* విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమాచారం
* ప్రత్యామ్నాయాలు ప్రకటించిన గురునానక్ వర్సిటీ
ఈనాడు, హైదరాబాద్: ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును గవర్నరు ఆమోదించకపోవడం, ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించకపోవడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో గురునానక్ వర్సిటీ మూడు ప్రత్యామ్నాయాలను ప్రకటించింది. చివరికి సీట్లు రద్దు చేసుకోవాలనుకునే విద్యార్థులకు నిబంధనల ప్రకారం ఫీజు, ధ్రువపత్రాలను తిరిగి ఇస్తామని గురువారం పేర్కొంది. ఈ మేరకు గురునానక్ విశ్వవిద్యాలయ వర్గాలు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కూడిన వాట్సప్ గ్రూపులో సమాచారాన్ని పంపాయి. మీడియాకు మాత్రం ఈ విషయాన్ని వెల్లడించలేదు. గురునానక్ ప్రైవేట్ వర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరానికి గాను దాదాపు 4 వేల మంది ప్రవేశాలు పొందారు. అయిదు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర అసెంబ్లీ.. ఆ బిల్లును ఆమోదం కోసం గవర్నర్ తమిళిసైకి పంపించింది. అప్పటి నుంచి అది పెండింగులోనే ఉంది. ఇది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనకు కారణమైంది. వీటిని ఏర్పాటు చేయాలంటూ విద్యార్థి, ప్రజాసంఘాలు సైతం ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే వర్సిటీ వర్గాలు తాజా ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, విద్యార్థులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సూచించింది. ఈ విషయమై వర్సిటీ అధికారి ఒకరిని వివరణ కోరగా.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు స్పష్టత ఇచ్చేందుకు తమ యాజమాన్యమే వాట్సప్ గ్రూపులో సమాచారం పంపిందన్నారు.
ప్రకటించిన 3 ప్రత్యామ్నాయాలు
1. తమ విశ్వవిద్యాలయంతోపాటు ఇతర వర్సిటీల అనుమతుల దస్త్రం సర్క్యులేషన్‌లో ఉంది. పది రోజుల్లో సానుకూల నిర్ణయం వెలువడుతుంది. విద్యార్థులు ఓపికగా ఉండి కోర్సును కొనసాగించవచ్చు.
2. ప్లాన్-బి ప్రకారం తదుపరి చదువు కొనసాగించాలన్న ఆసక్తి ఉన్న విద్యార్థుల వివరాలను తాము ఒప్పందం కలిగి ఉన్న హైదరాబాద్‌లోని ఇతర విశ్వవిద్యాలయాలకు బదిలీ చేస్తాం.
3. మొదటి, రెండు ప్రత్యామ్నాయాలపై ఆసక్తి లేక, తమ సీటును రద్దు చేసుకోవాలనుకునే విద్యార్థులు ప్రవేశాల విభాగానికి విన్నవించుకోవచ్చు. వారు చెల్లించిన ఫీజును, ధ్రువపత్రాలను తిరిగి ఇస్తాం.
మరింత సమాచారం... మీ కోసం!
‣ తెలంగాణ పాలీసెట్ -2023 ఫలితాలు
‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్‌లో ఉద్యోగాల భర్తీ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.