• facebook
  • whatsapp
  • telegram

IT Jobs: ఐటీ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయం ఏమిటి?

* కొత్త రంగాలను పరిశీలిస్తున్న నిపుణులు

* ఆహ్వానిస్తున్న పలు సంస్థలు

ఈనాడు - హైదరాబాద్‌: ‘జీవితంలో తొందరగా స్థిరపడాలంటే ఐటీ ఉద్యోగమే’ భేష్‌ అనే ధోరణి చాలామందిలో ఉంది. కొవిడ్‌ పరిణామాల్లో ఐటీ నిపుణులకు ఒక్కసారిగా పెరిగిన గిరాకీ, లభించిన అధిక వేతనాలు ఎంతోమందికి కలల ప్రపంచాన్ని చూపించాయి. తదుపరి కొత్త ప్రాజెక్టుల దూకుడు తగ్గడం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ పరిణామాల వల్ల ద్రవ్యోల్బణం బాగా పెరిగి, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు ‘ఐటీ రంగం’పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ద్రవ్యోల్బణం ఉపశమిస్తున్న దశలో అమెరికా-ఐరోపాల్లో దిగ్గజ బ్యాంకుల వైఫల్యం.. ఐటీ కంపెనీలను ముఖ్యంగా అంకుర సంస్థలను కలవరానికి గురి చేసింది. ఒపెక్‌, ఒపెక్‌ యేతర దేశాలు ముడిచమురు ఉత్పత్తిని మరింత తగ్గించాలని నిర్ణయించడంతో, మళ్లీ పెట్రో ద్రవ్యోల్బణం విజృంభించే అవకాశాలున్నాయి. ఫలితమే ఉద్యోగాల మార్కెట్లో ‘నియామకాల వార్తల కన్నా తొలగింపులేే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, మెటా, అమెజాన్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మొదలు, అంకురాల వరకూ వ్యయ నియంత్రణ పేరిట ‘అధిక వేతనాలు పొందుతున్న నిపుణులను’ తగ్గించుకునే పనిలో పడ్డాయి. దీంతో ఐటీ నిపుణులు ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. ప్రాజెక్టులపై అనిశ్చితి వల్ల  మరో 6 నెలల వరకూ  ఐటీ సంస్థలు నియామకాలపై ఆచితూచి వ్యవహరించేలా ఉన్నాయి. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కొనసాగే కొలువుల గురించి యువత ప్రయత్నిస్తోంది.  

సమీప భవిష్యత్తులో

సిమెంటు, ఉక్కు, మౌలిక వసతులు, ఆరోగ్య సంరక్షణ, రిటైల్‌, టెలికాం, లాజిస్టిక్స్‌ వంటి రంగాల్లో వచ్చే కొన్ని నెలలపాటు అధికంగా ఉద్యోగాలు ఉండే అవకాశం ఉందని నియామక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ రంగాల్లోని అంకురాలూ అధిక సంఖ్యలో నిపుణులను తీసుకుంటాయని పేర్కొంటున్నాయి. ఈ సంస్థల్లో గతంతో పోలిస్తే దాదాపు 10 శాతానికి పైగా నియామకాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

తిరిగి వచ్చే వారికోసం

వ్యక్తిగత/కుటుంబ బాధ్యతల వల్ల కొన్నేళ్లపాటు ఉద్యోగానికి దూరంగా ఉన్న మహిళలనూ సంస్థలు పునర్నియామకం కోసం పిలుస్తున్నాయి. అవసరమైతే వారికి పనివేళలను కుదించడం లాంటి వెసులుబాట్లు ఇస్తామని చెబుతున్నాయని ఒక మానవ వనరుల నియామక సంస్థ తెలిపింది. వారికి కొత్త నైపుణ్యాలు నేర్పించేందుకు ఏర్పాట్లూ చేస్తున్నట్లు వెల్లడించింది.

జీతాలు.. ప్రోత్సాహకాలు కూడా

రానున్న కొన్ని నెలల్లో తయారీ, ఎలక్ట్రానిక్స్‌, జీవ శాస్త్రాలు తదితర రంగాల్లో వేతనాలు పెరిగేందుకు అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. నిపుణుల అవసరం-లభ్యత మధ్య ఉన్న అంతరమే ఇందుకు నేపథ్యం. అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్న వారిని ఆకర్షించేందుకు ఈ రంగాల కంపెనీలూ ముందుకు వచ్చే అవకాశాలున్నాయని నియామక సంస్థల అంచనా. సాధారణంగా ఐటీయేతర సంస్థల్లో ఉద్యోగులకు ప్రోత్సాహకాలు తక్కువగానే ఉంటాయి. బృంద బీమాలాంటి సౌకర్యాలూ ఉండవు. కానీ, ఇప్పుడు ఉద్యోగులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు ఆయా సంస్థలూ ముందుకు వస్తున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.

‘గిగ్‌’ ఉద్యోగాలూ..

డెలివరీ, డ్రైవింగ్‌, కార్యాలయాల్లో పనిచేయడం లాంటి గిగ్‌ వర్కర్ల నియామకాలూ పెరిగాయి. 2029-30 నాటికి 2.4 కోట్ల మంది గిగ్‌ ఉద్యోగులు ఉంటారని నివేదికలు పేర్కొంటున్నాయి. ‘ఉద్యోగాలపై ఆటోమేషన్‌ ప్రభావం ఉంటుంది. కృత్రిమ మేధ కీలకంగా మారుతుంది. అయితే, ఆ ప్రభావం గిగ్‌ వర్కర్లపై పాక్షికంగానే ఉంటుంది’ అని గోల్డ్‌మన్‌ శాక్స్‌ నివేదిక పేర్కొంది.

ఈ రంగాల్లో అవకాశాలు

కొవిడ్‌ పరిణామాల నుంచి కోలుకుని, కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తున్న రంగాల్లో.. సిమెంట్‌, స్టీల్‌, వాహన విడిభాగాలు, పునరుత్పాదక శక్తి, ఆరోగ్య సంరక్షణ వంటివి ముందుంటున్నాయి. టెలికాం, ఆర్థిక సేవలు, ఇ-కామర్స్‌, ఔషధ, ఎఫ్‌ఎంసీజీ, మౌలిక సదుపాయాల వంటి రంగాల్లో ఇటీవల నియామకాలు పెరిగినట్లు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ నివేదిక పేర్కొంది. ఇంజినీరింగ్‌, డిగ్రీ అభ్యసించిన వారికి ఆయా రంగాల కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఐటీ రంగాన్ని వదిలి, తమ ప్రధాన (కోర్‌) రంగంలోనే ఉద్యోగాలు వెతుక్కుంటున్న వారికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించేందుకూ కొన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అవకాశం సులువు.. అధిక మార్కెట్‌ విలువ!

‣ నామ‌మాత్ర ఫీజుతో నాణ్య‌మైన విద్య‌

‣ న్యాయ విద్య క‌ల నెర‌వేరేలా!

‣ ఇగ్నోలో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.