• facebook
  • whatsapp
  • telegram

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థులు టాప్‌

* విశాఖ విద్యార్థి అనిరుధ్‌కు ఇంజినీరింగ్‌లో, తూ.గో. విద్యార్థి జస్వంత్‌కు అగ్రిలో అగ్రస్థానం  

* ఇంజినీరింగ్‌లో 80.33%.. అగ్రికల్చర్‌లో 86.31% ఉత్తీర్ణత

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫలితాల్లో ఇంజినీరింగ్‌లో మొదటి పది ర్యాంకుల్లో 8, అగ్రికల్చర్‌, ఫార్మసీలో మొదటి పదిలో 7 ర్యాంకుల్ని ఏపీ విద్యార్థులు దక్కించుకుని విజయకేతనం ఎరగవేశారు. అగ్రికల్చర్‌లో 155 స్కోర్‌తో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్యరాజ జస్వంత్‌, ఇంజినీరింగ్‌లో 158.89 స్కోర్‌తో విశాఖ విద్యార్థి సనపల అనిరుధ్‌ ప్రథమ ర్యాంకులు సాధించారు. ఈ ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు. తొలి పది ర్యాంకుల్లో అత్యధికం అబ్బాయిలు దక్కించుకోగా.. ఉత్తీర్ణత శాతంలో మాత్రం అమ్మాయిలదే పైచేయిగా ఉంది. ఇంజినీరింగ్‌లో దాదాపు 3 శాతం, అగ్రికల్చర్‌లో సుమారు 2.50 శాతం ఎక్కువగా అమ్మాయిల ఉత్తీర్ణత ఉండటం విశేషం. మొత్తం పరీక్ష రాసిన వారిలో ఇంజినీరింగ్‌ విభాగంలో 80.33%, అగ్రికల్చర్‌లో 86.31% మంది కనీస మార్కులు సాధించి కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. మొత్తం 160 మార్కుల పరీక్షలో 40 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీస మార్కుల నిబంధన వర్తించదు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణకు రెండు మూడు రోజుల్లో కాలపట్టిక జారీచేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు.

* ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షను మే 14న రాసిన విద్యార్థులకు 3 చొప్పున మార్కులు కలిపారు.

     

     

కలలు గన్నారు.. సత్తా చాటారు
న్యూస్‌టుడే బృందం: తెలంగాణ ఎంసెట్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌-మెడికల్‌ విభాగాల్లో మొదటి ర్యాంకులు సాధించారు. అగ్రికల్చర్‌ విభాగంలో పదిలోపు ర్యాంకుల్లో మన రాష్ట్ర విద్యార్థులు ఏడుగురుఉన్నారు. టాపర్ల అభిప్రాయాలివీ..  

     

ఐఐటీ సీటే లక్ష్యంగా..

     

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రాణించి ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం అంటున్న అనిరుధ్‌ తండ్రి ఖగేశ్వరరావు విశాఖపట్నం నాల్గో పట్టణ ఠాణాలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. తల్లి జాన్సీ గృహిణి. ప్రత్యేక శిక్షణ లేకుండా.. విజయవాడలో ఇంటర్‌ చేస్తూనే ఉత్తమ ర్యాంకు సాధించినట్లు అనిరుధ్‌ ఆనందం వ్యక్తం చేశారు.    - సనపల అనిరుధ్‌, 1వ ర్యాంకు, విశాఖపట్నం

     

రోజూ 12 గంటలు చదివా..

రోజుకు 12 గంటలు చదివా. ఫలితంగా జేఈఈ మెయిన్స్‌లోనూ 79వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఐఐటీ ముంబయిలో సీఎస్‌ సీటు సాధించడమే లక్ష్యం. అమ్మానాన్న అనురాధ, శ్రీనివాసరెడ్డి నిత్యం ప్రోత్సహిస్తుంటారు.   -  యక్కంటి ఫణి వెంకట మణీందర్‌రెడ్డి, 2వ ర్యాంకు, గుంటూరు, గౌతమినగర్‌

     

కంప్యూటర్‌ సైన్స్‌ చేస్తా..

