2022-23 నుంచి ప్రవేశాలు పొందే విద్యార్థులకు తప్పనిసరి
మార్గదర్శకాలు సిద్ధం?
ఈనాడు, అమరావతి: పీజీ వైద్య విద్యార్థులకు గ్రామీణ/ప్రభుత్వ సేవను పునరుద్ధరించబోతున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో చేరే విద్యార్థులకు ఇది తప్పనిసరి కాబోతుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనరు కోటా కింద చేరే విద్యార్థులు ఏడాదిపాటు కౌన్సెలింగ్ ద్వారా కేటాయించిన ఆసుపత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే 707 మంది, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా (‘ఎ’ కేటగిరీ) కింద చేరే 1,142 మంది విద్యార్థులు ఈ గ్రామీణ సేవ పరిధిలోకి రానున్నట్లు సమాచారం. ప్రైవేటు వైద్య కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటాలో చేరే విద్యార్థులకు భారీగా ఫీజులుంటాయి. అందువల్ల వీరిని తప్పనిసరి గ్రామీణ సేవ నుంచి మినహాయించారు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందేవారి పీజీ వైద్య విద్య 2025-26లో పూర్తి కానుంది. ఆ తరువాత వారు గ్రామీణ సేవ కింద ఏడాదిపాటు వైద్య విధాన పరిషత్‌కు చెందిన ప్రాంతీయ, సామాజిక, జిల్లా ఆసుపత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. అక్కడ అవసరాలకు తగ్గట్లుగా వైద్యులు ఉన్న పక్షంలో బోధనాసుపత్రుల్లో పని చేసే అవకాశాన్ని కల్పిస్తారు.
గౌరవ వేతనాలిలా!
సూపర్ స్పెషాలిటీ వైద్యులకు నెలకు రూ.లక్ష, స్పెషాలిటీకి (పీజీ క్లినికల్) రూ.75,000, స్పెషాలిటీ (పీజీ పారా క్లినికల్) వైద్యులకు రూ.75వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చే అవకాశం ఉంది.
రూ.40 లక్షల జరిమానా!
వైౖద్య విద్యార్థులు తప్పనిసరిగా ‘గ్రామీణ సేవ’ ఏడాదిపాటు చేసేలా వ్యక్తిగత ‘బాండ్’ తీసుకుంటారు. మధ్యలో చేయనంటే పీజీ వైద్య విద్యార్థులకు రూ.40 లక్షలు, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు రూ.50లక్షల వరకు జరిమానా విధిస్తారు.
జాతీయ కోటాలో చేరే విద్యార్థులకు వర్తిస్తుందా!
పీజీ వైద్య విద్యలో జాతీయ కోటాలో నిర్దేశించిన సీట్లకు ఐచ్ఛికాలు ఇచ్చిన వారికి సీట్ల కేటాయింపు త్వరలో జరగనుంది. వీరంతా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే సీట్లు పొందుతారు. ఈ కోటాలో రాష్ట్ర విద్యార్థులతోపాటు ఇతర రాష్ట్రాల వారూ ఉంటారు. ఇప్పటివరకు అధికారికంగా చెప్పనందున వీరికి గ్రామీణ సేవ విధానాన్ని తప్పనిసరి చేయడం సాధ్యమవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆన్‌లైన్ పరీక్షలు రాసేముందు!
‣ ఆహార సంస్థలో అందుకోండి ఉద్యోగాలు!
‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.