వేషన్ వర్తిస్తే కుల ధ్రువీకరణ పత్రం
* ఈడబ్ల్యూఎస్ వర్తిస్తే ఆ ధ్రువపత్రం
మరింత సమాచారం ... మీ కోసం!
‣ దేశ రక్షణలో మీరూ భాగమవుతారా?
‣ ఎంసెట్‌లో టాప్‌ర్యాంక్ ఎలా సాధ్యమైంది?
‣ ఐఐటీలో ఆన్లైన్ డిగ్రీ కోర్సు
‣ కానిస్టేబుల్ పరీక్షకు చివరి దశ ప్రిపరేషన్ ఎలా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.