• facebook
  • whatsapp
  • telegram

Medical Seats: వైద్యసీట్లలో తెలంగాణకు ఆరో స్థానం

* పీజీ సీట్లలో 7.. సూపర్‌ స్పెషాలిటీలో 10..

* కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడి

 

ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణ‌లో వైద్యవిద్య అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో బోధనాసుపత్రులకు అధిక ప్రాధాన్యమివ్వడంతో.. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో గణనీయంగా సీట్లు పెరిగాయి. జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను కొత్తగా నెలకొల్పడం, ప్రస్తుతమున్న సీట్లను పెంచడంపై సర్కారు దృష్టి పెట్టడంతో అత్యధిక ఎంబీబీఎస్‌ సీట్లున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 6,040 సీట్లతో ఆరో స్థానంలో నిలిచింది. తొలి అయిదు స్థానాల్లో వరుసగా.. తమిళనాడు (10,825), కర్ణాటక (10,745), మహారాష్ట్ర (9,995), ఉత్తర్‌ప్రదేశ్‌ (9,053), గుజరాత్‌ (6,200) రాష్ట్రాలు ఉన్నాయి. 5,485 ఎంబీబీఎస్‌ సీట్లతో ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో నిలిచింది. అతి తక్కువ వైద్యసీట్లున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్రిపుర (225), గోవా (180), చండీగఢ్‌ (150), సిక్కిం (150), దాద్రా నగర్‌ హవేలీ (150), అండమాన్‌ నికోబార్‌ దీవులు (100), మిజోరం (100), మేఘాలయ (50), అరుణాచల్‌ప్రదేశ్‌ (50) ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, పీజీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సీట్ల వివరాలతో కూడిన నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తాజాగా విడుదల చేసింది.

స్పెషాలిటీలో కర్ణాటక.. సూపర్‌ స్పెషాలిటీలో దిల్లీ అగ్రభాగాన..
తెలంగాణ 2,477 పీజీ స్పెషాలిటీ సీట్లతో ఏడో స్థానంలో, 175 సూపర్‌ స్పెషాలిటీ సీట్లతో పదో స్థానంలో నిలిచింది. పీజీ స్పెషాలిటీ సీట్లలో తొలి అయిదు స్థానాల్లో కర్ణాటక (5,523), మహారాష్ట్ర (5,297), తమిళనాడు (4,159), ఉత్తర్‌ప్రదేశ్‌ (3,509), ఆంధ్రప్రదేశ్‌ (2,650) రాష్ట్రాలున్నాయి. సూపర్‌ స్పెషాలిటీ సీట్ల జాబితాలో ముందు వరుసలో దిల్లీ (703), తమిళనాడు (671), ఉత్తరాఖండ్‌ (581), కర్ణాటక (461), మహారాష్ట్ర (380) తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి.. అత్యధిక వైద్య కళాశాలలున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు (71) ముందుండగా.. తర్వాత స్థానాల్లో వరుసగా కర్ణాటక (67), ఉత్తర్‌ప్రదేశ్‌ (67), మహారాష్ట్ర (63), తెలంగాణ (41), గుజరాత్‌ (36) రాష్ట్రాలున్నాయి.

రెండేళ్లలో 34కు పెరగనున్న కళాశాలలు

తెలంగాణ ఏర్పడకముందు ప్రభుత్వ వైద్య కళాశాలలు అయిదు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఆవిర్భవించాక.. తొలి దశలో నాలుగు కళాశాలలు, రెండో దశలో ఈ ఏడాది (2022 - 23) నుంచి మరో ఎనిమిది కళాశాలలను ప్రారంభించారు. వీటి ద్వారా 1,150 ఎంబీబీఎస్‌ సీట్లు విద్యార్థులకు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో గత ఎనిమిదేళ్లలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కు పెరిగింది. వచ్చే ఏడాది మరో 9, ఆ పై ఏడాది మరో 8 వైద్య కళాశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం సంకల్పించడంతో వాటి సంఖ్య 34కు పెరగనుందని వైద్యవర్గాలు తెలిపాయి. తద్వారా ఎంబీబీఎస్‌ సీట్లు కూడా పెరగనున్నాయి. కొత్తగా బోధనాసుపత్రుల ఏర్పాటుతో వాటి ద్వారా అత్యాధునిక రోగ నిర్ధారణ ప్రయోగశాలలు, రక్తశుద్ధి (డయాలసిస్‌)కేంద్రాలు, ఐసీయూలు, క్యాన్సర్‌ నిర్ధారణ, చికిత్స కేంద్రాలు తదితర ప్రత్యేక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో రానున్న రోజుల్లో పీజీ వైద్య సీట్లు వస్తాయి.


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.