• facebook
  • whatsapp
  • telegram

polytechnic:ఇక పాలిటెక్నిక్‌లోనూ మైనర్‌ సబ్జెక్టుల విధానం

*కోర్‌ బ్రాంచీల విద్యార్థులూ ‘ఐటీ’ కోర్సులు చదవొచ్చు

* కొత్త టెక్నాలజీలపై అవగాహన పెంచడమే లక్ష్యం

* వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌లో ప్రవేశపెట్టిన మేజర్‌, మైనర్‌ సబ్జెక్టుల విధానం ఇక పాలిటెక్నిక్‌ విద్యలోనూ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ వంటి కోర్‌ బ్రాంచీల్లో చేరిన విద్యార్థులు ఐటీ సంబంధిత సబ్జెక్టులను అభ్యసించవచ్చు. ఆసక్తి ఉన్న అంశాలను మైనర్‌ కోర్సుగా చదువుకోవచ్చు. దీన్ని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌) వచ్చే విద్యాసంవత్సరం (2024-25) నుంచి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. పాలిటెక్నిక్‌లోనూ మేజర్‌, మైనర్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం దేశంలో ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు 70 శాతానికి పైగా కంప్యూటర్‌సైన్స్‌, ఐటీ సంబంధిత కోర్సులైన బీటెక్‌ సీఎస్‌ఈ, ఐటీ, ఏఐ అండ్‌ ఎంఎల్‌, సైబర్‌సెక్యూరిటీ, డేటాసైన్స్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఆ కోర్సులకే డిమాండ్‌ ఉండటం వల్ల కళాశాలల యాజమాన్యాలు సైతం కోర్‌ బ్రాంచీలైన మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌ వంటివాటిలో సీట్లు భారీగా తగ్గించుకుంటున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ రంగం దెబ్బతిన్నా.. ఉత్పత్తి రంగంలో భారీవృద్ధి ఉత్పన్నమైనా నిపుణుల కొరత తలెత్తుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) మేజర్‌, మైనర్‌ కోర్సుల విధానాన్ని రూపొందించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జేఎన్‌టీయూహెచ్‌ దాన్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. దీంతో బీటెక్‌ మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ తదితర బ్రాంచీల విద్యార్థులు ఎమర్జింగ్‌ టెక్నాలజీలకు సంబంధించిన సబ్జెక్టులపై మైనర్‌ కోర్సులను ఎంచుకొని అభ్యసిస్తున్నారు. ఇదే పరిస్థితి పాలిటెక్నిక్‌లో కూడా ఉండటంతో ఆ విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకురావాలని ఎస్‌బీటెట్‌ నిర్ణయించింది.

సర్టిఫికెట్‌లోనూ వివరాలు..

పాలిటెక్నిక్‌ మార్కుల మెమోలోనూ మేజర్‌, మైనర్‌ సబ్జెక్టుల వివరాలను పొందుపరుస్తారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠ్య ప్రణాళికను మార్చాలని ఒక్కో బ్రాంచికి ఒక్కో నిపుణుల కమిటీని నియమించిన అధికారులు.. ఏ బ్రాంచి అధ్యాపకులు ఏ మైనర్‌ సబ్జెక్టును అందించాలో నిర్ణయిస్తారు. ఉదాహరణకు మెకానికల్‌ బ్రాంచిలో రోబోటిక్స్‌, కంప్యూటర్‌సైన్స్‌ విభాగం సైబర్‌సెక్యూరిటీ, ఏఐ అండ్‌ ఎంఎల్‌.. ఇలా మైనర్‌ కోర్సులను అందిస్తారు. దీంతో డిప్లొమా మెకానికల్‌ విద్యార్థి ఏఐ అండ్‌ ఎంఎల్‌ కోర్సును ఎంచుకొని చదువుకోవచ్చు. దానికి 15 క్రెడిట్లు కేటాయిస్తారు. ఆ విషయాన్ని మార్కుల మెమోలోనూ ముద్రిస్తారు. స్వయం పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఆ కోర్సులను పూర్తి చేయవచ్చు. దానివల్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రయోజనం చేకూరుతుంది. ‘మేజర్‌, మైనర్‌ విధానం వల్ల కంప్యూటర్‌ సైన్స్‌ మాత్రమే చదవాలన్న భావన కొంతవరకు అయినా తగ్గుతుంది. భవిష్యత్తులోనూ మల్టీ డిసిప్లినరీ కోర్సులు వస్తాయి. కేవలం ఒకే సబ్జెక్టుకు పరిమితం కాకుండా రెండు మూడు సబ్జెక్టుల్లో పరిజ్ఞానం ఉండటం ఉద్యోగాలు పొందడంలో దోహదపడుతుంది’ అని ఎస్‌బీటెట్‌ కార్యదర్శి పుల్లయ్య అభిప్రాయపడ్డారు. మేజర్‌, మైనర్‌ విధానం కోసం అవసరమైతే ఏఐసీటీఈ నుంచి కూడా అనుమతి తీసుకుంటామని ఆయన తెలిపారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్‌లో ఉద్యోగాలు


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.