న్యూస్‌టుడే, బోధన్ పట్టణం: కామారెడ్డికి చెందిన ఓ యువకుడికి టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ నియామకానికి ధ్రువపత్రాల పరిశీలన జాబితాలో పేరొచ్చింది. నూతన జిల్లా కుల ధ్రువీకరణ పత్రం అవసరమని తెలిసి దరఖాస్తు చేశారు. తెల్లారితే పరిశీలనకు హాజరు కావాలి. సరిగ్గా అదే రోజు తహసీల్దార్ కోర్టు పని మీద హైదరాబాద్ వెళ్లడంతో యువకుడు హైరానా పడ్డారు.
* ప్రవేశాలు.. ఉద్యోగ నియామక ప్రక్రియకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అందుకు ఆయా సంస్థలు కనీసం పక్షం రోజుల ముందుగానే తేదీలు ప్రకటించి ఏమేమి అవసరమో చెబుతున్నా.. మెజారిటీ విద్యార్థులు, ఉద్యోగార్థులు ముందుగా తీసుకోకుండా చివరి నిమిషంలో ఆరాటపడుతుంటారు. అదే సమయంలో కార్యాలయాల్లో మానవ, సాంకేతిక కారణాలతో అవాంతరాలు ఎదురైతే ఆందోళన చెందుతారు. కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యమూ జాప్యానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో సమయమున్నప్పుడే సరి చూసుకోవాలి. 2023-24 విద్యా సంవత్సర ప్రవేశ పరీక్షల సీజన్ నడుస్తోంది. పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి ప్రక్రియ ధ్రువపత్రాల పరిశీలనే. ఈ నేపథ్యంలో అవసరమైన పత్రాలు ముందుగానే పొందాలి.
కావాల్సినవి ఇవే..
* రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కుల, ఆదాయ, లోకల్ క్యాండిడేట్, నాన్ క్రిమిలేయర్, డిస్టెన్స్ వంటివి ఉన్నాయా.. లేదా చూసుకోవాలి.
* కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వంటి ధ్రువపత్రాలు అవసరం.
* కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, మండలాల వారీగా తీసుకోవాలి.
* ఆదాయ ధ్రువపత్రాలకు ఒక ఏడాదే కాలపరిమితి ఉంటుంది. ఏటా తీసుకోవాల్సిందే. తాజాగా 2023 ఏప్రిల్ తర్వాత జారీ చేసినవి మాత్రమే చెల్లుబాటవుతాయి.
* డిస్టెన్స్ ధ్రువపత్రాలు ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి పొందాలి.
* కుల ధ్రువీకరణ పత్రంలో పుట్టిన తేదీ కావాలంటే దరఖాస్తుకు జనన ధ్రువీకరణ ఆధారాలు జత చేయాలి.
* ఆధార్ కార్డులో చిరునామా తమ పరిధిలోనిది కానప్పుడు స్థానిక తహసీల్దార్లు దరఖాస్తు తిరస్కరిస్తారు. ఆధార్.. దరఖాస్తు చిరునామాలు వేర్వేరుగా ఉంటే అధికారులను కలిసి సమస్య వివరించాలి. ప్రత్యామ్నాయ మార్గాలు తెలుసుకోవాలి.
* ఆదాయానికి పట్టణ లబ్ధిదారులైతే రూ.2 లక్షలు, గ్రామీణులకు రూ.1.50 లక్షల ఆదాయం ఉండాలి.
* నాన్ క్రిమిలేయర్‌కు బీసీ ఏ, బీ, సీ, డీ, ఈ గ్రూపులకు చెందిన వారు రూ.8 లక్షలలోపు ఆదాయం ఉండాలి.
* మీసేవలో ఆన్‌లైన్‌లో చేసే ఏ దరఖాస్తుకైనా గతంలో తీసుకున్న పాత ధ్రువపత్రాలు, లేదా కుటుంబ సభ్యులవి జత చేస్తే విచారణ త్వరితగతిన పూర్తయ్యే ఆస్కారముంటుంది.
* చదివిన పాఠశాలల నుంచి తీసుకునే ధ్రువపత్రాలనూ సరి చూసుకోవాలి. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ, గురుకుల ఉద్యోగాలకు స్థానికత కోసం బడి విద్య వివరాలు అడుగుతున్నారు.
వేగంగా జారీ..: వరప్రసాద్, బోధన్ తహసీల్దార్
విద్య, ఉద్యోగపరంగా అవసరమైన ధ్రువపత్రాలను నిర్ణీత గడువులోగా పొందాలి. దరఖాస్తుతో సంబంధిత ఆధార పత్రాలు జత చేస్తే వేగంగా పత్రాలు జారీ చేస్తాం.
మరింత సమాచారం... మీ కోసం!
‣ అందుబాటులోకి ఏపీ ఈఏపీసెట్ హాల్‌టికెట్లు
‣ తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
‣ ఆస్తులు పోయి.. అప్పులు మిగిలి!
‣ రాజకీయ పొత్తులు రాజీనామాల ఎత్తులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.