• facebook
  • whatsapp
  • telegram

Byju's: బైజూస్‌ బాలారిష్టాలు

ఆంగ్ల మాధ్యమంలో కంటెంట్‌  
అర్థంకాక విద్యార్థులకు ఇబ్బందులు
సందేహాలను నివృత్తి చేసేవారే లేరు
30% మందికిపైగా స్మార్ట్‌ ఫోన్లు లేవు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న బైజూస్‌ కంటెంట్‌ మొక్కుబడి తంతుగా మారింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు వినియోగిస్తున్నారా? వారికి సందేహాలు వస్తే ఎవర్ని సంప్రదించాలి? ఒకవేళ స్మార్ట్‌ ఫోన్‌ లేకపోతే వారికి కంటెంట్‌ ఎలా అందిస్తారు? అనే దానిపై స్పష్టత లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు, ఆ తరగతికి బోధించే ఉపాధ్యాయులకు మాత్రమే ట్యాబ్‌లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా తరగతుల విద్యార్థులకు వారి సొంత స్మార్ట్‌ఫోన్లలోనే బైజూస్‌ కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆదేశించింది. కొన్నిచోట్ల ఫోన్లు ఉన్న వారికి డౌన్‌లోడ్‌ చేసి ఇవ్వడం ఇప్పటికే పూర్తికాగా.. మరికొన్నిచోట్ల ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థుల ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసిన కంటెంట్‌ను పిల్లలు వాడుతున్నారా? లేదా? అని పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక విభాగం లేదు. కంటెంట్‌ వేసి ఇచ్చేశాం.. మీ బాధ మీరు పడండి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఒకవేళ విద్యార్థులకు సందేహాలు వస్తే తీర్చేవారు లేరు. తల్లిదండ్రుల వద్ద ఉండే ఫోన్లు కావడంతో పాఠశాలకు వాటిని తీసుకొచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిలో 30% మందికి పైగా స్మార్ట్‌ ఫోన్లు లేవు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించిన సమయంలోనే ఈ విషయం బహిర్గతమైంది. ఇది తెలిసినా ప్రభుత్వం బైజూస్‌ కంటెంట్‌ను సొంత స్మార్ట్‌ ఫోన్లలో వేసుకోవాలని సూచించడం గమనార్హం. విద్యార్థుల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లలోని ఫోన్‌ నంబర్లతోపాటు కొన్నిచోట్ల బంధువుల నంబర్లు నమోదు చేశారు. దీంతో ఎంతమందికి స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయో కచ్చితంగా తెలియని దుస్థితి నెలకొంది.
ఉపాధ్యాయులకు నోటీసులు
క్షేత్రస్థాయిలో అనేక సమస్యలున్నా బైజూస్‌ను అమలు చేసేందుకు విద్యాశాఖ చేస్తున్న ప్రయత్నాలు ఎవరి కోసం? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫోన్‌ నంబర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదంటూ ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 211 మందికి, పార్వతీపురం మన్యం జిల్లాలో 530 మంది ప్రధానోపాధ్యాయులకు ఇలా నోటీసులు ఇచ్చారు. దీనిపై ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత  వ్యక్తమవడంతో ప్రస్తుతం ఎలాంటి చర్యలు లేకుండా యథాతథ స్థితి కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఉపాధ్యాయులు ఆందోళన  చెందుతున్నారు.
కాన్సెప్ట్‌లు అర్థం చేసుకునేదెలా?
‣ బైజూస్‌ కంటెంట్‌ పూర్తిగా ఆంగ్లంలో ఉంది. ఈ వీడియోలు అర్థం చేసుకునేందుకు చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వారు ఎలాంటి సందేహాలను అడగడం లేదంటే వినియోగించడం లేదనే అర్థమవుతోందని పలువురు
ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
‣ బైజూస్‌ కంటెంట్‌ అంతా టీఎల్‌ఎం విధానంలో ఉంటుంది. విద్యార్థి సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ విధానంలోనే చెప్పాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు వెల్లడిస్తున్నారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులకే ఈ వీడియోలు అర్థం కాని పరిస్థితి. అలాంటప్పుడు విద్యార్థుల సందేహాలను వీరు ఎలా నివృత్తి చేయగలుగుతారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
 తమకు ఇచ్చిన పరికరాల (టీఎల్‌ఎం)తో తరగతి గదిలో బోధించేందుకు ఉపాధ్యాయులకు ఏడాదికి రూ.500 మాత్రమే
ఇస్తున్నారు. ఇది ఏ మాత్రం సరిపోదని వారు చెబుతున్నారు.
‣ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వ్యవసాయ, ఇతర పనుల కోసం ఈ సీజన్‌లో వలసలు వెళ్తుంటారు. పిల్లల్ని కొంతమంది తమతో పాటు తీసుకువెళ్తుండగా మరికొందరు పెద్దవాళ్లు, బంధువుల ఇళ్లల్లో ఉంచుతున్నారు. వారికి స్మార్ట్‌ఫోన్లు లేవు. వీరికి బైజూస్‌ కంటెంట్‌ అందలేదు. కొన్నిచోట్ల నెట్‌వర్క్‌ సమస్యలు ఉన్నాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.