* అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాకు రికార్డుస్థాయిలో భారతీయ విద్యార్థులు
* ఈ ఏడాది పెద్దఎత్తున వీసాల జారీ
* తెలుగు విద్యార్థుల వాటా దాదాపు 20-25%
ఈనాడు, హైదరాబాద్: భారతీయులు ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడం శతాబ్దాల నుంచి ఉన్నదే. అయితే ధనవంతుల బిడ్డలకు మాత్రమే ఫారిన్ చదువనే పరిస్థితి మాత్రం మారింది. మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలు సైతం ప్రతిభ ఉన్న తమ పిల్లల్ని విదేశాల్లో చదివించేందుకు ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం తమకున్న కొద్దిపాటి ఆస్తుల్ని విక్రయించడానికి వెనుకాడడంలేదు. బ్యాంకులు సైతం ఇబ్బందులు పెట్టకుండా విద్యా రుణాలు ఇస్తుండడం కలిసివస్తోంది. విదేశాల్లో ఎంఎస్ పూర్తిచేస్తే.. ఐటీ రంగంలో మంచి కొలువులు దక్కుతాయని, రెండు మూడేళ్లలోనే ఆ అప్పులన్నీ తీర్చవచ్చనే నమ్మకం.. వారిని ఆ దిశగా అడుగులు వేయిస్తోంది. భారతీయ మధ్య తరగతి కుటుంబాల్లో 57 శాతం మంది తమ పిల్లల్ని విదేశాల్లో చదివించాలనుకుంటున్నారని లీప్, ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది.
చైనాని అధిగమించి..
భారతీయ విద్యార్థులు అమెరికాతో పాటు కెనడా, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలకూ క్యూ కడుతున్నారు. ఈ ఏడాది తొలిసారి చైనా కంటే భారతీయ విద్యార్థులకే యూకే అధికంగా స్టడీ వీసాలు జారీ చేసింది. ఇప్పటివరకు అమెరికాలో చైనా విద్యార్థులదే ప్రథమ స్థానం కాగా.. ఆ స్థానాన్ని భారత్ అధిగమించే రోజు ఎంతో దూరంలో లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది విదేశీ విద్యకు వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల వాటా 20-25 శాతం ఉంటుందని అంచనా. ప్రస్తుతం 12 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతుండగా.. ఆ సంఖ్య 2025 నాటికి 20 లక్షలకు చేరుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
అమ్మాయిలు సైతం అత్యంత ఆసక్తి చూపుతున్నారు
విదేశాల్లో చదువుకుంటే ఐటీ రంగంలో మంచి వేతనంతో అక్కడే స్థిరపడవచ్చని తల్లిదండ్రులు, విద్యార్థులు భావిస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో కూడా విదేశీ విద్యపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో అమ్మాయిలు సైతం విదేశీ చదువుకు అత్యంత ఆసక్తి చూపుతున్నారు. ఏడేళ్లు తమ దేశంలో ఉంటే గ్రీన్‌కార్డు ఇస్తామని అమెరికా ఇటీవలే ప్రకటించింది. అది అమల్లోకి వస్తే మరింత మంది ఆ దేశానికి తరలివెళ్లే అవకాశం ఉంది. - వేముగంటి అజయకుమార్, డైరెక్టర్, ఐఎంఎఫ్‌ఎస్ కన్సల్టెన్సీ
వివిధ దేశాల్లో భారతీయ విద్యార్థుల ప్రవేశాలు ఇలా..
* అమెరికా ఈ ఏడాది భారతీయ విద్యార్థులకు రికార్డుస్థాయిలో 82 వేల విద్యార్థి (ఎఫ్-1) వీసాలు జారీచేసింది. అందులో అధిక శాతం మే నుంచి ఆగస్టు మధ్య మంజూరు చేసింది. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా తర్వాత భారత్‌ది రెండో స్థానం.
* ఈ ఏడాది తొలి 6 నెలల్లో 60,258 మంది భారతీయ విద్యార్థులు కెనడా వెళ్లారు. 2019లో 1,32,620 మంది ఆ దేశానికి వెళ్లగా.. 2020లో కరోనాతో ఆ సంఖ్య 43,624కు పడిపోయింది. తిరిగి 2021లో 1,02,688కి పెరిగింది. ఈసారి 2019 కంటే కెనడా వెళ్లే విద్యార్థులు పెరుగుతారని అంచనా వేస్తున్నారు. ఈ దేశానికి వెళుతున్న విద్యార్థుల శాతం 2016-21 మధ్య 220 శాతం పెరగడం గమనార్హం.
* యూకే ఈసారి రికార్డుస్థాయిలో 2021 జులై నుంచి 2022 జూన్ వరకూ 1,17,965 స్టడీ వీసాలు జారీచేసింది. ఇప్పటివరకు ఈ వీసాలు పొందడంలో చైనా అగ్రగామిగా ఉండగా.. ఈసారి భారత్ ఆ స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాదితో పోల్చుకుంటే భారతీయులకు విద్యార్థి వీసాలు 89 శాతం పెరిగాయి.
* ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ విద్యార్థులు 2.60 లక్షల మంది చదువుతుండగా.. వారిలో భారత్ విద్యార్థులు దాదాపు సగం మంది ఉన్నారు.
* మన దేశ విద్యార్థుల సంఖ్యను 2025 నాటికి 20 వేలకు పెంచుకోవాలని ఇటీవలే ఫ్రాన్స్ లక్ష్యంగా నిర్దేశించుకుంంది. జర్మనీ, ఫిన్‌లాండ్, ఐర్లాండ్ తదితర దేశాలు సైతం భారతీయ విద్యార్థులను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు
‣ ఆన్‌లైన్ పరీక్షలు రాసేముందు!
‣ ఆహార సంస్థలో అందుకోండి ఉద్యోగాలు!
‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.