ఈనాడు, హైదరాబాద్, మల్లాపూర్, ములుగు, మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌టుడే: ఆ ఉపాధ్యాయులు వినూత్న పాఠాల బోధనతో పాటు ఆయా సబ్జెక్టుల్లో తమ విద్యార్థులు ముందంజలో ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. పరిశోధనలు, ప్రయోగాలతో ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ సేవలకు గుర్తింపుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. 2022 సంవత్సరానికి దేశవ్యాప్తంగా మొత్తం 46 మందిని ఈ పురస్కారాలు వరించగా.. వారిలో రాష్ట్రం నుంచి ముగ్గురు ఉండటం గమనార్హం. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం యన్మన్‌గండ్ల ఉన్నత పాఠశాల భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు టీఎన్ శ్రీధర్, ములుగు జిల్లా ములుగు మండలం అబ్బాపురం ఉన్నత పాఠశాల గణితం ఉపాధ్యాయుడు కందాల రామయ్యతోపాటు హైదరాబాద్‌లోని నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీతారావు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు. వచ్చే నెల 5న దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో వీరికి పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
టి.ఎన్.శ్రీధర్.. శాస్తవేత్తలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా బోధన
విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంపొందిస్తూ వారు భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేలా కృషి చేస్తున్నారు టి.ఎన్.శ్రీధర్. ఆయన మార్గదర్శనంలో 2016లో 10వ తరగతి విద్యార్థిని లక్ష్మి రూపొందించిన ‘అలార్మింగ్ ఎయిడ్ ఫర్ డెఫ్ అండ్ డమ్’ ప్రాజెక్టు జాతీయస్థాయి ఇన్‌స్పైర్ మనక్ అవార్డు గెలుచుకుంది. ఈ విద్యార్థిని 2017లో సైన్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా వారం రోజులు జపాన్‌లో పర్యటించింది. రాష్ట్రపతి భవన్‌లో 2016, 2017లో నిర్వహించిన ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో ప్రత్యేక ఆహ్వానితులుగా విద్యార్థిని లక్ష్మి, ఉపాధ్యాయుడు టి.ఎన్.శ్రీధర్ పాల్గొన్నారు. 2018లో చంద్రశేఖర్ అనే విద్యార్థి రూపొందించిన సూసైడ్ ప్రొటెక్షన్ ఫ్యాన్ ప్రాజెక్టును సైతం ఇన్‌స్పైర్ మనక్ అవార్డు వరించింది. శ్రీధర్ సొంత ఖర్చులతో యన్మన్‌గండ్ల జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు 50 మందిని విడతలవారీగా రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లారు. మహబూబ్‌నగర్‌లోని తన నివాసంపై విద్యార్థుల కోసం సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు.
కందాల రామయ్య..ముగ్గులతో విజ్ఞాన వంతులను చేస్తారు
తక్కువ ఖర్చుతో బోధన ఉపకరణాల తయారీ.. విద్యార్థులకు సులభంగా బోధించడంలో గుర్తింపు పొందారు కందాల రామయ్య. పిల్లలను ముగ్గుల ద్వారా విజ్ఞాన వంతులను చేయడం ఆయన బోధనలో ఒక పద్ధతి. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల రచన, విద్యార్థులకు అభ్యసన పత్రాలు, డిజిటల్ పాఠాల రూపకల్పనలో సేవలందిస్తున్నారు. 2015లో కేంద్రశాస్త్ర సాంకేతిక విభాగం నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ విజ్ఞాన సదస్సులో అతి తక్కువ ఖర్చుతో బోధన ఉపకరణాల తయారీ- అభ్యసన- వాటి ప్రభావం అనే అంశంపై ఆయన సమర్పించిన పత్రం జాతీయ ఉత్తమ పరిశోధనపత్రంగా ఎంపికైంది. బోధనలో డిజిటల్ ఉపకరణాల తయారీపై పరిశోధనలు, మనోవిజ్ఞానశాస్త్రంలో భావోద్వేగ ప్రజ్ఞపై రామయ్య సమర్పించిన పరిశోధన పత్రాలు అంతర్జాతీయస్థాయిలో ప్రచురితమయ్యాయి. ఈ సేవలకు గుర్తింపుగా టాటా ట్రస్టు నిర్వహిస్తున్న కనెక్టెడ్ లెర్నింగ్ ఇనిషియేటివ్ కార్యక్రమానికి రీసోర్సుపర్సన్‌గా, ఉపాధ్యాయులకు శిక్షకుడిగా ఆయనను నియమించింది. ‘గణిత ప్రయోగశాల అభివృద్ధి- వినూత్న కృత్యాల రూపకల్పన కార్యశాల’కు గత జూన్‌లో ఎన్‌సీఈఆర్‌టీ ఎంపిక చేసింది.
సునీతరావు.. సీబీఎస్‌ఈ వెబినార్ ప్యానలిస్ట్
32 ఏళ్లుగా బోధన రంగంలో సేవలందిస్తున్న సునీతరావు కంటెంట్ క్రియేషన్, కరిక్యులం అభివృద్ధిలో గుర్తింపుపొందారు. గణిత పరిశోధన, రోబోటిక్స్‌లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. సీబీఎస్‌ఈ, ఎన్‌ఈపీ వెబినార్ సిరీస్ పెడగోగి ప్యానలిస్ట్‌గా ఉన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడంపై ఆనందంగా ఉందని తెలిపారు. సీబీఎస్‌ఈ సహోదయ స్కూల్స్ కాంప్లెక్స్- హైదరాబాద్ సెక్రటరీగా, బ్రిటిష్ కౌన్సిల్ (శిక్షణ)కు సంధానకర్తగా సేవలందిస్తున్నారు. సీబీఎస్‌ఈ (2021-24) గవర్నింగ్ బాడీ సభ్యురాలిగానూ కొనసాగుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.