రోజుకు 10 నుంచి 13 గంటల వరకు శ్రమించా. జేఈఈ మెయిన్స్‌ శిక్షణ కలిసొచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రాణించి ఐఐటీ ముంబయిలో కంప్యూటర్‌ సైన్స్‌ సీటు సాధించడమే లక్ష్యం.  - చల్లా ఉమేష్‌ వరుణ్‌, 3వ ర్యాంకు, నందిగామ

     

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతూ..



 

ఐఐటీ ముంబయిలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలని ఉంది. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. అమ్మానాన్నలు అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి చదువులో ప్రోత్సహిస్తుంటారు.  - పి.ప్రమోద్‌కుమార్‌రెడ్డి, 5వ ర్యాంకు, తాడిపత్రి, గాజుల కిష్టప్ప వీధి

     

ఐఐటీ చదవడమే లక్ష్యం

ఐఐటీ చేయాలనే లక్ష్యంగా చదువుతున్నా. ఇంటర్‌లో 982 మార్కులు తెచ్చుకున్నా. నాన్న వ్యాపారం చేస్తుంటారు. అమ్మ గృహిణి.  - సంజన, ఇంజినీరింగ్‌లో 8వ ర్యాంకు, శ్రీకాకుళం

అగ్రికల్చర్‌, మెడికల్‌ టాపర్లు

సొంతంగా నోట్సు తయారు చేసుకున్నా..

నాన్న సాయిరామకృష్ణ రైతు. అమ్మ రజని గృహిణి. రోజుకు 13 గంటలు చదివా. ముఖ్యమైన అంశాలతో నోట్సు తయారు చేసుకున్నా. దాన్నే చదవడం వల్ల మొదటి ర్యాంకు వచ్చింది.  - సత్యరాజ జశ్వంత్‌, 1వ ర్యాంకు, కాతేరు, తూ.గో. జిల్లా

అమ్మానాన్నల కష్టమే స్ఫూర్తి

చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలనే లక్ష్యంతో చదువుతున్నా. రోజుకు 8 గంటలు ఎంసెట్‌ కోసం సాధన చేశా. ఇంటర్‌ సిలబస్‌తో పాటే ఎంసెట్‌కూ సిద్ధమయ్యా. అమ్మానాన్న శ్రీదేవి, సుధాకరబాబు మగ్గం నేసి నన్ను చదివిస్తున్నారు.  -  నాసిక వెంకట తేజ, 2వ ర్యాంకు, బాపట్ల జిల్లా

నాన్న కల నెరవేర్చుతా...

నేను డాక్టర్‌ కావాలన్నది నాన్న కల. అందుకే చిన్నతనం నుంచి చదువులో ముందుండే వాడిని. నీట్‌లో మంచి ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌ చేసి, కార్డియాలజీ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజీలో నిపుణుడిగా సేవలు అందించాలని ఉంది.  - డి.కార్తికేయరెడ్డి, 4వ ర్యాంకు, తెనాలి

పేదలకు వైద్యం చేస్తా..

నీట్‌లో మంచి ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌ చేస్తా. గ్రామాల్లో పేదలకు వైద్యం అందించడమే లక్ష్యం. విజయవాడలో ఇంటర్‌ పూర్తి చేసి 987 మార్కులు సాధించా. తల్లిదండ్రులు రాజేంద్రనాయుడు, రాజ్యలక్ష్మి టీచర్లు.  - వరుణ్‌ చక్రవర్తి, 5వ ర్యాంకు, పోలాకి తోటాడ

వైద్య రంగంలో స్థిరపడతా..

మా తల్లిదండ్రులు రాధాకృష్ణ గౌరీ శంకర్‌, హరిత వైద్యులు. వారి ప్రోత్సాహంతో వైద్య రంగంలో స్థిరపడాలనేది లక్ష్యం.

- హర్షిల్‌సాయి, 7వ ర్యాంకు, నెల్లూరు, వంగిపురం

డాక్టర్‌ అవ్వడమే లక్ష్యం

ఏపీ ఎంసెటకు రోజుకు 10 నుంచి 12 గంటలు కష్టపడ్డా. అది ఉపయోగపడింది. మాది గుంటూరు ఏటీ అగ్రహారం నాల్గో లేన్‌. మంచి డాక్టర్‌నవుతా.  - దద్దణాల సాయి చిద్విలాస్‌ రెడ్డి,  8వ ర్యాంకు, గుంటూరు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.