వైద్య విద్య, ఆరోగ్యరంగ ప్రమాణాల పెంపుదలకు సహకారం
మంత్రి హరీశ్‌రావుతో అమెరికాలోని భారత ప్రవాస వైద్యులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను దత్తత తీసుకుంటామని, వైద్య విద్య ప్రమాణాల పెంపుదలతో పాటు ఆయా కళాశాలలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని అమెరికాలోని భారతీయ సంతతి వైద్యుల బృందం రాష్ట్ర మంత్రి హరీశ్‌రావుకు తెలిపింది. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యరంగం అభ్యున్నతికి కృషి చేస్తామని, వ్యాధుల నివారణకు సహకరిస్తామని వెల్లడించింది. భారాస ప్రవాస విభాగాల కన్వీనర్ మహేశ్ బిగాల నేతృత్వంలో ‘అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్’ ప్రతినిధులు జనవరి 4న మంత్రి హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. బెజ్జంకి హన్మంతు, కత్తుల సతీష్, మేడవరం మెహర్, రామారావు, లోలాభట్టు రఘు, పున్నం సుజిత్, గంగసాని శ్రీనివాస్, కొర్లకుంట హేమ, కట్కూరి జితేందర్‌రెడ్డి, నేరెళ్ల దామోదర్‌లు ఈ బృందంలో ఉన్నారు. హన్మంతు తదితరులు మాట్లాడుతూ.. ‘‘అమెరికాలో ప్రవాస భారతీయ వైద్యులు 80 వేల మంది ఉన్నారు. ఉస్మానియా, కాకతీయ, గాంధీ ఆసుపత్రులలో చదివిన వారు 20 వేల మంది ఉన్నారు. మేమంతా తెలంగాణ వైద్యరంగం అభివృద్ధిపై ఆసక్తితో ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న జిల్లాకో వైద్యకళాశాల ఏర్పాటు నిర్ణయం చరిత్రాత్మకం. బస్తీ, పల్లె దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్యం మరింత చేరువవుతుంది. ప్రభుత్వ కృషిలో మేమూ భాగస్వాములమవుతాం. వైద్య కళాశాలలను దత్తత తీసుకుంటాం. విద్యార్థులను తీర్చిదిద్దుతాం. వైద్యకళాశాలల్లో అమెరికా స్థాయి వసతుల కల్పనకు అండగా ఉంటాం. విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు నిర్వహిస్తాం. అమెరికాలో అత్యవసర వైద్య పీజీ కోర్సు, ఫ్యామిలీ ప్రాక్టీసు కోర్సులు విజయవంతమయ్యాయి. తెలంగాణలోనూ వీటిని ప్రవేశపెట్టడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి’’ అని తెలిపారు. వీటిపై మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారు. ప్రవాస వైద్యులను స్వాగతిస్తున్నామని తెలిపారు. వారి సేవలను ఉపయోగించుకొని వైద్యరంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మహేశ్ బిగాల సమన్వయ బాధ్యతలు నిర్వహించాలని కోరారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఈ నైపుణ్యాల్లో మీకెంత పట్టు?
‣ ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి!
‣ డిగ్రీతో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు
‣ మెయిన్‌లో విజయానికి మెలకువలు
‣ స్టడీ నోట్స్.. రెడీ రివిజన్!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.