గుర్తింపు రద్దయిన కళాశాలల్లో మాత్రం నిలిపివేత
ఎన్‌ఎంసీ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: గతేడాది వైద్యవిద్య సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతించిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు ఈ ఏడాది(2022-23) కూడా యథావిధిగా అనుమతులు కొనసాగిస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) పేర్కొంది. గతేడాది నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో గుర్తింపు రద్దు, బ్యాచ్‌ల నిలిపివేతకు గురైన కళాశాలల్లో మాత్రం ప్రవేశాలను నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అక్టోబరు 21న ఎన్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. 2022-23 వైద్యవిద్య సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. అయిదేళ్ల వైద్యవిద్య కాలానికి ఏ ఏడాదికి ఆ ఏడాది వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్యంలో సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట వైద్య కళాశాలలకు అనుమతులు రాగా.. ప్రైవేటులో 12 వైద్య కళాశాలలకు 2022-23 సంవత్సరానికి అనుమతిస్తూ ఎన్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. తనిఖీలు నిర్వహించకుండానే గతేడాది అనుమతులను పొడిగిస్తూ ఎన్‌ఎంసీ తీసుకున్న నిర్ణయం వివాదస్పదమవుతోంది. కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహించిన తర్వాత.. తనిఖీలకు వచ్చి, సంతృప్తి చెందక సీట్లను రద్దు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏంటీ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో గత వైద్యవిద్య సంవత్సరంలో మహావీర్, టీఆర్‌ఆర్, ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లకు ప్రవేశాలు జరిగిన తర్వాత.. ఒక్కో దాంట్లో 150 సీట్ల చొప్పున మొత్తం 450 ఎంబీబీఎస్ సీట్లను ఎన్‌ఎంసీ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఎంఎన్‌ఆర్ కళాశాలలో సీట్లను పునరుద్ధరించగా.. మహావీర్, టీఆర్‌ఆర్ కళాశాలల విద్యార్థులను ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా తనిఖీలు నిర్వహించకుండానే అనుమతులు ఇస్తే.. గత అనుభవమే పునరావృతమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్‌ఎంసీ తాజా ఆదేశాల ప్రకారం.. ఇప్పటి వరకైతే మహావీర్, టీఆర్‌ఆర్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రవేశాలను నిలిపివేసినట్లు కాళోజీ ఆరోగ్య వర్సిటీ వర్గాలు తెలిపాయి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా!
‣ కొలువుకు భరోసా.. కమ్యూనిటీ సైన్స్ డిగ్రీ
‣ ఆలస్యంగా వీసాలు.. ఏం చేస్తే మేలు?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.