నేటికీ విద్యార్థులకందని పాఠ్యపుస్తకాలు
ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంస్కరణల ఫలితాల మాటేమోగానీ, నేటికీ పిల్లలకు పాఠ్య పుస్తకాలు సకాలంలో అందడం లేదు. కరోనా ప్రభావంతో విద్యార్థుల్లో తగ్గిన అభ్యసన సామర్థ్యాలకు మరింత పదును పెట్టాలంటూ విద్యా నిపుణుల సూచనలకు అనుగుణంగా రూపొందించిన పాఠ్య ప్రణాళిక పుస్తకాల కొరతతో ఆలస్యమవుతోంది. ఓ వైపు అందని పాఠ్య పుస్తకాలు మరోవైపు ఆలస్యమవుతున్న యూనిట్ పరీక్షలు విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో అసహనాన్ని పెంచుతున్నాయి.
మైలవరం, న్యూస్‌టుడే: సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. బడులు తెరిచిన నాటి నుంచి సెప్టెంబరు వరకు మొదటి, అక్టోబరు నుంచి డిసెంబరు వరకు రెండు, జనవరి నుంచి మార్చి వరకు పాఠ్యాంశాలను మూడు సెమిస్టర్లుగా విభజించింది. ఇందులో భాగంగా గ్రూపు సబ్జెక్టులైన గణితం, సామాన్యం, సాంఘిక శాస్త్రాల పాఠ్య పుస్తకాలను ఆయా సెమిస్టర్ల సిలబస్‌కు అనుగుణంగా రూపొందిస్తారు. ప్రతి సెమిస్టర్ ప్రారంభానికి ముందే వాటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు పాఠశాలలకూ ఆయా పాఠ్యపుస్తకాలను తామే సరఫరా చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఆమేరకు పాఠ్య పుస్తకాల ఖరీదును ప్రైవేటు స్కూళ్ల నుంచి డీడీల రూపంలో సేకరించింది. నిబంధనల ప్రకారం అక్టోబరు నెల ప్రారంభానికి ముందే రెండో సెమిస్టర్ పాఠ్యపుస్తకాలను సరఫరా చేయాల్సి ఉంది.
అందుబాటులో ఉన్న పుస్తకాలు
‣ ప్రభుత్వ పాఠశాలలకు 2,81,489
‣ ప్రైవేటు స్కూళ్లకు 1,09,237
పరీక్షల ఆలస్యం?
విద్యాశాఖ ప్రణాళికాలోపంతో జిల్లావ్యాప్తంగా రెండో సెమిస్టర్‌కు సంబంధించిన పాఠ్యపుస్తకాలు నేటికీ ఎమ్మార్సీలకు చేరలేదు. పాత విధానంలోనైతే ఈపాటికి రెండు యూనిట్ పరీక్షలు పూర్తయ్యేవి. ఇప్పుడు పుస్తకాల పంపిణీలో జరిగిన జాప్యంతో క్లాస్‌రూం బేస్డ్ టెస్ట్ (సీబీటి) నవంబరు 1వ తేదీ వచ్చినా నిర్వహించలేదని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు సగం విద్యా సంవత్సరం పూర్తయింది. రెండో సెమిస్టర్‌లోనూ ఒక నెల ముగిసింది. ఇప్పటి వరకు పుస్తకాలు అందకపోతే, ప్రణాళికా మేరకు బోధన ఇబ్బందికరమవుతుందని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల బోధనతో పాటు విద్యార్థుల అభ్యసనంపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మూడు సెమిస్టర్లకు సంబంధించిన పాఠ్య పుస్తకాల ఖరీదును డీడీల రూపంలో తీసుకున్న అధికారులు, నేటికీ మొదటి సెమిస్టర్ పుస్తకాలనూ సరఫరా చేయలేదని పలు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తెలిపాయి.
3వ తేదీ నుంచి పంపుతాం: రేణుక, విద్యాశాఖాధికారి, ఎన్టీఆర్ జిల్లా
రెండో సెమిస్టర్‌కు సంబంధించి 1 నుంచి 7వ తరగతి పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. 6, 7 తరగతులకు మూడో సెమిస్టర్ పాఠ్య పుస్తకాలను అందుబాటులో తెచ్చాం. కమిషనర్ ఆదేశాల మేరకు 3 నుంచి 10వ తేదీలోపు జిల్లాలోని అన్ని మండలాలకు పంపుతాం. ఉన్నతస్థాయి ప్రణాళిక మేరకే పుస్తకాల పంపిణీ జరుగుతోంది. ప్రైవేటు స్కూళ్ల నుంచి తీసుకున్న డీడీల మేరకు పుస్తకాలు అందజేస్తాం. ప్రస్తుతం నూతన విద్యా విధానంలో నవంబరు 2 నుంచి సీబీటీ ప్రారంభమవుతుంది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మైనారిటీ బాలికలకు ఉపకార వేతనాలు
‣ క్లిష్ట సమయాల్లోనూ ఉద్యోగ సాధన ఎలా?
‣ ఉద్యోగ సంస్థల్లో ఆన్లైన్ శిక్షణ
‣ ఆడుకుంటూ చేసుకునే ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.