పాత కళాశాలల్లో తక్కువ... కొత్త వాటిలో ఎక్కువ సీట్లు
శాస్త్రీయత పాటించని జేఎన్టీయూహెచ్
ఈనాడు, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ పరిధిలోని కళాశాలలకు బీటెక్ సీట్ల కేటాయింపులో శాస్త్రీయత లోపిస్తోంది. దశాబ్దం కిందటే ప్రారంభమై.. శాశ్వత సౌకర్యాలున్న చోట తక్కువ సీట్లు ఉండగా... నిన్న కాక మొన్న మొదలైన కళాశాలల్లో ఎక్కువ సీట్లకు మంజూరు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. జేఎన్టీయూహెచ్ కింద మొత్తం ఆరు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. వాటిలో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో మొత్తం 2,430 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాత కళాశాలల్లో అన్ని సదుపాయాలూ ఉన్నా వాటిలో సీట్లు పెంచడం మాని.. వసతులు లేని కళాశాలలకు ఒకేసారి ఎక్కువ సీట్లు ఇవ్వడం బోధన ప్రమాణాలపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అశాస్త్రీయంగా సీట్లు మంజూరు చేయడం వెనుక రాజకీయ కారణాలున్నాయన్న విమర్శలొస్తున్నాయి.
జగిత్యాలలో 300.. సిరిసిల్లలో 360 సీట్లు
జేఎన్టీయూ హైదరాబాద్ కళాశాల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా 2007లో జగిత్యాలలో వర్సిటీ కళాశాలను ప్రారంభించారు. 15 ఏళ్లుగా అక్కడ బీటెక్ సీట్లు అయిదు బ్రాంచీల్లో 300 మాత్రమే ఉన్నాయి. 2010లో మొదలైన మంథని కళాశాలలో 300 రెగ్యులర్, మరో 60 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
‣ 2012లో సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో 164 ఎకరాల భారీ ప్రాంగణంలో కళాశాలను నెలకొల్పగా అక్కడ గత ఏడాది వరకు 240 సీట్లే ఉండటం గమనార్హం. ఈ విద్యా సంవత్సరం మరో 60 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. కేవలం ఏడాది కిందటే మొదలైన సిరిసిల్ల కళాశాలలో ఆరు బ్రాంచీలు... 320 సీట్లు ఉండగా... ఈసారి టెక్స్టైల్ టెక్నాలజీలో మరో 40 సీట్లు పెంచారు. అంటే మొత్తం సీట్లు 360కి పెరగడం గమనార్హం. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోతున్న వనపర్తిలో అయిదు బ్రాంచీల్లో 300 సీట్లకు అనుమతి ఇవ్వడమూ చర్చనీయాంశమవుతోంది.
వసతుల మాటేమిటి?
కొత్త కళాశాలలకు శాశ్వత భవనాలులేవు. సిరిసిల్ల కళాశాల తరగతులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నడుస్తున్నాయి. ఇది రెండో సంవత్సరం కనుక విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుంది. వనపర్తి కళాశాలకు స్థలాన్ని కేటాయిస్తూ ఇటీవల జీవో విడుదలైంది. తరగతులను ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో నిర్వహించనున్నారు. సుల్తాన్‌పూర్‌లో వసతులు ఉన్నందున బీటెక్ సీట్లను పెంచుకోవచ్చని వర్సిటీ ఆచార్యులే చెబుతున్నారు. జగిత్యాల కాలేజీలో 5 బీటెక్ కోర్సుల్లో 90 సీట్లుండగా... సుల్తాన్‌పూర్‌లో బీఫార్మసీ-60 సీట్లున్నాయి. సుల్తాన్‌పూర్‌లో ఈ సంవత్సరం మరో 4 కోర్సుల్లో 120 సీట్లు వస్తాయని చెబుతున్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆలస్యంగా వీసాలు.. ఏం చేస్తే మేలు?
‣ ప్రతికూల ఆలోచనలను పక్కకు నెట్టేయండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.