* ఏప్రిల్ 1 నుంచి చివరి విడత పరీక్షలు
* మే 5న నీట్
* పలు పరీక్షల కాలపట్టికను విడుదల చేసిన ఎన్టీఏ
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు ప్రతిష్ఠాత్మక జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల తేదీలను జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) సెప్టెంబరు 19న ప్రకటించింది. జేఈఈ మెయిన్ రెండు విడతలతోపాటు నీట్, సీయూఈటీ యూజీ, పీజీ, యూజీసీ నెట్ తేదీలను వెల్లడించింది. వీటిలో నీట్ తప్ప మిగిలిన పరీక్షలన్నీ ఆన్లైన్ విధానం(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో జరుగుతాయి. జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్ తొలి విడత వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహిస్తారు. రెండో విడతను ఏప్రిల్ 1 - 15 తేదీల మధ్య జరుపుతారు. ఆన్లైన్ పరీక్షల ఫలితాలను పరీక్షలు ముగిసిన మూడు వారాల్లోపు ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు వచ్చే ఏడాది మే 5న నిర్వహించే నీట్ యూజీ-2024 ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ‘జాతీయ పరీక్షల తేదీల వెల్లడితో కొంతవరకు స్పష్టత వచ్చింది. ఇక రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల తేదీలు వస్తే ఎంసెట్ తదితర పరీక్షల తేదీలను వెల్లడిస్తాం’ అని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు.
కేంద్రీయ వర్సిటీల్లో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సీయూఈటీ పీజీ పరీక్షను మార్చి 11 - 28 తేదీల మధ్య, యూజీ సీట్ల భర్తీకి జరిపే సీయూఈటీ యూజీని మే 15 - 31 తేదీల మధ్య నిర్వహించనున్నారు. పీహెచ్‌డీలో ప్రవేశానికి, జేఆర్ఎఫ్ కోసం నిర్వహించే యూజీసీ నెట్‌ను జూన్ 10-21 తేదీల మధ్య నిర్వహిస్తారు.
జేఈఈ మెయిన్ ఎందుకంటే..?
దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో బీటెక్‌లో చేరాలంటే మెయిన్‌లో ఉత్తీర్ణులై అడ్వాన్స్డ్ రాయాల్సి ఉంటుంది.
ముఖ్యాంశాలు ఇవీ..
* జేఈఈ మెయిన్‌లో మొదటి రోజు బీఆర్క్, బీ ప్లానింగ్‌లో ప్రవేశించేందుకు పేపర్-2, మిగిలిన రోజుల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 పరీక్ష జరుపుతారు.
* పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. పేపర్-1 300, పేపర్-2 400 మార్కులకు ఉంటుంది.
* దరఖాస్తులు పూర్తిచేసే సమయంలో మొబైల్ నంబరు, ఈ-మెయిల్ చిరునామాను విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులకు సంబంధించినది ఇవ్వాలి. ఏదైనా సమాచారం ఉంటే ఆ నంబరుకు పంపుతామని ఎన్టీఏ తెలిపింది.
* ఏపీలో 26, తెలంగాణలో 16 నగరాలు/పట్టణాల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగుతాయి.
జేఈఈ మెయిన్ స్టడీమెటీరియల్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.