* మే 21, 22 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహణ
* నార్మలైజేషన్ విధానంలో మార్కుల లెక్కింపు
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తొలిసారిగా నార్మలైజేషన్ పద్ధతిలో మార్కులను లెక్కించేలా బహుళ షిఫ్టుల విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీఆర్‌టీ)లను నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) తదితర సంస్థలు అనుసరిస్తున్న విధానాన్నే రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల పరీక్షలన్నీ సీబీఆర్‌టీ విధానంలోనే ఉంటాయంది. ఈ పోస్టుల భర్తీకి జనవరిలోనే రాతపరీక్షలు నిర్వహించినప్పటికీ లీకేజీ వ్యవహారంతో వాటిని కమిషన్ రద్దు చేసింది. మార్చి 29న పునఃపరీక్షల తేదీలను ప్రకటించింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ విభాగం పోస్టులకు మే 8న సీబీఆర్‌టీ విధానంలో, అగ్రికల్చర్, మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టులకు మే9న సీబీఆర్‌టీ విధానంలో, సివిల్ ఇంజినీరింగ్ సబ్జెక్టు పోస్టులకు మే 21న ఓఎంఆర్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామంది. అయితే కొన్ని రోజులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సివిల్ ఇంజినీర్ పోస్టులను కూడా సీబీఆర్‌టీలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పోస్టులకు 44,352 మంది దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో అంతమందికి ఒకే రోజున సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు లేవు. దీంతో అభ్యర్థులకు మే 21, 22న బహుళ షిఫ్టుల విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తొలిసారి
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా బహుళ షిఫ్టు విధానాన్ని అమలు చేయడం ఇదే తొలిసారి. ఏఈఈ సివిల్ పోస్టులకు సీబీఆర్‌టీ విధానంలో మే 21 ఉదయం, మధ్యాహ్నం వేళల్లో కొందరికి.. మే 22న మరికొందరికి పరీక్షలు జరుగుతాయి. ఈ విధానంలోనే భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే నియామక పరీక్షలన్నీ ఉండే అవకాశాలున్నాయి.
మార్కుల లెక్కింపు ఇలా...
సీబీఆర్‌టీ పద్ధతిలో పరీక్షలు నిర్వహించినప్పుడు మార్కులను నార్మలైజేషన్ విధానంలో లెక్కిస్తారు. ఒక్కో షిఫ్టులో జరిగిన పరీక్షల్లో ప్రశ్నల కాఠిన్యత ఒక్కోలా ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నార్మలైజేషన్ ఫార్ములా కింద తుది మార్కులను లెక్కిస్తారు. ఈ విధానంలో అయిదు డెసిమల్స్ వరకు మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. నార్మలైజేషన్‌లో వచ్చిన మార్కులు పరీక్షలో వచ్చిన మార్కులకు వ్యత్యాసం ఉంటుంది. ఈ నార్మలైజేషన్ ఫార్ములాను ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఇతర నియామక సంస్థలు, పోటీ, ప్రవేశ పరీక్షల్లో అమలు చేస్తున్నాయి. ఏదేని అనుకోని సందర్భంలో ఒక సెంటర్‌లో పరీక్ష నిర్వహణకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే అక్కడి అభ్యర్థులకు తదుపరి షిఫ్టులోని అభ్యర్థులతో కలిపి నిర్వహిస్తారు. ఒకవేళ చివరి షిఫ్టులో ఏదేని పరీక్ష కేంద్రంలో ఇబ్బందులు ఎదురైతే వారికి తరువాత పునఃపరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థుల మార్కుల లెక్కింపు విషయంలో నిపుణుల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 18 ఎయిమ్స్ కేంద్రాల్లో 3055 నర్సింగ్ ఆఫీసర్లు
‣ ఆర్కిటెక్చర్ ప్రవేశానికి మార్గం.. నాటా
‣ సమాచార విశ్లేషణకు ‘క్విక్‌సైట్’
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.