• facebook
  • whatsapp
  • telegram

Private Schools: ఫీజులుం!

ప్రైవేటు పాఠశాలలతీరుపై తల్లిదండ్రుల ఆవేదన
ఆన్‌లైన్‌ అనుసంధానంతోనైనా పరిస్థితి మారేనా!

హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ స్కూళ్లకు ఏ మాత్రం తగ్గని విధంగా కరీంనగర్‌లోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు ‘లక్ష’ణంగా ఫీజు  అధిక మొత్తంగా వసూలు చేస్తున్నాయి. మౌలిక వసతులు అంతంతే ఉన్నా ఫీజుల్లో మాత్రం తగ్గడం లేదు.
ప్రత్యేక నైపుణ్యాల శిక్షణ పేరిట అదనపు రుసుములు వసూలు చేస్తున్నారు. క్రీడలు, ఇతర వృత్తి విద్యావికాసం ముసుగులో వేలాది రూపాయలను ఎంచక్కా అడిగేస్తున్నారు. దీన్ని యాక్టివిటీ ఫీజు కింద లెక్కేస్తున్నారు. ప్రవేశ రుసుముల పేరిట ప్రతి విద్యా సంవత్సరంలో కొత్త మోతను విద్యార్థుల నెత్తిన రుద్దుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వీటిని అమలు చేస్తున్నారు.
విడతల వారీగా చెల్లించాల్సిన ఫీజులో ఏ మాత్రం ఆలస్యం జరిగినా యూనిట్‌ పరీక్షల సమయంలోనూ తోటి విద్యార్థుల ముందే ప్రస్తావిస్తున్నారు. నాణ్యమైన విద్య రూపంలో ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలనే ఆరాటంతో చిరు ఉద్యోగులు, ఆదాయం తక్కువున్న వారు పిల్లల్ని చేర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడైనా ఫీజు చెల్లింపు ఆలస్యమైతే చిన్నారులను అందరి ముందు ఫీజులు అడగడం పసి మనసులపై ప్రభావం చూపుతోంది.
ఈనాడు, కరీంనగర్‌: సామాన్య, మధ్య తరగతి వర్గాల పిల్లలకు ప్రైవేటు బడుల్లో చదువు మరింత ఖరీదవుతోంది. సర్కారు బడులను కాదని అక్కడ చేర్పించే పిల్లలకు చెల్లించే ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ఏ ఏటికాయేడు పెరుగుతున్న రుసుములతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 817 ప్రైవేటు బడుల్లో 2.12 లక్షల మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఏటా 10 శాతానికి మించి ఫీజును పెంచరాదని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కానీ చాలా విద్యాలయాల్లో ఆ విషయమే పట్టించుకోవడం లేదు. గతంలో ఫీజుల నియంత్రణపై ధర్మాసనాల ఆదేశాలను నాలుగు జిల్లాల పరిధిలో పట్టించుకున్న దాఖలాలు లేవు.
పర్యవేక్షణ పెంచితే మేలు: ఎప్పటికప్పుడు ప్రైవేటు విద్యాలయాల స్థితిగతుల పర్యవేక్షణ విషయంలో నిర్లక్ష్యమే నాలుగు జిల్లాల పరిధిలో కనిపిస్తోంది. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అడపాదడపా అందుతున్నా అధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలు ఉండటం లేదు. దీంతో కొన్ని బడులు తమ పంథా వేరనే విధంగా వేలాది రూపాయలను ప్రతి విద్యా సంవత్సరంలో పెంచుకుంటూ పోతున్నాయి. ఏటా 10 శాతం నిబంధన ఎక్కడా అమలవకపోగా.. 15 నుంచి 20 శాతం పెంచిన వాటి సంఖ్య ఎక్కువగానే ఉంటుండటం గమనార్హం. మౌలిక వసతులు సహా ఇతర సౌకర్యాలు సరిగ్గా లేని బడుల్లోనే అర లక్ష వరకు వసూలు చేస్తున్నారు. భవనాల హంగులు ఇతర ఆర్భాటాలను చూపిస్తున్న వాటి చెంతన ట్యూషన్‌ ఫీజు, ఇతర ఫీజులు కలిపి లక్ష రూపాయలకుపైగా రుసుమును ఒక్కో విద్యార్థి నుంచి వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం విద్యాశాఖ ఈ ఫీజుల విషయంలో ఆన్‌లైన్‌లో అనుసంధానించాలనే ప్రతిపాదన ఆచరణకు నోచుకుంటే చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులకు మేలు జరుగనుంది. అందే విద్యకు తీసుకుంటున్న డబ్బులకు పొంతన కుదిరే వీలుంటుంది. ఈ దిశగా త్వరితగతిన చర్యలు కనిపించాలనే ఆరాటం తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది.

మరింత సమాచారం... మీ కోసం!

ఏపీపీఎస్సీ 3,295 పోస్టుల భర్తీకి ఆమోదం

ఆర్‌సీఎఫ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

దినసరి కూలీ.. డాక్టరేట్‌ సాధించింది

ఓఎన్‌జీసీ-40 అప్రెంటిస్‌షిప్‌ ఖాళీలు  

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.