మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా లక్షల సంఖ్యలో యువత డిగ్రీ పట్టాలు సాధించి కోటి ఆశలతో బయటకు వస్తున్నారని.. వారంతా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకోలేకపోతున్నారని.. ఈ పరిస్థితిని మార్చాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. యువత కలలు నెరవేర్చాలా విద్యను అందించాలని ఉన్నత విద్యామండలిని కోరారు. టీసీఎస్ అయాన్, టీఎస్ ఆన్‌లైన్‌తో కలిసి రాష్ట్ర ఉన్నత విద్యామండలి ‘విద్య బలోపేతం - ఉద్యోగావకాశాల పెంపు’ అనే అంశంపై నవంబరు 21న నిర్వహించిన సదస్సుకు మంత్రి హాజరై ప్రసంగించారు. విద్యార్థులు రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో చేరేందుకు పోటీపడే రోజులు రావాలని మంత్రి ఆకాంక్షించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ ఇంటర్న్‌షిప్, ఎంట్రప్రెన్యూర్, అధ్యాపకుల ఓరియంటేషన్ కార్యక్రమాల నిర్వహణ వల్లే విద్యార్థులను ఉద్యోగాలకు సన్నద్ధం చేయగలమన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి మాట్లాడుతూ ఉద్యోగావకాశాలను పెంచే బీకాం బిజినెస్ అనలిటిక్స్, బీఎస్‌సీ డేటాసైన్స్, బీఏ ఆనర్స్ వంటి కోర్సులను ఇప్పటికే ప్రవేశపెట్టామన్నారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ మన దగ్గర ఉన్న విద్యాప్రణాళిక 20ఏళ్ల క్రితం నాటిదని, దాన్ని మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. సదస్సులో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య వి.వెంకటరమణ, టీసీఎస్ కంట్రీ మార్కెట్ హెడ్ గోపాలకృష్ణ, ఉప కులపతులు కట్టా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.