* విడుదల చేసిన అమెరికా ప్రభుత్వం
* వచ్చే నెలలో మరిన్ని అందుబాటులోకి
ఈనాడు, హైదరాబాద్: అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవాలనే ఆశావహులు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా ప్రభుత్వం భారతీయ కాలమానం ప్రకారం అక్టోబర్ 29న పెద్దసంఖ్యలో విద్యార్థి వీసా(ఎఫ్-1) స్లాట్లు విడుదల చేసింది. దిల్లీలోని రాయబార కార్యాలయంతో పాటు ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లలోని అన్ని కాన్సులేట్ల పరిధిలో ఏకకాలంలో అవి విడుదల అయ్యాయి. ఇంటర్వ్యూ సమయాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఒక్కసారిగా ప్రయత్నించటంతో సంబంధిత సైట్లు మందగమనంతో సాగాయి. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు తరగతులను జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రారంభించనున్నాయి. తదనుగుణంగా గత వారంలోనే స్లాట్లు విడుదల కావాల్సి ఉంది. హెచ్-1బి వీసాల పునరుద్ధరణ డ్రాప్ బాక్స్ వీసాదారులకు అవకాశం ఇవ్వటంతో విద్యార్థుల విషయంలో జాప్యం జరిగినట్లు సమాచారం. గత జులై, ఆగస్టుతో ముగిసిన విద్యా సంవత్సరంలో సుమారు 82వేల మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసాలను అమెరికా జారీచేసింది. ఇంత భారీగా వీసాలు జారీచేయటం ఇదే తొలిసారి. త్వరలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలోనూ ఇదే సరళి కొనసాగవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వీసాల జారీలో జాప్యాన్ని నియంత్రించేందుకు అమెరికా సర్కారు పెద్ద సంఖ్యలో సిబ్బందిని ఎంపికచేసి ఇంటర్వ్యూ అధికారులుగా ఇటీవలే భారత్‌కు పంపింది. కాన్సులేట్ కార్యాలయాల్లో వారు విధుల్లో చేరటంతో అక్టోబర్ 29న స్లాట్లు విడుదల చేశారు.
క్షణాల్లో మాయం...
విడుదలైన క్షణాల్లోనే నవంబరు నెల స్లాట్లు పూర్తికావటం విశేషం. హైదరాబాద్‌తో పాటు ఒకటి, రెండు చోట్ల గతంలో పర్యాటక వీసా ఉన్నవారి కోసం డ్రాప్‌బాక్స్ స్లాట్లు కూడా విడుదలయ్యాయి. కొన్ని ప్రత్యేక కేసుల్లో తప్ప.. ఆ సదుపాయానికి అర్హులైన విద్యార్థుల్లో ఎక్కువమందికి ఇంటర్వ్యూకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అన్ని కాన్సులేట్లు పూర్తిస్థాయిలో విద్యార్థి వీసాల కోసమే పనిచేస్తాయని రాయబార కార్యాలయ వర్గాల సమాచారం. అత్యవసర వీసా దరఖాస్తులకే ఈ సమయంలో అవకాశం కల్పిస్తామని అవి పేర్కొన్నాయి. నవంబరు రెండోవారంలో మరోదఫా మరికొన్ని స్లాట్లు విడుదల చేయనున్నట్లు తెలిసింది. రెండు దఫాలుగా స్లాట్లు విడుదల చేయనున్నట్లు దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో మినిస్టర్ కాన్సులర్ డాన్ హెఫ్లిన్ ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా తొలివిడత విడుదలయ్యాయి. అవకాశం లభించని విద్యార్థులు ఆందోళన చెందనవసరం లేదు. వీసా ఇంటర్వ్యూ సమయం కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించవచ్చు. ఎందుకంటే, ఒకసారి వీసా దరఖాస్తు తిరస్కరించినా.. రెండో దశ చివరిలో వారికి మరో అవకాశం ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.