• facebook
  • whatsapp
  • telegram

Teachers: అన్ని పనులూ ఉపాధ్యాయులకే

30 వేల విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది 10,689 మందే
పాఠాలు చెప్పాలి..  ఇతర వ్యవహారాలూ చూడాలి
చివరకు నష్టపోతోంది విద్యార్థులే..

ఈనాడు, హైదరాబాద్‌: సర్కారు పాఠశాలల్లో అసలే అరకొర ఉపాధ్యాయులు.. వేలకొద్దీ ఖాళీలు.. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు నిపుణుల కొరత.. ప్రాథమిక పాఠశాలల్లో అయిదు తరగతులకు ఒక్కరే టీచర్‌. ఈ పరిస్థితుల్లో బోధనేతర పనులూ వారే చేసుకోవాల్సిన దుస్థితి. క్లరికల్‌ సిబ్బంది లేక పాఠశాలలో ఉండే సమయంలో సగం బోధనేతర పనులకే కేటాయించాల్సి వస్తోంది. రాష్ట్రంలో మొత్తం పాఠశాలల్లో మూడో వంతు మాత్రమే ప్రైవేట్‌ బడులున్నాయి. అయినా ప్రభుత్వ బడుల కంటే బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య ప్రైవేట్‌ పాఠశాలల్లో అధికం. ఒక్కో ప్రైవేట్‌ పాఠశాలలో సగటున 14.5 మంది ఉపాధ్యాయులు, 3.85 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా 4.6, 0.35 మంది మాత్రమే ఉన్నారు. గురుకులాలు మినహా రాష్ట్రంలో 26 వేల బడులు ఉండగా వాటిల్లో 1037 జూనియర్‌ అసిస్టెంట్లు, 798 రికార్డు అసిస్టెంట్లు, 1875 అటెండర్లు, 16 మంది స్వీపర్లు ఉన్నారు. ఉపాధ్యాయులపరంగా చూసినా ప్రైవేట్‌తో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మొత్తం 30 వేల ప్రభుత్వ విద్యాలయాలకు కనీసం 30 వేల మంది బోధనేతర సిబ్బంది అవసరం. కానీ 10,689 మంది మాత్రమే ఉండటం గమనార్హం.
పనుల భారం అధికం..
ప్రధానోపాధ్యాయులుగానీ.. ఉపాధ్యాయులుగానీ పదుల సంఖ్యలోనే బోధనేతర పనులు చేయాల్సి వస్తోంది. రిజిస్టర్ల నిర్వహణ, జీతభత్యాల బిల్లులు, జీపీఎఫ్‌, మెడికల్‌, పింఛన్‌ తదితర అన్ని పనులనూ టీచర్లే చేస్తున్నారు. వీటన్నింటినీ అనధికారికంగా ఎవరో ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు స్కూల్‌ కాంప్లెక్స్‌కు వెళ్లి చేయక తప్పని పరిస్థితి. హైస్కూళ్లలో ప్రధానోపాధ్యాయులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం లేకుంటే ఎవరో ఒక టీచర్‌ సహకారం తీసుకుంటున్నారు. ఇవేకాకుండా పైఅధికారులు అడిగిన సమాచారం పంపడం, మధ్యాహ్న భోజనం బిల్లులు, హాజరు వివరాల తయారీ లాంటివి ఎన్నో చేయాల్సి వస్తోంది. వాటిని పంపేందుకు బోధనేతర సిబ్బంది లేకపోవడంతో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులే చేయాల్సి వస్తోంది. వేల పాఠశాలల్లో ఒక్క బోధనేతర ఉద్యోగి లేకపోగా.. మరికొన్ని పాఠశాలల్లో ముగ్గురి నుంచి నలుగురు ఉన్నా అధికారులు మాత్రం వారిని సర్దుబాటు చేయడం లేదు. కరీంనగర్‌ జిల్లాల్లో అనేక పాఠశాలల్లో ఇదే పరిస్థితి. రాష్ట్రంలో దాదాపు 4 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు ఒక ఉపాధ్యాయుడితోనే నడుస్తున్నాయి. ఇక అలాంటిచోట్ల అయిదు తరగతులకు బోధించడమే కష్టం. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మంది వరకు ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బోధనేతర పనులంటే పాఠాల బోధనకు స్వస్తి చెప్పక తప్పదు. దీనివల్ల పేదపిల్లలకే నష్టం జరుగుతోందని ఓ ప్రధానోపాధ్యాయుడు అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి హైస్కూల్లో కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టు అత్యవసరమని మరో ప్రధానోపాధ్యాయుడు సూచించారు. ‘ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులు, పిల్లలను ఆకట్టుకోవాలంటే ఉపాధ్యాయులతో పాటు బోధనేతర సిబ్బంది చాలా ముఖ్యం. అందుకే చిన్న పాఠశాలలో కూడా స్వీపర్‌, అటెండర్‌, క్లర్క్‌, సెక్యూరిటీ గార్డు, ఆయాలను నియమించుకుంటున్నాం’ అని తెలంగాణ గుర్తింపు పాఠశాలల యాజమాన్య సంఘం(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు చెప్పారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.