తెలుగు రాష్ట్రాల్లోని 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శ్రీకారం
ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజి, అమెరికన్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో అమలు
ఈనాడు, హైదరాబాద్: బ్యాంకు సేవింగ్ ఖాతాకు, కరెంట్ ఖాతాకు తేడా తెలియదు. వ్యక్తిగత, ఆరోగ్య బీమా ఆవశ్యకతపై అవగాహన ఉండదు. డబ్బులు పొదుపు చేయాలన్న ఆలోచన ఉండదు.. మన విద్యావ్యవస్థలో ఆర్థిక అక్షరాస్యతలేమి ఓ పెద్ద లోపంగా నిపుణులు చెబుతున్నారు. అమెరికా లాంటి దేశాల్లో ఆర్థిక అక్షరాస్యతపై పాఠశాల దశ నుంచే అవగాహన కల్పిస్తారు. ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజి(ఐసీఈ) అనే సంస్థ చొరవ.. అమెరికన్ ఇండియా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ విద్యాశాఖలు అడుగు ముందుకేశాయి. ఈక్రమంలో తెలంగాణలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆర్థిక అక్షరాస్యత పాఠాల బోధనకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు, ఏపీలో గుంటూరు జిల్లాల్లోని 10 కళాశాలలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు.
ఏం చెబుతారు?.. ఉపయోగం ఏమిటి?
ఆర్థిక అక్షరాస్యత ప్రాజెక్టు(ఫైనాన్షియల్ లిటరసీ ప్రాజెక్టు- ఫ్లిప్) పేరిట పాఠాలను బోధించనున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి నిపుణులు పాఠాలు చెబుతారు. డబ్బు అవసరం, ప్రాముఖ్యత, బ్యాంకులు ఎలా పనిచేస్తాయి, బీమా, పెన్షన్, పొదుపు, మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ ఎక్స్ఛేంజి, సైబర్ సెక్యూరిటీ, పెట్టుబడి- తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చే సమస్యల గురించి వివరిస్తారు. మొత్తం 11 అధ్యాయాలు పూర్తయ్యాక కేంద్రం పరిధిలో నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్(ఎన్సీఎఫ్ఈ) సంస్థ నిర్వహించే నేషనల్ ఫైనాన్షియల్ లిటరసీ అసెస్మెంట్ టెస్ట్(ఎన్ఫ్లాట్) సీనియర్ అనే పరీక్షను విద్యార్థులు రాయాలి. అందులో పాసైతే సర్టిఫికెట్ ఇస్తారు. అది ఉద్యోగాన్వేషణ సమయంలో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. వారికి ఇంటర్ విద్యాశాఖ నుంచి ధ్రువపత్రం అందిస్తామన్నారు. దీనిపై ఇంటర్ విద్యాశాఖ ఓఎస్డీ బహుగుణ మాట్లాడుతూ విద్యార్థులకు వర్క్‌షాప్ నిర్వహిస్తారన్నారు. ఈసందర్భంగా ఒక్కో విద్యార్థికి డబ్బు ఇస్తారని, వాటితో వారు వ్యాపారానికి సంబంధించి ప్రాజెక్టు తయారుచేయాలని చెప్పారు.
ఎలా మొదలైంది?
ఐసీఈ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ కార్యక్రమానికి మౌలిక వసతులను కల్పిస్తోంది. ఒక్కో కళాశాలకు కంప్యూటర్, ప్రొజెక్టర్, రెండు తెరలు అందజేసింది. కొన్నిసార్లు అమెరికా నుంచి కూడా నిపుణులు బోధిస్తారని ఐసీఈ హెచ్ఆర్ ప్రతినిధి మూర్తి చెప్పారు. ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో 10 కళాశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించామని, మరోవారం పది రోజుల్లో అమలవుతుందని తెలిపారు. కార్యక్రమం అమలు కోసం ఇంటర్ విద్యాశాఖకు, ఐసీఈకి వారధిగా అమెరికన్ ఇండియా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవహరిస్తోంది. విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాకుండా... అధ్యాపకులకు కూడా శిక్షణ ఇస్తారు. మూడేళ్లపాటు ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్, ఐసీఈ ప్రతినిధులు పర్యవేక్షిస్తారు. తర్వాత అధ్యాపకులు సొంతంగా విద్యార్థులకు శిక్షణనివ్వాలి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఏ ఉద్యోగ పరీక్షకు సిద్ధం కావాలి?
‣ ఏపీఈఏపీ సెట్ ప్రవేశాల్లో మార్పులు
‣ శాస్త్రసాంకేతిక అగ్రశక్తిగా చైనా
‣ ఐఐటీ సహా ప్రసిద్ధ సంస్థల్లో డిగ్రీ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.