* ఈ ఏడాది నుంచే 9 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రారంభం
* అందుబాటులోకి 860 బీఎస్సీ పారామెడికల్ సీట్లు
* ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారిగా వైద్య విద్య అనుబంధ కోర్సులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్సీ అర్హతతో 12 రకాల పారామెడికల్ కోర్సులను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసింది. 2022-23 వైద్య విద్య సంవత్సరం నుంచే గాంధీ, ఉస్మానియా, కాకతీయ, రిమ్స్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తంగా 860 పారామెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ డిసెంబరు 27న ఉత్తర్వులు జారీ చేశారు.
బీఎస్సీ అర్హతతో 12 రకాల కోర్సులు
ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు వైద్య విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం ఏర్పడ్డాక 12 వైద్య కళాశాలలు ప్రారంభించగా మరో రెండేళ్లలో జిల్లాకు ఒకటి చొప్పున మరిన్ని వైద్య కళాశాలలు నెలకొల్పడానికి చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య విద్య అనుబంధ సేవలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్సీ మొదటి ఏడాదిలో 12 వైద్య విద్య అనుబంధ కోర్సులు ప్రారంభించుకోవడానికి సర్కారు అనుమతించింది. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు మూడేళ్ల కోర్సుతో పాటు ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా నాలుగేళ్ల కాల వ్యవధిలో బీఎస్సీ పారామెడికల్ విద్యను పూర్తి చేయాలి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన కోర్సుల్లో.. అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్, రెస్పిరేటరీ థెరపీ, రీనల్ డయాసిస్, న్యూరోసైన్స్, క్రిటికల్ కేర్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, ఆప్తోమెట్రిక్, కార్డియాక్, కార్డియోవాస్క్యులార్ టెక్నాలజీ కోర్సులున్నాయి. తాజా నిర్ణయంతో ప్రతి సంవత్సరం 860 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగవనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. త్వరలో న్యూక్లియర్ మెడిసిన్, రేడియోథెరపీ టెక్నాలజీ కోర్సులను కూడా ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ రెండు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
కొత్తగా మంజూరైన బీఎస్సీ పారామెడికల్ సీట్లు
వైద్య కళాశాల - సీట్లు
గాంధీ - 150
ఉస్మానియా - 210
కాకతీయ - 130
ఆదిలాబాద్ - 60
నిజామాబాద్ - 110
సిద్దిపేట - 50
నల్గొండ - 40
సూర్యాపేట - 40
మహబూబ్‌నగర్ - 70
మొత్తం - 860
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.