బయో టెక్నాలజీ, కెమికల్, మెకానికల్, ఇతర సైన్స్ కోర్సుల్లోనే అధికం
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో వందల సంఖ్యలో బీటెక్ సీట్లు మిగిలిపోయాయి. సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత సీట్లు వస్తేనే విద్యార్థులు చేరుతున్నందున ప్రతిష్ఠాత్మక సంస్థల్లోనూ పలు బ్రాంచీల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, గణితం తదితర బ్రాంచీల్లో పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలాయి. వాటి భర్తీకి సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు(సీశాబ్) ద్వారా రెండు విడతల ప్రత్యేక కౌన్సెలింగ్ అక్టోబరు 26న ప్రారంభమైంది. అక్టోబరు 29 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అక్టోబరు 30న సాయంత్రం 5 గంటలకు సీట్లు కేటాయిస్తారు. ఎన్‌ఐటీ రవుర్కెలా సంచాలకుడు ఆచార్య ఉమామహేశ్వర్ రావు సీశాబ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో కౌన్సెలింగ్ జరుగుతోంది.
తెలుగు ఎన్‌ఐటీల్లో మెకానికల్‌లో అధికం
తెలుగు రాష్ట్రాల్లోని ఎన్‌ఐటీల్లోనూ అధిక సంఖ్యలో సీట్లు భర్తీ కాలేదు. వరంగల్ ఎన్‌ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో 19 సీట్లు, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్‌లో 16 చొప్పున, సివిల్- 14, ఈసీఈలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఏపీ ఎన్‌ఐటీ(తాడేపల్లిగూడెం)లో మెకానికల్‌లో 30కిపైగా, సివిల్‌లో 25కిపైగా, బయోటెక్నాలజీలో 15, కెమికల్ ఇంజినీరింగ్‌లో 9 సీట్లు మిగిలిపోయాయి. ఎన్‌ఐటీల్లో సగం సీట్లు సొంత రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన సగం ఇతర రాష్ట్రాల వారికి కేటాయిస్తారు. ఇతర రాష్ట్రాల కోటాలో ఎక్కువ ఖాళీలున్నాయి.
రిపోర్టింగ్ గడువు పెంచకుంటే ఇబ్బందులే
తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా బీటెక్ సీట్లు సాధించిన విద్యార్థులు అక్టోబరు 28 నాటికి ఆయా కళాశాలల్లో స్వయంగా రిపోర్ట్ చేయాలి. లేకుంటే సీట్లు చేజారతాయి. ఆయా కళాశాలలు ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకుంటున్నాయి. రాష్ట్ర విద్యార్థులు వందలాదిగా సీశాబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నారు. వారికి తొలి విడత సీట్లను అక్టోబరు 30 సాయంత్రం 5 గంటలకు కేటాయిస్తారు. అలాంటి వారు రాష్ట్ర కళాశాలల్లో సమర్పించిన ధ్రువపత్రాలను వెనక్కి తీసుకోవాలంటే యాజమాన్యాలు అంగీకరించవు. ఒకవేళ అంగీకరించినా ఇబ్బందులు పెడతాయి. సీట్లు ఖాళీ అయితే నాలుగేళ్లు వృథాగా ఉండాలని, మరో ఏడాది ఫీజైనా ఇవ్వాలని తిరకాసు పెడతాయి. మరోవైపు ఆ సీట్‌ను స్పాట్ కౌన్సెలింగ్‌లో భర్తీ చేసుకుంటాయి. అందుకే ఎంసెట్ ద్వారా కళాశాలల్లో రిపోర్ట్ చేసే గడువును అక్టోబరు 31 వరకు పొడిగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈసారి ఎక్కువ సీట్లు భర్తీ అవుతాయి: ఆచార్య ఉమామహేశ్వర్‌రావు, ఛైర్మన్, సీశాబ్
జోసా కౌన్సెలింగ్ ద్వారా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో భర్తీకాని సీట్లకు రెండు విడతల ప్రత్యేక కౌన్సెలింగ్ జరుపుతున్నాం. ఈసారి తెలుగు సహా ఎనిమిది ప్రాంతీయ భాషల్లో హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేశాం. మాతృభాషల్లో సమాచారం లభిస్తుంది. అందువల్ల ఈసారి ఎక్కువగా సీట్లు భర్తీ అవుతాయని, గతం కన్నా తక్కువ సీట్లు మిగులుతాయని భావిస్తున్నాం. నవంబరు ఆరోతేదీకి రెండు విడతల కౌన్సెలింగ్ ముగుస్తుంది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పీజీ విద్యార్థినులకు యూజీసీ ప్రోత్సాహం
‣ డిజిటల్ అక్షరాస్యత... మీకుందా?
‣ మైనారిటీ బాలికలకు ఉపకార వేతనాలు
‣ క్లిష్ట సమయాల్లోనూ ఉద్యోగ సాధన ఎలా?
‣ ఉద్యోగ సంస్థల్లో ఆన్‌లైన్ శిక్షణ
‣ ఆడుకుంటూ చేసుకునే ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.