• facebook
  • whatsapp
  • telegram

B.ED: బీఈడీ యాజమాన్యాలపై మరింత ఒత్తిడి

‣ కళాశాలల తనిఖీ అధికారం ఉన్నత విద్యామండలికి అప్పగింత
‣ లోపాలను సాకుగా చూపిఅడ్డంకులు సృష్టించకుండా పెద్దమొత్తంలో వసూళ్లు
‣ తెలంగాణలో కౌన్సెలింగ్‌ పూర్తయినా ఏపీలో ఇంకా సాగదీతే

ఈనాడు, అమరావతి: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ) కళాశాలల యాజమాన్యాలపై ప్రభుత్వం మరింత ఒత్తిడి పెంచుతోంది. ఇప్పటికే విశ్వవిద్యాలయాలు కమిటీలను ఏర్పాటు చేసి, తనిఖీలు పూర్తి చేశాయి. తాజాగా సర్కారు తరఫున తనిఖీలంటూ కమిటీలు వేసేందుకు ప్రభుత్వం జనవరి1న  ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యాశాఖకు ఉన్న తనిఖీల అధికారాన్ని ఉన్నత విద్యామండలికి దాఖలుపరిచింది. కళాశాలల్లో లోపాలను సాకుగా చూపి అడ్డంకులు సృష్టించకుండా సీటుకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేయాలని ఇటీవల గుంటూరులో సమావేశమైన యాజమాన్యాల ప్రతినిధులు నిర్ణయించారు.

ఉన్నత విద్యాశాఖలో అధికారులు, ఓ ప్రజాప్రతినిధికి ఇచ్చేందుకు ఈ వసూళ్లు చేపట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో వసూలు చేస్తున్న మొత్తాన్ని మరింత పెంచారు. ఒక్కో కళాశాల రూ.లక్ష వరకు ఇవ్వాలంటూ చెబుతున్నారు. ఈ అంశంపై యాజమాన్యాలు రెండు వర్గాలుగా విడిపోయాయి. ఒక వర్గం వారు మంగళవారం ఉన్నత విద్యాశాఖలోని కొందరిని కలిశారు.

మార్చిలో నిర్వహిస్తారా?

నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కళాశాలలను తనిఖీ చేయొచ్చు. కానీ, దీనికి నిర్దిష్ట సమయం ఉండాలి. విద్యా సంవత్సరం ప్రారంభంలో తనిఖీలు నిర్వహించి, కౌన్సెలింగ్‌ సకాలంలో జరిగేటట్లు చూడాలి. తెలంగాణలో పూర్తయినా ఏపీలో మాత్రం జనవరి వచ్చినప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై స్పష్టత లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 411 కళాశాలలు ఉన్నాయి. వీటన్నింటినీ మళ్లీ తనిఖీ చేసి, అనుమతులు ఇచ్చేందుకు ఎంత లేదన్నా రెండు నెలల సమయం పడుతుంది. అంటే మార్చిలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2023-24 విద్యా సంవత్సరం మే నెలతో ముగుస్తుంది. ఈ లెక్కన ఏపీలో బీఈడీ చదవాలనుకున్న విద్యార్థులు ఏడాది సమయం కోల్పోవాల్సి వస్తుంది. గతేడాది జూన్‌ 14న ఎడ్‌సెట్‌ నిర్వహించగా, జులై 14న ఫలితాలు విడుదల చేశారు. 11,236 మంది పరీక్ష రాయగా, 10,908 మంది అర్హత సాధించారు.

ఈ ఏడాది రూ.4 కోట్లకు పైగా..

రాష్ట్రంలో బీఈడీ కళాశాలల్లో ఇతర రాష్ట్రాల వారు ప్రవేశాలు పొందుతున్నారు. ఈ విషయం ఉన్నత విద్యాశాఖలో అందరికీ తెలిసిందే. దీన్ని బూచిగా చూపి, తనిఖీలంటూ హడావుడి చేయడం, ఆ తర్వాత యాజమాన్యాలు భయపడి ఆమ్యామ్యాలు ఇస్తుండటంతో కౌన్సెలింగ్‌ చేయడం పరిపాటిగా మారింది. గత నాలుగేళ్లుగా ఇదే విధానం కొనసాగుతోంది. గతేడాది గుంటూరుకు చెందిన ఓ కళాశాల యజమాని.. ఉన్నతాధికారులు, ఓ ప్రజాప్రతినిధికి ఇవ్వాలంటూ రూ.2 కోట్లు వసూలు చేశారు. ప్రస్తుతం ఈ మొత్తం రూ.4 కోట్లకు పైగా చేరుకుందని మరో ప్రతినిధి పేర్కొన్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ రక్షణ రంగంలో మేటి కొలువులు

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.