* ముగిసిన మూడు విడతల కౌన్సెలింగ్
* సీఎస్ఈ, సంబంధిత బ్రాంచీల్లో నిండిన సీట్లు 93 శాతం
* మిగిలిపోనున్న సుమారు 24 వేల సీట్లు
* ప్రభుత్వ కళాశాలల్లో 23 శాతం ఖాళీ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ కన్వీనర్ కోటాలో 79,346 బీటెక్ సీట్లకుగాను 63,899 మందికి సీట్లు దక్కాయి. చివరి విడత సీట్లను అక్టోబర్ 25న కేటాయించారు. ఇప్పటికీ 15,447 సీట్లను ఎవరికీ కేటాయించలేదు. అవి మిగిలిపోయినట్లే. ఇక సీట్లు పొందిన 63,899 మందిలో చేరే వారు 55 వేలకు మించరన్నది ఎంసెట్ ప్రవేశాల కమిటీ వర్గాల అంచనా. ఆ ప్రకారం కన్వీనర్ కోటాలోనే సుమారు 24 వేల బీటెక్ సీట్లు మిగిలిపోనున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి చేరే వారి సంఖ్య మూడు వేలు ఎక్కువగానే ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. చాలా కళాశాలల్లో సీఎస్ఈ, సంబంధిత సీట్లు పెరగడమే అందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. చివరి విడతలో ఎంపీసీ విద్యార్థులకు 4,025 బీఫార్మసీ సీట్లు అందుబాటులో ఉండగా వాటిలో 60 సీట్లలో మాత్రమే చేరారు.
కళాశాలల్లో చేరికకు 28 తుది గడువు
తాజాగా సీట్లు పొందిన వారు అక్టోబర్ 28వ తేదీలోపు ఫీజు చెల్లించి...ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అంతేకాదు వారితోపాటు గత రెండు విడతల్లో సీట్లు పొందిన వారు కూడా స్వయంగా కళాశాలకు వెళ్లి ఒరిజినల్ టీసీతోపాటు ఇతర ధ్రువపత్రాలకు సంబంధించి జిరాక్స్ కాపీలు అందజేయాలి.
ప్రభుత్వ కళాశాలలైనా నచ్చిన కోర్సు అయితేనే
16 ప్రభుత్వ కళాశాలల్లో ఈసారి మొత్తం 4,914 బీటెక్ సీట్లు ఉండగా వాటిల్లో 3771 మాత్రమే నిండాయి. 1143 (23శాతం) సీట్లు ఖాళీగానే ఉన్నాయి. సిరిసిల్ల జేఎన్టీయూహెచ్ కళాశాలలో టెక్స్టైల్ టెక్నాలజీలో ఎవరూ చేరలేదు. మెకానికల్లో ఇద్దరికే సీట్లు దక్కాయి. వారిద్దరూ చేరతారా? లేదా? అన్నది అక్టోబర్ 28వ తేదీకి తేలిపోతుంది. ఒకవేళ చేరితే ఆ ఇద్దరితో ఎలా తరగతులు నడుపుతారన్నది ఆసక్తికరంగా మారింది. సీట్లు మిగిలితే ప్రైవేట్ కళాశాలల్లో స్పాట్ ప్రవేశాలు జరుపుతారు. ప్రభుత్వ కళాశాలలకు ఆ వెసులుబాటు లేనందున మెకానికల్లో ఆ ఇద్దరు మాత్రమే ఉంటారు. ఇక వనపర్తి కళాశాలలో మెకానికల్లో ఏ ఒక్కరూ ప్రవేశం పొందలేదు. సివిల్లో అయిదుగురికి మాత్రమే సీట్లు వచ్చాయి. కొత్తగూడెం కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ విభాగంలో మైనింగ్ ఇంజినీరింగ్, ఈఈఈ బ్రాంచీల్లో ఒక్కరూ చేరలేదు. ఓయూలోని టెక్స్టైల్ టెక్నాలజీ (సెల్ఫ్ ఫైనాన్స్) కేవలం అయిదుగురు మాత్రమే చేరారు. మొత్తానికి సీఎస్ఈ, సంబంధిత సీట్లు అయితేనే ప్రభుత్వ కళాశాలలైనా విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని నిపుణులు భావిస్తున్నారు.
బ్రాంచీల వారీగా సీట్ల భర్తీ
* సీఎస్ఈ, సంబంధిత బ్రాంచీల్లో 49, 031సీట్లకు గాను 45,775 (93 శాతం)భర్తీ అయ్యాయి. ఇంకా 3,256 సీట్లు మిగిలిపోయాయి. వాటిలో అత్యధికంగా సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్)లో 1002 సీట్లు ఉన్నాయి. సీఎస్ఈలో 704 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
* ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో 18,825 సీట్లు ఉండగా 14,265 సీట్లు (76 శాతం) నిండాయి. ఇంకా 4,560 మిగిలాయి.
* సివిల్, మెకానిక్, సంబంధిత బ్రాంచీల్లో మొత్తం 10,286 సీట్లకు 3,328 మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 6,958 సీట్లు (68 శాతం) మిగిలిపోయాయి.
సీట్ల కేటాయింపు... మిగిలిపోయినవి
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పీజీ విద్యార్థినులకు యూజీసీ ప్రోత్సాహం
‣ డిజిటల్ అక్షరాస్యత... మీకుందా?
‣ మైనారిటీ బాలికలకు ఉపకార వేతనాలు
‣ క్లిష్ట సమయాల్లోనూ ఉద్యోగ సాధన ఎలా?
‣ ఉద్యోగ సంస్థల్లో ఆన్లైన్ శిక్షణ
‣ ఆడుకుంటూ చేసుకునే ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.