• facebook
  • whatsapp
  • telegram

Abroad Education: అమెరికాకు వెళ్లిన విద్యార్థుల్లో 26% భారతీయులే  

* 2022-23లో రికార్డు స్థాయిలో 2.68 లక్షల మంది పయనం

దిల్లీ: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 2022-23 విద్యా సంవత్సరంలో 35 శాతానికి పైగా పెరిగింది. మునుపెన్నడూ లేని రీతిలో 2,68,923 మంది విద్యార్థులు మన దేశం నుంచి అమెరికాకు వెళ్లారని, అన్ని దేశాల నుంచి వచ్చిన రమారమి 10 లక్షల మందిలో మనవాళ్లే 26 శాతం ఉన్నారని ‘ఓపెన్‌ డోర్స్‌ నివేదిక’ వెల్లడించింది. కరోనా మహమ్మారి మునుపటి స్థితికి విదేశీ విద్యార్థుల తాకిడి చేరుకున్నట్లు తెలిపింది. 22-23 విద్యా సంవత్సరానికి అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 12శాతం పెరిగింది. గత 40 ఏళ్లలో ఇదే గరిష్ఠం. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో చైనాది అగ్రస్థానం. 22-23లో ఆ దేశం నుంచి 2.90 లక్షల మంది వెళ్లారు. తర్వాత స్థానం భారత్‌ది. ఈ రెండు దేశాల నుంచే 53 శాతం మంది ఉంటున్నారు. అంతర్జాతీయంగా గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల్లో 2009-10 తర్వాత తొలిసారిగా చైనాను భారత్‌ అధిగమించిందని నివేదిక తెలిపింది. భారతీయ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు 63% పెరిగి 1,65,936కి చేరుకున్నారు. భారత్‌ నుంచి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. చైనా నుంచి గత మూడేళ్లుగా కొంత తగ్గుతోంది. ఈ రెండింటి తర్వాత దక్షిణ కొరియా, కెనడా, వియత్నాం, తైవాన్‌, నైజీరియా ఉంటున్నాయి.

సైన్స్‌, టెక్నాలజీ, బిజినెస్‌ విభాగాల్లోనే ఎక్కువ


అమెరికా గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాంలలో విదేశీ విద్యార్థులు ఎక్కువగా సైన్స్‌, టెక్నాలజీ, బిజినెస్‌ విభాగాల్లోనే నమోదు చేసుకుంటున్నారు. కొంతకాలంగా ఈ ప్రోగ్రాంలలో 21 శాతం పెరుగుదల కనిపించగా.. అండర్‌ గ్రాడ్యుయేట్‌లలో ఒక శాతం పెరిగింది. గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రాంలలో చాలా పురోగతి కనిపిస్తోంది. ఆ తర్వాత ఇంజినీరింగ్‌, బిజినెస్‌ విభాగాలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ విద్యార్థులకు గమ్యస్థానంగా ఉన్న ఇల్లినోయీ, టెక్సాస్‌, మిషిగాన్‌లు సహా 24 రాష్ట్రాల్లో చైనా కంటే భారతీయ విద్యార్థులే అధికంగా ఉన్నారు. కొవిడ్‌కు ముందు అమెరికాలో ఉన్నత విద్యకోసం వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఏటా సుమారు 11 లక్షలు ఉండేది. కొవిడ్‌ తర్వాత తగ్గి ఈ ఏడాది మళ్లీ ఆ స్థాయికి చేరువయింది. ఉన్నత విద్య కోసం అమెరికాను ఎంచుకోవడం ద్వారా భారతదేశ విద్యార్థులు రెండు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నారని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి పేర్కొన్నారు. ప్రపంచస్థాయి పోటీని తట్టుకుని రాణించేలా విద్యార్థుల్ని భారతీయ విద్యావ్యవస్థ తీర్చిదిద్దుతోందని కొనియాడారు. విద్యార్థినులూ సమాన సంఖ్యలో ఉండడం హర్షణీయమన్నారు. అమెరికాకు విదేశీ మారకద్రవ్య ఆర్జనలో విదేశీ విద్యార్థులది కీలకపాత్ర.

మరింత సమాచారం... మీ కోసం!

‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!

‣ నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

‣ ఎయిమ్స్‌ భోపాల్‌లో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు

‣ ఆన్‌క్యాంపస్‌, ఆఫ్‌క్యాంపస్‌ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.