• facebook
  • whatsapp
  • telegram

Polytechnic: పాలిటెక్నిక్‌ కోర్సులు యథాతథం

* బీటెక్‌లో రెండేళ్లకు ఇచ్చే డిప్లొమా సర్టిఫికెట్‌ పాలిటెక్నిక్‌కు సమానం కాదు

* స్పష్టం చేసిన ఏఐసీటీఈ ఛైర్మన్‌ సీతారామ్‌

ఈనాడు, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు, కళాశాలల భవిష్యత్తుపై మూడేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తెరదింపింది. గతంలో మాదిరిగానే పాలిటెక్నిక్‌ కోర్సులు నడుస్తాయని స్పష్టం చేసింది. ఇటీవల దిల్లీలో అన్ని రాష్ట్రాల సాంకేతిక విద్యాశాఖ అధికారులతో నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌సీఆర్‌ఎఫ్‌) విధానంపై నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని ఏఐసీటీఈ ఛైర్మన్‌ సీతారామ్‌ స్పష్టం చేశారు. బీటెక్‌ రెండేళ్లు పూర్తయిన తర్వాత చదువు మానేసే వారికి ఇచ్చే డిప్లొమా సర్టిఫికెట్‌కు, మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమాకు అసలు పొంతనే లేదని, పాలిటెక్నిక్‌ కోర్సులు యథాతథంగా ఉంటాయని, అవి ఇండస్ట్రియల్‌ పరిజ్ఞానాన్ని పెంచేందుకు అందిస్తున్న కోర్సులని తేల్చి చెప్పారు. బీటెక్‌లో డిప్లొమా సర్టిఫికెట్‌తో ఉద్యోగాలు పొందే నైపుణ్యాలు సాధించలేరని, అది కేవలం మళ్లీ భవిష్యత్తులో బీటెక్‌ చదివేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని సీతారామ్‌ వివరించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి(ఎస్‌బీటెట్‌) కార్యదర్శి పుల్లయ్య చెప్పారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో 56 ప్రభుత్వ, 62 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో సుమారు 32 వేల సీట్లున్నాయి.


* ఎందుకొచ్చింది ఈ సందిగ్ధత..?

మూడేళ్ల క్రితం విడుదల చేసిన జాతీయ నూతన విద్యా విధానం-2020లో బీటెక్‌లో చేరి ఏడాది తర్వాత బయటకు వెళ్తే సర్టిఫికెట్‌, రెండేళ్ల తర్వాత వెళ్తే డిప్లొమా సర్టిఫికెట్‌ ఇస్తామని పొందుపరిచారు. దీంతో ఇక పాలిటెక్నిక్‌ కోర్సులు ఉండవని ఊహాగానాలు వినిపించాయి. గత ఏడాది కళాశాలలకు అనుమతుల ప్రక్రియకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఏఐసీటీఈ నిర్వహించిన సమావేశంలో పలువురు పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రతినిధులు ఈ విషయంపై  అప్పటి ఛైర్మన్‌ సహస్రబుద్ధేను ప్రశ్నించారు. దానిపై చర్చిస్తున్నామని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన సమాధానమివ్వడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. తాజాగా నూతన ఛైర్మన్‌ అవన్నీ అపోహలేనని స్పష్టత ఇచ్చారు.
 




మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.