• facebook
  • whatsapp
  • telegram

Medical Seats: మెడికల్‌ సీట్లు ఎందుకు మిగిలిపోతున్నాయి?

ఒకవైపు దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మరోవైపు మెడికల్‌ సీట్లు ఏటా భారీగా మిగిలిపోతున్నాయి. వ్యవస్థాగత లోపాలే దీనికి కారణం. దేశ అవసరాల రీత్యా వైద్య విద్యను చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలకు ఉపక్రమించాలి.
ప్రజారోగ్య వ్యవస్థకు వైద్య సేవలు, వైద్య విద్యలో ప్రమాణాలు రెండు కళ్లలాంటివి. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందాలంటే సరైన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలి. వారిలో నైపుణ్యం, సేవాతత్పరత, జవాబుదారీతనం చాలా ముఖ్యం. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచిస్తోంది. భారత్‌లో పదిహేను వందల పైచిలుకు ప్రజలకు ఒక డాక్టరు అందుబాటులో ఉన్నారు. పైగా వీరు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా పనిచేస్తున్నారు. దాంతో, పల్లెల్లో ఆరోగ్య సేవలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మరోవైపు స్పెషలిస్ట్‌ డాక్టర్ల కొరతా వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా నూతన వైద్య కళాశాలలు, మెడికల్‌ సీట్లు పెరుగుతుండటం హర్షణీయం. అయితే, ఏటా మెడికల్‌ సీట్లు మిగిలిపోతుండటం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.
కారణాలెన్నో..
ప్రస్తుతం భారత్‌లో దాదాపు ఏడు వందల వైద్య కళాశాలల్లో లక్షకు పైగా ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది నాలుగు విడతల కౌన్సెలింగ్‌ తరవాతా సుమారు వెయ్యి ఎంబీబీఎస్‌ సీట్లు మిగిలిపోవడం ఆవేదన కలిగిస్తోంది. ఆయా ప్రదేశాల్లో రిజర్వేషన్లకు సరిపడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోకపోవడం, లేదా వైద్య కళాశాలలు మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉండటం దీనికి కారణం కావచ్చు. మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అరవై ఎనిమిది వేల పైచిలుకు పీజీ సీట్లలో ఇటీవల రెండు విడతల కౌన్సెలింగ్‌ తరవాతా పదమూడు వేల సీట్లు ఖాళీగా మిగిలిపోవడం అందరినీ విస్మయపరచింది. సూపర్‌ స్పెషలిటీ విభాగాల్లో 156 వైద్య విద్యాలయాల్లో సుమారు రెండున్నర వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంతో పోటీ ఉండే ఈ కోర్సుల్లోనూ ఇటీవల సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. మిగిలిపోతున్న సీట్లను భర్తీ చేసేందుకు పీజీ విద్యలో అర్హత మార్కులను అంచెలంచెలుగా తగ్గించి, చివరకు కేవలం పరీక్షకు హాజరైతే చాలు సీటు పొందే అవకాశాన్ని ఇటీవల కల్పించారు. దీంతో యావత్‌ ప్రపంచం విస్తుపోయింది. దీనివల్ల వైద్యవిద్యలో ప్రమాణాలు దెబ్బతింటాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నీట్‌ పీజీ సీట్ల భర్తీలో భారత వైద్య మండలి తీరుపై నిరుడు సుప్రీంకోర్టు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు నీట్‌ పీజీ పరీక్ష ప్రశ్నపత్రం సంక్లిష్టతపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. నూటికి యాభై ప్రశ్నలు అభ్యర్థులందరూ సమాధానం రాసే విధంగా ఉండాలని, అవి రోజువారీ రోగుల సేవలకు సంబంధించి ఉండాలనే నిబంధన ఉంది. ప్రశ్నపత్రం రూపొందించే నిపుణులు ఈ అంశాన్ని పట్టించుకోకుండా క్లిష్టమైన ప్రశ్నలు ఇస్తున్నందువల్ల ఎక్కువ మంది అభ్యర్థులు అనర్హులుగా మిగిలిపోతున్నారన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.  
