• facebook
  • whatsapp
  • telegram

TS EAMCET: పక్క జిల్లాలకు వెళ్లాల్సిందే

ఎంసెట్‌ రాయాలంటే తిప్పలు తప్పవా
10 రోజుల్లో మూడో వంతు జోన్లలో స్లాట్లు పూర్తి
సీట్ల సామర్థ్యాన్ని పెంచకపోవడమే కారణం

ఈనాడు, హైదరాబాద్‌: సొంత జిల్లాలో ఎంసెట్‌ రాద్దామనుకునే అభ్యర్థుల ఆశ నెరవేరడం కష్టతరం అవుతోంది. వేల మంది అభ్యర్థులు వేరేజిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికే ఏడు ఎంసెట్‌ జోన్లలోని పరీక్షాకేంద్రాల్లో స్లాట్లు పూర్తయ్యాయి.  ఫలితంగా విద్యార్థులు తమకు సమీపంలో ఉన్న ఇతర జిల్లాలను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆన్‌లైన్‌ పరీక్షలకు సంబంధించి అవసరమైన చోట్ల సీట్ల సామర్థ్యాన్ని పెంచకపోవడం వల్ల ఏటా అభ్యర్థులు ఎంతో దూరం వెళ్లి పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఎంసెట్‌కు రాష్ట్రంలో 16 జోన్లను ఏర్పాట్లు చేశారు. ఒక్కో జోన్‌లో కొన్ని పరీక్షాకేంద్రాలుంటాయి. ఈనెల 3న ఎంసెట్‌కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకాగా నాలుగు రోజుల్లో నిజామాబాద్‌ వంటి చోట్ల స్లాట్లు నిండిపోయాయి. బుధవారం నాటికి ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు హైదరాబాద్‌ జోన్‌-4, నిజామాబాద్‌, కరీంనగర్‌, సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ జోన్‌లో స్లాట్ల ఆప్షన్‌ బ్లాక్‌ అయింది. అగ్రికల్చర్‌కు హైదరాబాద్‌ జోన్‌-4, సంగారెడ్డి, కరీంనగర్‌, నల్గొండ, మహబూబ్‌గర్‌లో స్లాట్లు లేవు. ఇప్పటివరకు ఇంజినీరింగ్‌కు 62 వేలు, అగ్రికల్చర్‌కు 35 వేల మందే దరఖాస్తు చేశారు.
ఆలస్యం చేస్తే మరింత దూరం తప్పదు..
ముందుగా దరఖాస్తు చేసే వారు తమకు వీలున్న జోన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఆలస్యం చేసే కొద్దీ స్లాట్లు నిండిపోతాయి. ఫలితంగా వేరే జిల్లాలకు వెళ్లి రాయాల్సి వస్తోంది. గ్రామీణ జిల్లాలకు చెందిన వారు హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతున్నారు. వారు పరీక్షకు ముందు సొంత జిల్లాకు వెళ్లి అక్కడే పరీక్ష రాయాలని భావిస్తుంటారు. అలాంటి వారికి అక్కడ పరీక్ష రాసేందుకు అవకాశం లేకుండా పోతోంది. ఏటా కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో కూకట్‌పల్లి ప్రాంతం నుంచి డిమాండ్‌ అధికంగా ఉన్నా సీట్ల సామర్థ్యాన్ని మాత్రం పెంచడం లేదు. కరీంనగర్‌లో 7,500 సీట్ల సామర్థ్యం ఉన్నా నిండిపోవడం గమనార్హం.
డిమాండ్‌ ఉన్న చోట తక్కువ స్లాట్లు..
హైదరాబాద్‌లో అత్యధిక డిమాండ్‌ ఉన్న జోన్‌-4 (కూకట్‌పల్లి, బాచుపల్లి, షేక్‌పేట, హఫీజ్‌పేట, గండిపేట, మెయినాబాద్‌, హిమయత్‌సాగర్‌)లో ఇంజినీరింగ్‌కు 4 వేలు, అగ్రికల్చర్‌కు 3,200 మందే పరీక్ష రాయడానికి వీలవుతుంది. నిజమాబాద్‌ జోన్‌కు 750, కరీంనగర్‌ జోన్‌కు 7,500, మహబూబ్‌నగర్‌లో 1700, సంగారెడ్డికి వెయ్యి మందే ఇంజినీరింగ్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్‌కు ఇంకా తక్కువ. విద్యార్థులు ఎక్కువ మంది ఉండే ప్రాంతంలో సీట్లు పెంచడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఈసారి మరికొంత పెంచుతాం: ఆచార్య లింబాద్రి, ఛైర్మన్‌, రాష్ట్ర ఉన్నత విద్యామండలి
స్లాట్లు బాక్‌ అయ్యాయని కొందరు నాకు కూడా ఫోన్లు చేశారు. సీట్ల సామర్థ్యాన్ని పెంచాలని రెండు రోజుల క్రితమే టీసీఎస్‌ డిజిటల్‌ అయాన్‌ ప్రతినిధులతో చర్చించా. కంప్యూటర్లు సరిగాలేని కళాశాలలను పరీక్షాకేంద్రాలుగా ఎంపిక చేస్తే సమస్యలు వస్తాయని వారు చెప్పారు. అయినా ఈసారి కొంత పెంచాలని చెప్పాం. త్వరలో కొన్ని జోన్లలో స్లాట్లు పెరుగుతాయి. అప్పుడు మళ్లీ పరీక్ష రాసే జోన్లను మార్చుకోవడానికి అవకాశం ఇస్తాం. సీట్ల సామర్ధ్యం పెంచితే తక్కువ విడతల్లో పరీక్షలు పూర్తి చేయవచ్చన్నది మా ఉద్దేశం.

మరింత సమాచారం... మీ కోసం!

‣ పరిశ్రమల సంరక్షకులు!

‣ వచ్చేస్తున్నాయ్‌... వర్చువల్‌ ల్యాబ్స్‌!

‣ టెన్త్‌ మార్కులతో పోస్టల్‌ ఉద్యోగం!

‣ బీటెక్‌ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!

‣ కోస్ట్‌గార్డ్‌ కొలువు కావాలా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.