* 3, 4, 5 తరగతులకు వర్క్‌షీట్ల పంపిణీ, పరిశీలన
* ‘చదవడాన్ని ఇష్టపడతాం’ కార్యక్రమం
* జూన్ 10 వరకు పలు కార్యక్రమాల అమలుకు ఆదేశాలు

ఈనాడు, అమరావతి: వేసవి సెలవుల్లోనూ ఉపాధ్యాయులకు పనులు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలనిచ్చింది. 3, 4, 5 తరగతులకు వర్క్‌షీట్లు అందించడం, ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’, జగనన్న విద్యా కానుక కిట్ల సరఫరా, పీఎం శ్రీ పాఠశాలల కాస్టింగ్ షీట్ రూపకల్పన, ‘నాడు-నేడు’ పనులు, పిల్లలు గ్రంథాలయాలకు వెళ్లేలా చూడడం, విద్యార్థుల ప్రవేశాల నిర్వహణలాంటి పనులను అప్పగించింది. సెలవులు విద్యార్థులకేగాని ఉపాధ్యాయులకు కాదంటూ కొందరు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మే 1నుంచి పాఠశాలలకు ఇచ్చే సెలవుల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులపై ఉన్నతాధికారులు ఆదేశాలనిచ్చారు. ఉపాధ్యాయులు బడికి రావాలా? వద్దా? అనే దానిపై స్పష్టత ఇవ్వకుండానే అనేక పనులు అప్పగించారు. దీనిపై ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. ‘నాడు-నేడు’ పనులు, పదో తరగతి ఫలితాల తర్వాత టీసీల జారీ, ఇతరత్రా కార్యకలాపాల కోసం ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు బడులకు రావాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు సెలవు పెడితే ఆ సమయంలో మరో ఉపాధ్యాయుడిని నియమించాలని ఆదేశించారు. వేసవి సెలవుల్లో ప్రతి పాఠశాలలో 23 రకాల కార్యకలాపాలను నిర్వర్తించాల్సి ఉంటుంది. 3,4,5 తరగతులకు వర్క్‌షీట్లను ఇవ్వాలని ఆదేశించిన అధికారులు ముద్రించిన వాటిని మాత్రం సమకూర్చలేదు. వాటిని జిరాక్స్ తీసేందుకు ఉపాధ్యాయులు సొంత డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అన్నీ చేయాల్సిందే..
‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ కార్యక్రమాన్ని మే 1 నుంచి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించాలి. పాఠశాలలోని విద్యార్థులను బృందాలుగా విభజించి ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలి. వాట్సప్ గ్రూపు ఏర్పాటుచేసి రోజువారీగా కథలను అందులో పోస్టు చేయాలి. ఆ కథలు చదివాక విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలి. విద్యార్థుల చదివే సామర్థ్యం ఆధారంగా పాఠశాల గ్రంథాలయంలోని పుస్తకాలను ఒక్కొక్కరికి ఐదు నుంచి పది ఇవ్వాలి. ఇచ్చిన పుస్తకాలను విద్యార్థి చదివేస్తే స్నేహితుల వద్దనున్న పుస్తకాలతో మార్చుకునేలా చూడాలి. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రజా గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలను తెచ్చుకునేలా పిల్లలకు అవగాహన కల్పించాలి. ఈ పనులను రికార్డు చేయాలి. అధికారులు ఎప్పుడైనా పరిశీలిస్తే చూపించాల్సి ఉంటుంది. విద్యార్థుల ప్రవేశాలపైనా దృష్టి పెట్టాలి. ఐదో తరగతి పూర్తయిన వారు ప్రభుత్వ బడుల్లో ఆరో తరగతిలో ప్రవేశించేలా చూడాలి. కింది తరగతుల్లోనూ విద్యార్థుల ప్రవేశాలపై దృష్టి పెట్టాలి. పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలి. పిల్లవాడి బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలి. వారే తల్లిదండ్రుల్లా వ్యవహరించాలని సూచించారు. పిల్లలు సైతం వేసవి సెలవుల్లో తామేం చేశామో నోట్‌బుక్‌లో రాసి తరగతి ఉపాధ్యాయుడికి ఇవ్వాలి. దీన్ని కచ్చితంగా అమలు చేయాలి. జగనన్న విద్యాకానుక కిట్లను వారు తీసుకెళ్లాలి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 4,006 టీజీటీ పోస్టులకు సమగ్ర ప్రకటన
‣ ఎస్‌ఎస్‌సీ రాత పరీక్ష తేదీలు ఖరారు
‣ ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష తేదీల వెల్లడి
‣ ఎయిర్ ఇండియాలో 1000కి పైగా పైలట్ల నియామకాలు
‣ ఏపీపీఎస్‌సీ గ్రూపు-1, 2 అభ్యర్థులకు ప్రతిభాన్వేషణ పరీక్ష
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.