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వీటితో పోలిస్తే రోగులు తక్కువగా ఉండే కొన్ని ప్రైవేటు కళాశాలల్లో ఎక్కువ సీట్లు అందుబాటులో ఉంటున్నాయి. పైగా చాలా ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల మోత అధికం. ఈ వ్యయ భారంతో పాటు రోగులు ఎక్కువగా లేని కళాశాలల్లో నేర్చుకునే అవకాశం ఉండదన్న భావనతో చాలామంది అభ్యర్థులు వాటిలో చేరేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు పీజీ స్థాయిలో ఇచ్చే ఉపకార వేతనం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటోంది. దాంతో, అభ్యర్థులు ఎక్కువ ఉపకార వేతనం లభించే రాష్ట్రాల్లోని కళాశాలలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పీజీ ముగిసిన తరవాత కొన్ని రాష్ట్రాల్లో సంవత్సరాల తరబడి నిర్బంధ సేవ అమలులో ఉంది. ఇలాంటివన్నీ సీట్లు మిగిలిపోవటానికి కారణాలుగా నిలుస్తున్నాయి.
ఏమి చేయాలి?
వైద్య విద్యలో సీట్లు మిగిలిపోకూడదంటే ప్రశ్నపత్రాలను సహేతుకంగా రూపొందించాలి. ఉపకార వేతనాల చెల్లింపులు, నిర్బంధ సేవలు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండేలా జాతీయ వైద్య కమిషన్‌ సరైన విధానాలు రూపొందించాలి. ప్రైవేటు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రోగుల సంఖ్య, మౌలిక సదుపాయాల ఆధారంగా సీట్లను కేటాయించాలి. ప్రైవేటు వైద్య కళాశాలలు నిబంధనలు పాటించేలా పటిష్ఠ చర్యలు తీసుకోవడం తప్పనిసరి. నిత్యం వాటిలో తనిఖీలు జరపాలి. ఇటీవలి కాలంలో వైద్యవిద్య సామాన్యులకు అందని మావి పండు అయ్యిందన్నది కాదనలేని సత్యం. దీనివల్ల ప్రతిభ ఉన్న ఎంతోమంది తెల్లకోటు ధరించాలన్న కోరికను నెరవేర్చుకోలేకపోతున్నారు. గత్యంతరం లేక ఎందరో ఉక్రెయిన్‌, చైనా తదితర దేశాల బాట పడుతున్నారు. దేశీయంగా సీట్ల సంఖ్యను పెంచడంతో పాటు, ఫీజులు అన్నిచోట్లా హేతుబద్ధంగా ఉండేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. బోధించే వారు లేకుంటే, వైద్య విద్యను అభ్యసించడం ఎవరికైనా అసాధ్యం. అందువల్ల బోధనలో కీలకంగా నిలిచే అనాటమీ, ఫిజియాలజీ కోర్సుల్లోకి వయో పరిమితితో సంబంధం లేకుండా ప్రవేశాలు కల్పించాలి. కళాశాలల్లో వారికి అధిక వేతనాలు చెల్లించాలి. వసతి సౌకర్యమూ కల్పించాల్సిన అవసరం ఉంది.
తక్కువ గిరాకీ
వైద్య విద్యలో జనరల్‌ మెడిసిన్‌, రేడియాలజీ, డెర్మటాలజీ తదితర విభాగాలకు డిమాండు అధికంగా ఉంటుంది. వైద్య కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేయడానికి ఉపయోగపడే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ లాంటి కోర్సులకు అంతగా గిరాకీ ఉండదు. రోగితో నేరుగా సంబంధం ఉండే క్లినికల్‌ విభాగాల్లో సంపాదనకు అవకాశం ఎక్కువ. అనాటమీ వంటి బోధన సంబంధిత అంశాల్లో ఆదాయ వనరులు పెద్దగా లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఆ కోర్సులు చేయడానికి ఇష్టపడటంలేదు. ఫలితంగా ఆయా విభాగాల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. కొన్ని వైద్య కళాశాలల్లో నాణ్యమైన బోధన ఉంటుంది. వాటిలో రోగులూ పెద్ద సంఖ్యలో ఉంటారు. అలాంటి వాటిలో చేరడానికి అభ్యర్థులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. సరైన మౌలిక వసతులు, రోగుల సంఖ్య లేని కళాశాలల్లో సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు.

- డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ (ఏపీ వైద్యవిద్య మాజీ అదనపు సంచాలకులు)

మరింత సమాచారం... మీ కోసం!

‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!

‣ ఐటీలో ట్రెండింగ్‌ కోర్సులు

‣ మైక్రోసాఫ్ట్‌లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్‌ విద్యార్థిని సంహిత ఘనత

‣ మీ కెరియర్‌ ‘డిజైన్‌’ చేసుకోండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.