‘విద్య 4.0 ఇండియా’ నివేదిక వెల్లడి
దిల్లీ: పాఠశాల విద్యార్థి ఓ నిపుణుడైన ఉద్యోగిగా మారే ప్రక్రియ భారత్లో పలు అడ్డంకులను ఎదుర్కొంటోందని ‘విద్య 4.0 ఇండియా’ శీర్షికతో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వెలువరించిన నివేదిక పేర్కొంది. నాలుగో పారిశ్రామిక విప్లవ సాంకేతికతలు.. అభ్యసనాన్ని ఎలా మెరుగుపరచగలవో, విద్యాపరమైన అసమానతలను ఎలా తొలగించగలవో ఈ నివేదిక ఏకరవు పెట్టింది. 2020 మే నెలలో ప్రారంభమైన ‘విద్య 4.0’ పథకం కింద 40 ఆధునిక విద్యా సాంకేతిక సంస్థలు, అంకుర సంస్థలు, ప్రభుత్వ, విద్యాలయాలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. డబ్ల్యూఈఎఫ్, ఐక్యరాజ్యసమితి బాలల విద్యా నిధి (యూనిసెఫ్), యువా (జనరేషన్ అన్ లిమిటెడ్ ఇండియా) సంస్థలు సమష్టిగా ‘విద్య 4.0 ఇండియా’ నివేదికను వెలువరించాయి. డిజిటల్, ఇతర ఆధునిక సాంకేతికతలు విద్యాపరమైన అసమానతలను ఎలా తొలగించగలవో నివేదిక వివరించింది. భారత్లో 6 కోట్ల మందికి పైగా సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యార్థులు ఉన్నప్పటికీ, 85 శాతం పాఠశాలలు తమ పాఠ్య ప్రణాళికల్లో వృత్తి విద్యా కోర్సులను ముఖ్య భాగం చేయలేకపోయాయని తెలిపింది. ఎప్పటికప్పుడు మారిపోతున్న ఉపాధి విపణిలో విద్యార్థులను ఉద్యోగాలకు సన్నద్ధులను చేయడాన్ని ‘పాఠశాల నుంచి పనికి రూపాంతరీకరణ’గా వ్యవహరిస్తున్నారు. శిక్షకుల కొరత, అరకొర వనరులు, వసతులు, స్థానికంగా అందుబాటులో ఉన్న నిపుణ ఉద్యోగాలకు వృత్తి విద్య ద్వారా విద్యార్థులను సన్నద్ధం చేయలేకపోవడం వంటి సమస్యలు పాఠశాల నుంచి పని ప్రక్రియకు అడ్డుతగులుతున్నాయి.
ప్రాధాన్యం దక్కని వృత్తి విద్య
వృత్తి విద్యకు విద్యార్థులు, తల్లిదండ్రులు ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వడం పెద్ద లోపమని ‘విద్య 4.0 ఇండియా’ నివేదిక పేర్కొన్నది. విద్యార్థులు పనిలో రాణించే నైపుణ్యాలను అలవర్చుకోవాలనీ, మంచి సంభాషణా నైపుణ్యం, జట్టుగా పనిచేసే స్వభావం, సమస్యా పరిష్కార శక్తి, విమర్శనాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించుకోవాలని కంపెనీలు ఆశిస్తాయి. సంప్రదాయ విద్య నుంచి వృత్తి విద్యకు మారడం విద్యార్థులకు కష్టమైపోతోందని నివేదిక తెలిపింది. ఈ అడ్డంకిని తొలగించి ఇంటర్న్ షిప్, అప్రెంటిస్ షిప్ అవకాశాలను కల్పించాలని సిఫార్సు చేసింది. స్టెమ్ కోర్సులు, భాషా నైపుణ్యం, జీవితంలో రాణించడానికి తోడ్పడే నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలని సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.