ఐటీఐ కోర్సుతో అవకాశాలెన్నో..
ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ షురూ
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్, సిద్దిపేట, మెదక్ అర్బన్, వికారాబాద్ టౌన్: ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 35 ఐటీఐలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ఐటీఐలు ఏడు వరకు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి, సిద్దిపేటలో మూడు చొప్పున ఉండగా మెదక్‌లో ఒకటి మాత్రమే ఉండటం గమనార్హం. ఆయా కళాశాలల్లో ఈ సంవత్సరం ప్రవేశాలకు 6,072 సీట్లు కేటాయించారు. వికారాబాద్‌లో రెండు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలు ఉండగా ప్రైవేటుది ఒకటి మాత్రమే ఉంది.
‣ ప్రస్తుతం ఎన్నో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని అందిపుచ్చుకుంటే ఉపాధి దిశగా అడుగేయవచ్చు. ఐటీఐ కోర్సు ఈ కోవలోకే వస్తుంది. పారిశ్రామిక రంగం అభివృద్ధి దిశగా సాగుతుండటంతో అవసరాలకు అనుగుణంగా విద్యారుల్థలను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకు ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లను ఏర్పాటు చేసింది. ఐటీఐ కోర్సు పూర్తిచేయగానే అప్రెంటీస్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తవగానే ప్రతిభతో ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చు. ప్రస్తుతం ఆయా సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.
అప్రెంటీస్ తప్పనిసరి..
పేద, మద్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్నారు. ఇలాంటి వారికి ఐటీఐ కోర్సుతో తక్షణ ఉపాధికి బాటలు పడుతున్నాయి. ఈ కోర్సు పూర్తిచేయగానే అప్రెంటీస్ పూర్తిచేయడం తప్పనిసరి. గతంలో ఒప్పంద పద్ధతిలో ఉండగా, ఇప్పుడు పరిశ్రమల యాజమాన్యాలు నేరుగా అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో రూ.వేలల్లో వేతనాలు అందే అవకాశం లభిస్తోంది. డిగ్రీలు, పీజీలు పూర్తిచేసిన వారంతా ఉద్యోగాలకు ఎదురుచూస్తుండగా ఐటీఐ పూర్తిచేసిన వారికి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
పరిశ్రమల అవసరాలకు..
ఉమ్మడి జిల్లాలో పటాన్‌చెరు, జిన్నారం, హత్నూర, సదాశివపేట, మల్లేపల్లి, మనోహరాబాద్, చేగుంట ప్రాంతాల్లో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. నంగునూరు, గజ్వేల్, వర్గల్ తదితర చోట్ల కర్మాగారాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. మరోవైపు వికారాబాద్ జిల్లాలోనూ పరిశ్రమల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో నిపుణులకు డిమాండ్ బాగా పెరిగింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సు అమలు చేస్తుండగా దీన్ని పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
పాలిటెక్నిక్‌లోనూ..
ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ చేయడానికి అవకాశం కల్పించారు. ఇందుకు ప్రత్యేకంగా ఎల్‌పీ సెట్ నిర్వహిస్తారు. ప్రతిభ చాటిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. తద్వారా నచ్చిన డిప్లోమా కోర్సు పూర్తిచేసి ఉజ్వల భవితకు బాటలు వేసుకునేందుకు వీలుంటుంది. ఉన్నత విద్య వైపు అడుగేయవచ్చు.
దరఖాస్తు సమయమిదే..
ఐటీఐల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటికే ప్రకటన విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 10 వరకు గœడువు ఉంది. వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమకు నచ్చిన కోర్సు, కళాశాలను విద్యార్థులు ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. పదోతరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆదారంగా సీట్లు కేటాయిస్తారు. సంప్రదించాల్సిన వెబ్‌సైట్: http:///iti.telangana. gov.in.
సాంకేతిక పరిజ్ఞానంపై..: శ్రీనివాస్‌రావు, ఐటీఐ ప్రవేశాల సంగారెడ్డి జిల్లా సమన్వయకర్త
ఐటీఐలో ప్రవేశాలకు నిర్ణీత గడువులోగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నాం. ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాం.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.