* జెనరేషన్ జడ్ లక్ష్యం టెక్నాలజీ కొలువే
* నాస్‌కామ్ నివేదిక
ఈనాడు, హైదరాబాద్: కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో వస్తున్న ఆధునిక యువత భవిష్యత్తులో భారత్‌ను ప్రపంచ ప్రతిభా కేంద్రంగా మారుస్తుందని నాస్‌కామ్ నివేదిక వెల్లడించింది. భవిష్యత్తులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కొలువుల్లో చేరేందుకే జెనరేషన్ జడ్ (1990-2010 మధ్య జన్మించిన వారు) అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొంది. భారతీయ ఐటీ పరిశ్రమ గత ఆర్థిక సంవత్సరంలో 3.80 లక్షల మంది తాజా ఉత్తీర్ణులను నియమించుకుందని డిసెంబరు 16న ఉద్యోగ నియామకాల సంస్థ ఇండీడ్‌తో కలిసి ‘జెన్ జడ్, మిలీనియల్స్: రీషేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ వర్క్‌ఫోర్స్’ పేరిట విడుదల చేసిన నివేదికలో నాస్‌కామ్ తెలిపింది. ప్రస్తుతం ఆసక్తి, గత ఉద్యోగాలు, పని నమూనాలు, సంస్థల ఎంపికలో ప్రాధాన్యం లాంటి అంశాలను తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించారు.
* ఈ నివేదిక ప్రకారం 70 శాతానికి పైగా యువత సమీప భవిష్యత్తులో ఐటీ ఉద్యోగాలు చేపట్టేందుకే ఆసక్తిగా ఉన్నారు. టెక్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా గణనీయ ఉద్యోగాల సృష్టి జరిగిందని, ఇందులో జెన్ జడ్ వాటా 18-20% ఉందని తెలిపింది. 2021-22లో మొత్తం ఉద్యోగుల సంఖ్యలో మిలీనియల్స్ వాటా 68-70% ఉందని పేర్కొంది. ‘కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతీ యువకులు, అదే సంస్థలో రెండేళ్ల కంటే ఎక్కువ సమయం కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నారు. యాజమాన్యాలు వారి ప్రతిభను గుర్తించి, సరైన ప్రోత్సాహకాలు అందించినప్పుడే ఇది సాధ్యమ’ని 79% మంది అభిప్రాయపడ్డారని తెలిపింది.
యువతే అధికం..
2021 నాటికి భారత్‌లో మిలీనియల్స్ (1981-1996 మధ్య పుట్టిన వారు), జెన్ జడ్ వాటా 52 శాతంగా ఉంది. ఇది ప్రపంచ సగటు 47% కంటే అధికం. ఈ ధోరణి 2030 వరకు కొనసాగొచ్చు. అప్పటికీ భారత్ జెన్ జడ్, మిలీనియల్స్ వాటా 50% ఉంటుందని, ప్రపంచ సగటు 46%తో పోలిస్తే ఇది అధికమేనని తెలిపింది.
పేరే ప్రధానం..
మిలీనియల్, జెన్ జడ్ ఆలోచనలు అర్థం చేసుకుని.. సంస్థలు తమ నియామక వ్యూహాలు, ఉద్యోగిని అట్టే పెట్టుకోవడం తదితర అంశాల్లో కొత్త విధానాలు అనుసరించాల్సిన అవసరం ఉందని నాస్‌కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సంగీతా గుప్తా అన్నారు. ‘ఒక సంస్థను ఎంచుకోవడంలో కొత్త తరం పేరును ప్రధానంగా చూస్తున్నప్పటికీ.. సంస్థ పనితీరు, విలువలు, వృద్ధి అవకాశాలనూ పరిశీలిస్తున్నార’ని నివేదిక వెల్లడించింది. ‘ఉద్యోగం- వ్యక్తిగత జీవితం సమతౌల్యంగా ఉండాలని జెన్ జడ్ కోరుకుంటోంది. విభిన్న పని వాతావరణం, కొత్త విషయాలను నేర్చుకునేందుకు అవకాశం ఉండాలని అనుకుంటున్నార’ని ఇండీడ్ సేల్స్ హెడ్ శశి కుమార్ తెలిపారు.
నిపుణులను కాపాడుకోవాలి
నిపుణులను నియమించుకోవడం, వారు తమ దగ్గర నిలిచి ఉండేలా చూసుకోవడం ఐటీ సంస్థలకు ఎంతో కీలకంగా మారిందని ఈ నివేదిక పేర్కొంది. కంపెనీలు తమ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచేందుకు (రీస్కిల్లింగ్) పెట్టుబడులు పెడుతున్నాయి.
* సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, సెజ్‌ల నుంచీ 2021-22లో రూ.11.59 లక్షల కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్ ఎగుమతి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఎస్‌టీపీఐ వాటా రూ.6,28,860 కోట్లు కాగా, సెజ్‌ల వాటా రూ.5,30,350 కోట్లు.
* భారత అంకుర సంస్థలు 2022లో 2,30,000 కొత్త ఉద్యోగాలు సృష్టించాయని ఆర్థిక సేవల ప్లాట్‌ఫామ్ స్ట్రైడ్‌వన్ నివేదిక పేర్కొంది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ వాయుసేనలో పైలెట్ పోస్టు కావాలా?
‣ నాలుగేళ్ల డిగ్రీతో నేరుగా పీహెచ్‌డీ!
‣ ఊహలకు రూపమిస్తూ... ఉత్పత్తులు రూపొందిస్తూ!
‣ పవర్ గ్రిడ్‌లో కొలువు కావాలా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.