• facebook
  • whatsapp
  • telegram

UGC-NET: యూజీసీ-నెట్‌లో 99.31 శాతం స్కోర్‌తో అంగవైకల్యాన్ని ఓడించిన యువతి 

పక్కవారి సహాయం లేకపోతే అడుగు కూడా వేయలేదు. కానీ తన సంకల్పంతో.. అక్షరాలను అందిపుచ్చుకుని ఎంతో ఎత్తుకు ఎదిగింది. అంగవైకల్యాన్ని అధిగమించిన ఆ అమ్మాయి.. జాతీయ అర్హత పరీక్ష (నెట్‌)లో 99.31 శాతం స్కోర్‌ సాధించి ఆశ్చర్యానికి గురిచేసింది. పశ్చిమబెంగాల్‌ నదియా జిల్లా శాంతిపుర్‌కు చెందిన పియాషా మహల్దార్‌ పుట్టుకతోనే దివ్యాంగురాలు. 3 అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. బాల్యం నుంచి తనంతట తానుగా కదలలేని పరిస్థితి. అయినా సరే పియాషాకు చదువంటే చాలా ఆసక్తి. పాఠశాల, కళాశాల స్థాయిలోనూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. యూజీసీ నిర్వహించిన నెట్‌ను కంప్యూటర్‌ ముందు బోర్లా పడుకుని రాసింది. సోమవారం ఫలితాలు వెలువడగా.. బెంగాలీ విభాగంలో 99.31 శాతం స్కోర్‌ సాధించింది పియాషా.
యూట్యూబ్‌లో పాఠాలు విని.. నీట్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం
: జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అందరూ కలలు కంటుంటారు. కానీ వాటిని సాధించేందుకు కొందరే కష్టపడుతుంటారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టు వదలకుండా ప్రయత్నిస్తుంటారు. ఆ కోవకు చెందినవారే నగరంలోని నాందేవ్‌వాడకు చెందిన విద్యార్థిని హారిక. ఏడో తరగతిలో ఉన్నప్పుడు టీచర్‌ చెప్పిన మాటలతో డాక్టర్‌ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకొంది. పేదరికం కారణంగా శిక్షణ తీసుకోలేకపోయినా.. అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకొంది. నీట్‌లో మెరుగైన ర్యాంకు తెచ్చుకొని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించింది.
అద్దె గదిలో ఉంటూ..
సతీష్‌కుమార్‌, అనురాధ దంపతులకు ఈశ్వర్‌, హారిక ఇద్దరు సంతానం. సతీష్‌కుమార్‌ 15 ఏళ్ల క్రితం ఉపాధి కోసం సిద్దిపేట్‌ను వదిలి నిజామాబాద్‌కు వచ్చారు. కొంతకాలానికి ఆయన అనారోగ్యంతో మృతి చెందగా.. కుటుంబ భారమంతా అనురాధపై పడింది. బడులు, గుడుల్లో పనిచేస్తూ సాయంత్రం బీడీలు చుడతారు. ఒక అద్దె గదిలో ఉంటూ వారిని చదివిస్తున్నారు. ఈశ్వర్‌ బీటెక్‌ పూర్తి చేయగా.. హారిక ఎంబీబీఎస్‌ చదవాలని నిర్ణయించుకొంది.
టీచర్‌ నిర్దేశించిన లక్ష్యం
సుభాష్‌నగర్‌లోని హోలిమేరీ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య కొనసాగింది. ఏడో తరగతిలో ఉన్నప్పుడు తెలుగు టీచర్‌.. భవిష్యత్తులో ఏమవుతారని విద్యార్థులను అడిగింది. తాను ఇంకేమి అనుకోలేదని హారిక బదులిచ్చింది. దీంతో సదరు ఉపాధ్యాయురాలు.. మన ప్రిన్సిపల్‌ కూతురిలా డాక్టర్‌ కావాలని సూచించడంతో అదే తన లక్ష్యంగా మార్చుకొంది. ఎలాగైనా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీటు సాధించాలని కష్టపడి చదివింది. పదిలో 9.5 జీపీఏ, ఇంటర్‌లో 942 మార్కులు వచ్చాయి.
పట్టుదలతో..
2020లో ఇంటర్‌ పూర్తి కావడంతో తన లక్ష్యమైన నీట్‌ పరీక్షకు సొంతంగానే సిద్ధమై 315 మార్కులు సాధించింది. ఆ మార్కులతో ఉచితంగా సీటు రాదని, నీట్‌ సాధనకు శిక్షణ తప్పనిసరి తీసుకోవాలని అధ్యాపకులు, స్నేహితులు సూచించారు. కానీ ఆర్థికంగా తల్లిని కష్టపెట్టడం ఇష్టంలేక ఇంటివద్దే చదివింది. 2021 నీట్‌లో 445 మార్కులు వచ్చినా.. ప్రభుత్వ కళాశాలల్లో సీటు రాలేదు. దీంతో స్నేహితులు, బంధువులు వైద్యవిద్య సాధ్యం కాదని తేల్చిచెప్పారు. బంధువులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చినా ఆమె పట్టువీడలేదు.
సిద్దిపేట కళాశాలలో..
క్రమంగా మార్కులు పెరగడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. బంధువుల దగ్గరి నుంచి పాత స్మార్ట్‌ఫోన్‌ తీసుకొని యూట్యూబ్‌లో తరగతులు వింటూ చదివింది. చివరికి ఈ ఏడాది నిర్వహించిన నీట్‌లో 563 మార్కులు తెచ్చుకొని, రాష్ట్రస్థాయిలో 703 ర్యాంకు సాధించింది. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందింది. ఫీజు చెల్లించలేని స్థితిలో ఆ కుటుంబం ఉండటంతో ఎమ్మెల్సీ కవిత బుధవారం ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిసింది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.